close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

కాసుల గలగల!

● రుసుంతో ప్రభుత్వానికి రూ.67.64 కోట్ల ఆదాయం

● దరఖాస్తులు గతంతో పోలిస్తే తగ్గుదల

● చివరి రోజు భారీగా వచ్చిన మద్యం వ్యాపారులు

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)


వ్యాపారుల దరఖాస్తులను పరిశీలిస్తున్న ఆబ్కారీ సిబ్బంది

మద్యం దుకాణాల టెండరు ప్రక్రియ ముగిసింది.. అందరు అనుకున్నట్లే చివరి రోజు దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు పోటెత్తారు.. గత సంవత్సరం వచ్చిన దరఖాస్తుల కంటే మాత్రం తగ్గుదల కనిపించింది.. ప్రభుత్వ ఆదాయం మాత్రం రెట్టింపు అవడం విశేషం.. ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాత్రమే దరఖాస్తులు పెరిగాయి.

మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో ఈసారి చివరి రోజు వరకు కూడా పెద్దగా దరఖాస్తుల్లో పెరుగుదల కనిపించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం వరకు 1,276 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో మొత్తం మూడు వేలలోపు దరఖాస్తులే వస్తాయని అధికారులు భావించారు. అనూహ్యంగా బుధవారం ఒక్కరోజే 2,106 దరఖాస్తులు రావడంతో మొత్తం దరఖాస్తులు 3,382 అయ్యాయి. తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బుధవారం ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇవ్వడంతో ఒక్కసారిగా దరఖాస్తులు పెరగడం కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో గత ఏడాది కంటే దరఖాస్తులు తగ్గినా చివరి రోజు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. నారాయణపేట జిల్లాలోనూ దరఖాస్తులు పెరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో నడిగడ్డకు చెందిన ఓ నాయకుడు తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తుండటంతో ఈసారి వేరేవారు దుకాణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. తాజా ఉత్తర్వుతో స్థానిక వ్యాపారులతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వ్యాపారులూ ఆ రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ దరఖాస్తులు పెరిగాయి. మొత్తంగా గతేడాది కంటే 358 దరఖాస్తులు తగ్గినా రూ.30.24 కోట్ల ఆదాయం పెరిగింది.

మిడ్జిల్‌ దుకాణానికి 63 దరఖాస్తులు : ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని సర్కిళ్ల పరిధిలో దరఖాస్తులు తగ్గాయి. కాని జడ్చర్ల ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో మాత్రమే దరఖాస్తులు విపరీతంగా పెరిగాయి. సర్కిల్‌ పరిధిలోని అడ్డాకుల, మూసాపేట, భూత్పూరు, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, మిడ్జిల్‌ మండలాలు ఉన్నాయి. ఈ దుకాణాలకు విపరీతంగా డిమాండ్‌ కనిపించింది. స్థానిక వ్యాపారులతోపాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వారు దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం ఈ ఒక్క సర్కిల్‌ పరిధిలోనే 512 దరఖాస్తులు రావడం విశేషం. వీటిలో అత్యధికంగా మిడ్జిల్‌ మద్యం దుకాణానికి 63 దరఖాస్తులు వచ్చాయి. దీని తర్వాత మహబూబ్‌నగర్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌కు 433 దరఖాస్తులు వ్యాపారులు చేసుకున్నారు. ఇతర ఏ సర్కిళ్లలో ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు రాలేదు.

వ్యాపారుల పరిశీలన : వ్యాపారులు ఏ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయో తెలుసుకుని వాటికే దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపడం కనిపించింది. దీంతోపాటు రిజిస్టర్‌లో లక్కీనంబర్‌ కోసం వేచి చూస్తూ కనిపించారు. తమ రాశి ప్రకారం లక్కీ నంబరును ఎంపిక చేసుకునేందుకు ఆబ్కారీ అధికారులతో మాట్లాడి ఆ నంబర్‌ తమ దరఖాస్తుకు వచ్చే విధంగా చూశారు. తెలిసిన వారు, కుటుంబ సభ్యుల్లో అదృష్టవంతులుగా భావించే వారిని తీసుకువచ్చి దరఖాస్తులు చేయించారు.


దరఖాస్తులు తగ్గాయి..

గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. అదే సమయంలో ప్రభుత్వంకు ఆదాయం మాత్రం పెరిగింది. చివరి రోజు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో లక్కీడిప్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- జయసేనారెడ్డి, ఎక్సైజ్‌శాఖ ఉప కమిషనర్‌


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.