close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

సర్కారు ఆదేశాలు బేఖాతరు!

ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో తరగతులు
మూడు జూనియర్‌ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు
30-35 పాఠశాలలకు ఉన్నతాధికారుల హెచ్చరికలు
ఈనాడు, హైదరాబాద్‌

ర్టీసీ కార్మికుల ఆందోళన తీవ్రతరమవుతోంది. సున్నితమైన సమస్య కావటంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులోనే రాకపోకలు సాగిస్తుంటారు. సమ్మె కారణంగా పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు మరో వారంపాటు సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల తరువాత తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు పనిచేయాల్సి ఉండగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటికీ ఈనెల 20 వరకు సెలవులు పొడిగించారు. ఉత్తర్వులను ధిక్కరించి పాఠశాలలు తెరిస్తే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అయినా తమ పంథా మార్చుకోని పలు విద్యాసంస్థలు తరగతులను నిర్వహిస్తున్నాయి. పలు కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యాసంస్థలకు రాకపోతే వేతనాల్లో కోత విధిస్తామంటూ హెచ్చరించారు. విద్యార్థులు గైర్హాజరైతే రోజుకు రూ.100-200 వరకు అపరాధ రుసుం చెల్లించాలంటూ కొన్ని విద్యాసంస్థలు తల్లిదండ్రులకు సెల్‌ఫోన్‌ సందేశాలు పంపటం గమనార్హం.

అంతా.. మా ఇష్టం
అక్కడ నిబంధనలు వర్తించవు. ఉన్నతాధికారుల ఆదేశాలు వినిపించవు. వద్దని వారించినా యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తుంటారు. గ్రేటర్‌ పరిధిలో సెలవుల్లోనూ అధికసంఖ్యలో కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తున్నారనే విషయాన్ని గుర్తించి కొన్ని విద్యాసంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. బయటి ద్వారాలకు తాళాలు వేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు విద్యా సంస్థలను తెరిచామంటూ సాకులు చెబుతున్నారు. పదోతరగతి, ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు సిలబస్‌ పూర్తిచేయాలనే ఉద్దేశంతో పాఠాలు చెబితే తప్పేమిటంటూ కొందకు నిర్వాహకులు తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరైతే ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయటం గమనార్హం. గ్రేటర్‌ పరిధిలో 3,300 ప్రయివేటు పాఠశాలలు, 1,800పైగా జూనియర్‌ కళాశాలలు ఉంటాయని అంచనా. సుమారు 10 లక్షల మందికిపైగా విద్యార్థులు వీటిల్లో చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు వెళ్లేందుకు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణం సాగిస్తుంటారు. సమ్మె కారణంగా ఆటోలు, ప్రయివేటు వాహనాల్లో ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి రావటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. పలు విద్యాసంస్థల వాహనాలు కూడా ప్రభుత్వం అద్దెకు తీసుకోవటంతో సమస్య మరింత జఠిలంగా మారింది.

విద్యాశాఖ తనిఖీలు
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా ఏటా దిగజారుతోంది. వార్షిక పరీక్షలకు రెండు నెలల ముందుగానే సిలబస్‌ పూర్తిచేసేందుకు విద్యాసంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుత సమ్మె నేపథ్యంలో సెలవులు పొడగించటంపై ఉపాధ్యాయవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పలు ప్రయివేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. తరగతులు కూడా నిర్వహించాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 500కుపైగా ఉన్నత పాఠశాలలు తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలకు వస్తున్నారని తెలిసిన కొందరు నిర్వాహకులు పిల్లల్ని వెంటనే ఇళ్లకు పంపించి చేతులు దులుపుకొన్నారు. సుమారు 30-35 పాఠశాలలు తరగతులు నిర్వహించాయి. 25 కార్పొరేట్‌ పాఠశాలలనూ విద్యాశాఖ అధికారులు గుర్తించారు. మరోసారి తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహించే పాఠశాలలకు సీల్‌ వేయాలని హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంకటనర్సమ్మ డీవైఈవోలను ఆదేశించారు. సెలవులు ముగిసేంత వరకు నిత్యం తనిఖీలు చేట్టాలని పేర్కొన్నారు.

జూనియర్‌ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు
ఇంటర్‌ బోర్డు ఆదేశాలతో ఆర్జేడీ జయప్రద జిల్లా వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వం సెలవులను పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసినా పట్టించుకోని పలు కళాశాలలను గుర్తించారు. సోమవారం విద్యార్థులకు తరగతులు నిర్వహించిన శ్రీగాయత్రి (హిమాయత్‌నగర్‌), నారాయణ (నల్లకుంట), శ్రీచైతన్య (నారాయణగూడ) జూనియర్‌ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. రెండ్రోజుల్లోగా వివరణ తెలియజేయాలని ఆదేశించారు. ఈనెల 21న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.