close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

నకిలీ సందేశాల కనికట్టు.. ఇలా కనిపెట్టు

తెలియకుండానే అవాస్తవాలు ప్రచారం
సాంకేతికతతో పట్టేయవచ్చంటున్న నిపుణులు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:

* మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్లు వచ్చాయి. వాటిని వేసుకున్నారంటే శరీరంపై దుద్దుర్లు వస్తున్నాయి. వాటికి దూరంగా ఉండండి అంటూ.. ఓ ట్యాబ్లెట్‌ పంపిణీ సంస్థ పేరును చెబుతూ నకిలీ సందేశం వైరల్‌గా మారింది. తీరా గమనిస్తే అది ఓ టిష్యూ పేపర్‌ ట్యాబ్లెట్‌. ఈ విషయాన్ని గుర్తించని చాలా మంది హడావుడిగా అందరికీ షేర్‌ చేశారు.
* ఓ కిడ్నాప్‌ ముఠా భాగ్యనగరంలోకి వచ్చిందంటూ.. వేరే నగరంలో జరిగిన ఓ ఘటన వీడియోను వదిలితే అది గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారిపోయింది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి చెప్పే వరకు అది వదంతు అని తెలియని పరిస్థితి. నకిలీ వార్తలను సృష్టించడమే కాదు దాన్ని ఇతరులతో పంచుకునే వారిపైనా చర్యలుంటాయని అధికారులు హెచ్చరించే వరకూ వెళ్లింది వ్యవహారం.

సామాజిక మాధ్యమాల్లో, అంతర్జాలంలో నకిలీ వార్తలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. క్షణాల్లో అవి వైరల్‌గా మారి అవాస్తవాలనూ ప్రచారం చేసినట్లవుతోంది. వీటిలో కొన్నింటిని కావాలనే ప్రచారం చేస్తున్నారు. కొంతవరకు నిజాలు ఉన్నప్పటికీ మిగతావి కల్పితంగా ఉంటాయి. చరవాణికి వచ్చిన సందేశాలు, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న సందేశాల ఆధారంగా ఎవరికి ప్రయోజనం ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కొందరు తమ వెబ్‌సైట్‌ను ఎక్కువ మంది చూడాలని, ఏదైనా వస్తువు అమ్మే క్రమంలో ఇలాంటి కథనాలను సృష్టిస్తారు. లేదా పోటీగా ఉండే ఇతరుల వస్తువులను కొనుగోలు చేయకుండా వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు సభల్లో మాట్లాడిన పూర్తి ప్రసంగాన్ని చూపకుండా కేవలం ఆ మాటలను వక్రీకరించి కొంత భాగాన్ని మాత్రమే చూపిస్తూ.. వ్యతిరేక ప్రచారం చేస్తుండటాన్ని గమనిస్తూనే ఉన్నాము. సాంకేతికత సహాయంతో వదంతులను గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు.

నిజాలను గుర్తించలేరు...
నకిలీ వార్తలు ఎక్కువగా వైరల్‌ అవడంతో వాస్తవాలను సైతం గుర్తించలేని పరిస్థితి. వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజమా కాదా తెలుసుకోకుండానే ఇతరులకు షేర్‌ చేయడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అంతర్జాలంలోనే కాదు నిజజీవితంలోనూ ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి.

యూఆర్‌ఎల్‌ను పరిశీలించాలి..
సందేశం వచ్చిన వెంటనే దాన్ని పంపిన వ్యక్తి.. వెబ్‌సైట్‌.. బ్లాగ్‌ ఏదైనా నమ్మదగిందా లేదా గమనించాలి. ఆ వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను మరోసారి పరిశీలించాలి. ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా గమనించాలి. ‘.కామ్‌’, ‘.ఇన్‌’ చివరి పదాల వరకూ పరిశీలించి ఓ నిర్ణయానికి రావాలి.

నిపుణులు చెప్పారా...?
విశ్వసనీయ సమాచారం ఎప్పుడూ అనేక రకాల కారణాలు, ఉదాహరణలతోపాటు నిపుణులు సైతం దానిపై వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆధార సహిత గణాంకాలు అందులో పొందుపరిచే అవకాశం ఉంటుంది. ఆధార రహితంగా ఉన్న సమాచారం ఎక్కడ నుంచి వచ్చింది, ఇందులో వ్యాఖ్యలు చేసిన వారు నిపుణులా లేదా అనేది గమనించాలి.

గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌...
చిత్రాలను మార్ఫింగ్‌ చేయడం దాని ఆధారంగా నకిలీ సందేశాలను ప్రచారం చేయడం గమనిస్తూనే ఉన్నాము. అసలు చిత్రానికి, నకిలీ చిత్రానికి తేడా తెలియకుండా ఉండేందుకు అనేక యాప్స్‌, సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో అసలు, నకిలీ మధ్య తేడాలను కనిపెట్టలేకపోతున్నాము. ఇలాంటి చిత్ర సందేశాలను మరోసారి పునఃపరిశీలించుకోవడానికి గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ టూల్‌ను ఉపయోగించుకోవాలి. దీనితో ఇమేజ్‌ ఆధారంగా లేదా ఇమేజ్‌ యూఆర్‌ఆల్‌ ద్వారా వెతకడంతో అసలు చిత్రం ఎక్కడుందో తెలుస్తుంది.

అసహజంగా ఉంటే నకిలీదే.. : నల్లమోతు శ్రీధర్‌, సాంకేతిక నిపుణులు
రూ.50,000 చరవాణి కేవలం రూ.1000 కే వస్తుందని, ప్రముఖ కంపెనీ కళ్లజోడు అతి తక్కువ ధరకే లభిస్తోంది కింద కనిపించే వెబ్‌సైట్‌ లింక్‌లో వివరాలను నమోదు చేసి పది మందికి ఈ సందేశాన్ని పంపితే చాలు మీ ఇంటికే వస్తువు వచ్చి చేరుతుంది అంటూ సందేశాలు వస్తుంటాయి. వీటిని తయారుచేసేవారు సైతం చాలా సృజనాత్మకతను ఉపయోగిస్తారు. ఒప్పించే విధంగా, అసహజంగా ఉంటే అది కచ్చితంగా నకిలీ సందేశమని గుర్తించాలి. ఈ తరహా వార్తలు ఎప్పటి నుంచి సర్క్యులేట్‌ అవుతున్నాయో.. గమనించడానికి హోక్స్‌ ఫైండర్‌ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలి. ఇందులో ఏ వార్త ఎప్పటి నుంచి ప్రచారంలో ఉందనే విషయం పొందుపరుస్తారు. లేదా సందేశంలోని కొంత భాగాన్ని కాపీ చేసి గూగుల్‌లో వెతికినా వాస్తవాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.