close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

భయం భయంగా ప్రయాణం!

ఓఆర్‌ఆర్‌పై దడ పుట్టిస్తున్న భారీ వాహనాలు
బండలు, నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్‌
మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా మారని హెచ్‌ఎండీఏ తీరు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌కు తలమానికమైన బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌)పై ‘భారీ’ వాహనాలు దడ పట్టిస్తున్నాయి. రాళ్లు, నిర్మాణ వ్యర్థాలను ప్రమాదకరంగా తీసుకెళ్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా సర్వీస్‌ రోడ్లపై ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీఏ, పోలీసుల సహకారంతో ఇలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారులు మాత్రం అటువైపు చూడటం లేదు.

రోజూ 1.3 లక్షలు!
ముంబయి, నాగపూర్‌, వరంగల్‌, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులతో అనుసంధానించడంతో 158 కి.మీల అవుటర్‌ రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. రోజుకు సగటున 1.3 లక్షల వాహనాలు దూసుకెళ్తున్నాయి. 10 వేల వరకు సరకులు, యంత్రాలు, ఇతరత్రా సామగ్రిని తీసుకెళ్లే భారీ వాహనాలు ఉంటున్నట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. నానక్‌రాంగూడ-శంషాబాద్‌ ప్రధాన మార్గంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రతి నెలా టోల్‌ రూపేణా హెచ్‌ఎండీఏకు రూ.24 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

ఫిర్యాదు చేసినా!
వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. జరిమానాలు విధిస్తున్నామంటూ హెచ్‌ఎండీఏ అధికారులు తప్పించుకుంటున్నారు. ఓ వాహనదారుడు ఇదే అంశంపై కొన్ని రోజుల కిందట మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన కేటీఆర్‌ ప్రమాదకరంగా సరకులు, యంత్ర సామగ్రి, బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. యథావిధిగా భారీ వాహనాలు ఓఆర్‌ఆర్‌, సర్వీస్‌ రోడ్లపై దూసుకెళ్తూనే ఉన్నాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే..!
గుంతలు, పగుళ్లు, కంకర తేలి ప్రమాదకరంగా మారిన ఓఆర్‌ఆర్‌ ప్రధాన మార్గం, సర్వీస్‌ రోడ్లపై భారీ వాహనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలను తీసుకెళ్లే టిప్పర్లు, లారీలు వాహనదారులను భయపెడుతున్నాయి. పోనీ..తరలించేటప్పుడైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. కనీసం పైన కవర్లను కూడా కప్పడం లేదు. దీంతో వ్యర్థాలు రోడ్డుపైనే పడిపోతూ వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. గుంతలతో లారీలు, టిప్పర్లు కుదుపునకు గురై ఎక్కడ బండరాళ్లు తమ మీద పడిపోతాయోనంటూ బిక్కుబిక్కుమంటూ వాహనాలను నడపాల్సి వస్తుందంటూ పలువురు వాపోతున్నారు. గౌలిదొడ్డి మార్గం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ - కోకాపేట మధ్యలో రోడ్డు పక్కన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

కంకర తేలి.. గుంతలమయం
అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలీ నుంచి శంషాబాద్‌ వరకు గల ప్రధాన మార్గంపై ఎక్కడికక్కడ తారు లేచిపోయి కంకర తేలి ప్రమాదకరంగా మారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. నిబంధనల ప్రకారం ఏయే వాహనం ఆ లైన్‌లోనే ప్రయాణించాల్సి ఉన్నా.. గుంతలు రాగానే ఒక్కసారిగా వేగాన్ని తగ్గించుకోవాల్సి వస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా నిర్మించిన సర్వీస్‌ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాహనదారులపై దుమ్మెత్తి పోస్తున్నాయి. వట్టి నాగులపల్లి - ఖానాపూర్‌, వట్టి నాగులపల్లి- కుంట్లూరు, గచ్చిబౌలి-నార్సింగి, నానక్‌రాంగూడ -గచ్చిబౌలి రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మలుపుల వద్ద బండరాళ్లు ప్రమాదకరంగా మారాయి.

మరిన్ని వార్తలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.