close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

చరవాణి స్తంభం..వద్దు భయం!

‘ఈనాడు’తో డీవోటీ సీనియర్‌ డీడీజీ కె.రాంచంద్‌

టెలికాం రంగంలో 4జీ రాకతో సెల్‌ టవర్ల(స్తంభాల) సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి అయిదు నుంచి పది కి.మీ. విస్తీర్ణంలో ఇవి ఉన్నాయి. నగరాల్లో ఎత్తయిన భవనాలపైన ఎక్కడపడితే అక్కడ ఈ స్తంభాలను ఏర్పాటు చేశారు. క్రమంగా వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. వీటి నుంచి వచ్చే వికిరణం(రేడియేషన్‌)పై ప్రజల్లో పలు అనుమానాలున్నాయి. స్తంభాలను తొలగించాలనే నిరసనలను తరచూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. మరోవైపు సిగ్నల్స్‌ అందడం లేదనే ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. అసలు మొబైల్‌ టవర్ల నుంచి ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో వికిరణం వెలువడుతోందా? డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీవోటీ) ఏటా చేసే తనిఖీల్లో ఏం తేలింది? ఈ సందేహాల నివృత్తికి ‘ఈనాడు’ హైదరాబాద్‌లోని డీవోటీ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(డీడీజీ) కె.రాంచంద్‌తో నిర్వహించిన ముఖాముఖి ఇది.

ఈనాడు, హైదరాబాద్‌

ఈనాడు: నగరంలో ఎక్కడ చూసినా చరవాణి స్తంభాలే కన్పిస్తున్నాయి. ప్రైవేటు టెలికాం సంస్థలు సిగ్నల్‌ మెరుగ్గా ఉండేందుకు ఫ్రీక్వెన్సీని పెంచుతాయనే ఆరోపణలు ఉన్నాయి. పెంచితే వికిరణం(రేడియేషన్‌) అధికం కాదా?
రాంచంద్‌: ఏటా డీవోటీ పది శాతం స్తంభాలను తనిఖీ చేస్తుంది. అక్కడక్కడ కొన్నింటిని ఎంపిక చేసి.. ఆకస్మికంగా వెళ్లి అన్ని అంశాలను పరీక్షిస్తాం. వికిరణం ఎంత వెలువడుతుందో తెలుసుకుంటాం. ఇప్పటివరకు ఒక్క స్తంభం కూడా పరిమితికి మించి వికిరణం విడుదల చేసినట్లు తనిఖీల్లో తేలలేదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్లయితే తనిఖీల్లో వెల్లడయ్యేది కదా! నిబంధనల మేరకే ఉంటున్నాయి.

ఈనాడు: స్తంభాల నుంచి వెలువడే వికిరణం నిజంగా ప్రమాదకరమా?
రాంచంద్‌: వికిరణం తీవ్రతను బట్టి అయోనైజింగ్‌, నాన్‌ అయోనైజింగ్‌ అని రెండుగా విభజించారు. అయోనైజింగ్‌ వికిరణం ప్రమాదకరం. ఎక్స్‌రే, గామా కిరణాలు దీని కిందకు వస్తాయి. అందుకే ఎక్స్‌రే తీసేటప్పుడు ఆ ప్రభావం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. నాన్‌ అయోనైజింగ్‌ కిందకు ఎఫ్‌ఎం రేడియోలు, టీవీలు, చరవాణులు, విద్యుత్తు బల్బులు, రాడార్లు, రిమోట్‌, సూర్యకిరణాలతో పాటు సెల్‌ స్తంభాలు కూడా వస్తాయి. ఇవి శరీరానికి హాని చేయవు. సూర్యుడి నుంచి వెలువడే వాటిలో అల్ట్రావైలెట్‌ కిరణాలు ప్రమాదకరం. దీన్నుంచి రక్షణగా లేపనాలు(లోషన్లు) రాసుకుని బయటకు వెళుతుంటాం. అదే విధంగా సెల్‌ స్తంభాల నుంచి రక్షణగా డీవోటీ ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎమిషన్స్‌పై కొన్ని పరిమితులు విధించింది.

ఈనాడు: వికిరణం పరిమితి ఎంత వరకు ఉండొచ్చు? ఎలా లెక్కిస్తారు?
రాంచంద్‌: మన సెల్‌ టవర్ల పౌనఃపున్యం 900, 1800, 2100, 2300 మెగాహెడ్జ్‌ వరకు ఉంటున్నాయి. స్తంభాలకు 50 మీటర్ల దూరం నుంచి రేడియేషన్‌ పరీక్షించినప్పుడు చదరపు మీటర్‌కు ఒక వాట్‌ వరకు ఉండొచ్చు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయోనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌(ఐసీఎన్‌ఐఆర్‌పీ) నిర్దేశించిన ప్రమాణాల్లో పదో వంతు. ఇప్పటివరకు డీవోటీ తనిఖీల్లో పరిమితికి లోబడి ఉన్నట్లు తేలింది. కాబట్టి టవర్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదు.

ఈనాడు: చరవాణులు ఎంత వరకు సురక్షితం?
రాంచంద్‌: చరవాణి నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. గరిష్ఠంగా 1.6 వాట్‌ ఫర్‌ కేజీగా నిర్దేశించింది. దీనికి లోబడే చరవాణులను తయారు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 2 వాట్‌ ఫర్‌ కిలో వరకు అనుమతిస్తున్నారు. మీ ఫోన్లలో ఏ స్థాయిలో రేడియేషన్‌ ఉందో *చి07చి ద్వారా తెలుసుకోవచ్చు.

ఈనాడు: మన వద్ద నెట్‌వర్క్‌ విస్తరణ ఎలా ఉంది?
రాంచంద్‌: తెలంగాణ రాష్ట్రంలో 22,893 ప్రాంతాల్లో 82,087 మొబైల్‌ టవర్లు ఉన్నాయి. వినియోగదారుల సంఖ్య 4.39 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో 20,976 ప్రాంతాల్లో 76,305  మొబైల్‌ టవర్లు ఉన్నాయి. జులై నాటికి 5.01 కోట్ల మొబైల్‌ వినియోగదారులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌, ఎయిర్‌సెల్‌ కలిపి ఏకంగా 1,58,392 టవర్లు ఉన్నాయి. అత్యధికం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి.

ఈనాడు: సందేహాల నివృత్తి ఎలా?
రాంచంద్‌: మీ ఇంటికి సమీపంలో ఎన్ని సెల్‌ స్తంభాలున్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను ‌www.tarangsanchar.gov.in  వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. ఏదైనా స్తంభం నుంచి అధిక వికిరణం వెలువడుతోందనే అనుమానం ఉంటే కవాడిగూడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం కార్యాలయంలోని డీడీజీకి ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.