close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

పంచాయతీలకు భారీగా నిధులు

● విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

● ఉమ్మడి జిల్లాకు రూ.46,78,93,400 మంజూరు

● గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు

● ప్రతి మనిషికి రూ.165.69 చొప్పున

న్యూస్‌టుడే, పాలమూరు


హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామ పంచాయతీ

గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ప్రతి నెలా పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు వచ్చిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నారు. పంచాయతీలో నివసిస్తున్న జనాభాకు అనుగుణంగా లెక్కలు వేసి వాటికి నిధులను మంజూరు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో డీపీవోలతోపాటు డీఎల్పీవోలు, కార్యాలయ సిబ్బంది వచ్చిన నిధులపై కసరత్తు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న అన్ని సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు నివేదికలను సమర్పిస్తున్నారు. అనంతరం నేరుగా ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము జమ కానుంది. వచ్చిన డబ్బును పంచాయతీ సర్పంచి, పాలక మండలి సభ్యులు, కార్యదర్శులు ఖర్చు చేయనున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 72 మండలాల పరిధిలోని 1,684 గ్రామ పంచాయతీల్లో 28,23,808 మంది జనాభా (పురపాలక సంఘాలలో నివసిస్తున్న జనాభా కాకుండా) నివసిస్తున్నారు. వారిలో ప్రతి వ్యక్తికి రూ.165.69 చొప్పున డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనివల్ల ఉమ్మడి జిల్లాకు 46,78,93,400లు వచ్చాయి. అందులో 14వ ఆర్థిక సంఘం నిధులే ఎక్కువ. ఇవి రూ.28,01,83,900లు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18,77,09,500ల చొప్పున ఉన్నాయి. 14వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను ఒక్కరికి రూ.99.22ల చొప్పున రాగా, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.66.47ల చొప్పున ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. వాటి వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.

మెరుగు పడనున్న మౌలిక వసతులు : గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండటంతో ఇక పల్లెల్లో మౌలిక వసతులు మారనున్నాయి. గతంలో నిధులు లేక నిస్తేజంగా ఉన్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు నిధుల ప్రవాహంతో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. అంతేకాకుండా ఏడాదిన్నర నుంచి పంచాయతీల డబ్బుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఖాతాల్లోనే నిధులు ఉండిపోయాయి. ఇప్పుడు సర్పంచి, ఉప సర్పంచికి చెక్‌ పవర్‌ ఇవ్వడంతో పంచాయతీల్లో పాలక మండలి సభ్యులు పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వాటికి తోడుగా ప్రత్యేక ప్రణాళిక పేరుతో ప్రతి నెలా నిధులు పంచాయతీలకు రానుండటంతో పడకేసిన పనులన్నీ ఇప్పుడు కొనసాగించనున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువలు, రహదారులు, సిబ్బంది వేతనాలు, విద్యుత్తు, మొక్కల పెంపకం, డంపింగ్‌ యార్డు నిర్వహణ తదితర వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీలలో చేపడుతున్నారు.


గ్రామ పంచాయతీల ఖాతాల్లోకే..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన నిధులను ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకే నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాభా ప్రాతిపదికన లెక్కించి వాటికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నిధులను కేటాయిస్తున్నాం. వాటిని అభివృద్ధి పనులకు, సిబ్బంది వేతనాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా అన్ని గ్రామ పంచాయతీల ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి.

- వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి, మహబూబ్‌నగర్‌


జిల్లా పంచాయతీలు గ్రామీణ జనాభా కేటాయించిన నిధులు (రూ.లలో)

(14వ ఆర్థిక సంఘం) (రాష్ట్ర ఆర్థిక సంఘం)

నాగర్‌కర్నూల్‌ 453 7,43,595 7,37,81,000 4,94,29,700

మహబూబ్‌నగర్‌ 441 6,53,626 6,48,54,000 4,34,49,000

జోగులాంబ గద్వాల 255 4,84,911 4,81,13,900 3,22,34,000

నారాయణపేట 280 4,82,080 4,78,33,000 3,20,45,800

వనపర్తి 255 4,59,596 4,56,02,000 3,05,51,000

మొత్తం 1,684 28,23,808 రూ.28,01,83,900 రూ.18,77,09,500


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.