close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

కదులుతున్న అక్రమాల డొంక!

నిబంధనలకు విరుద్ధంగా 693 నల్లాలు

అనేకమంది గృహ నల్లాల ముసుగులో వాణిజ్య అవసరాలకు నీటిని వినియోగించుకుంటున్నారు. తాజా సర్వేలోనూ అదే బయట పడుతోంది. ఇప్పటివరకు 3,423 నల్లాలను సర్వే చేయగా, ఇందులో 321 నల్లాలు వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు తేలింది. వెంటనే కేటగిరి మార్పునకు సర్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నల్లాల గుట్టు వీడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడుకుంటున్న వినియోగదారులపై జలమండలి కొరఢా ఝళిపిస్తోంది. ఇంటింటి సర్వేలో భాగంగా గురువారం నాటికి దాదాపు 3423 నల్లాలను పరిశీలించారు. ఇందులో 693 నల్లాలు అక్రమమేనని గుర్తించారు. వీటిపై రూ.కోటి వరకు జరిమానా విధించారు. కేటగిరీ మార్పు ద్వారా మరో రూ.10 లక్షల వరకు అదనంగా బోర్డుకు ఆదాయం సమకూరనుంది. ఈ ప్రయోగాత్మక సర్వే విజయవంతం కావడంతో మరో 150 బృందాలను రంగంలోకి దించాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ నిర్ణయించారు.
గ్రేటర్‌ వ్యాప్తంగా 10 లక్షల నల్లాలు ఉన్నాయి. జనాభా, ఆవాసాలు పెరుగుతున్నా బోర్డు ఆదాయంలో మార్పు లేదు. రూ.120 కోట్ల వరకు ప్రతి నెలా ఆదాయం వస్తుండగా వేతనాలు, ఇతర వ్యయాలు కలిసి రూ.150 కోట్ల వరకు ఖర్చవుతోంది. అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వం వైపు చూడడం లేదా అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే కృష్ణా, గోదావరి పథకాలు.. శివారు మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, అవుటర్‌ గ్రామాలకు నీరందించే కార్యక్రమాలకు రుణాలు తెచ్చి పూర్తి చేశారు. విద్యుత్తు ఛార్జీల బకాయిలు రూ.850 కోట్ల వరకు చేరాయి. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. ఇటీవలి జరిగిన మంత్రి సమీక్షలో సైతం ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.

అక్రమాల తంతు ఇలా...
గ్రేటర్‌ వ్యాప్తంగా లక్షల్లో వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తులు, వ్యాపార సముదాయాలున్నాయి. జలమండలి రికార్డుల్లో కేవలం 40 వేల లోపే వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు లెక్కలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గృహ, వాణిజ్య, బహుళ అంతస్తుల నీటి బిల్లుల్లో భారీగా తేడా ఉంటుంది. గృహాల కోసం వినియోగించే నీటికి వేయి లీటర్లకు రూ.10 మాత్రమే బిల్లు వసూలు చేస్తున్నారు. అదే వాణిజ్య, బహుళ అంతస్తుకు కనీసం రూ.40 నుంచి ప్రారంభమవుతాయి. టెలిస్కోపిక్‌ విధానంలో నీటి వినియోగం బట్టి ఛార్జీలు పెరుగుతుంటాయి. కొన్ని భవనాలు రూ.లక్షల్లోనే బిల్లులు చెల్లించాలి.  కొన్ని భవనాలకు నల్లా కనెక్షన్లు తీసుకుని.. సీవరేజ్‌ను మాత్రం అక్రమంగా జలమండలి పైపుల్లో కలుపుతున్నారు. ఇలాంటివి 130 కనెక్షన్లు ఇలాంటివి గుర్తించారు. మరో 143 బహుళ అంతస్తుల భవనాలకు సాధారణ నల్లాలను వాడుతున్నట్లు తేలింది. 33 అక్రమ నల్లాలు, మరో 66 కనెక్షన్లు అసలు రికార్డుల్లోనే లేనట్లు తేల్చారు. తగిన జరిమానాతో క్రమబద్ధీకరించనున్నారు.

 క్యాన్‌ నంబరుతో ఇంటి ఫొటో..
భవిష్యత్తులో అక్రమాలకు తావు లేకుండా క్యాన్‌ నంబరుతో సదరు ఇంటి ఫొటోను జతచేసి బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఇలా గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని భవనాలు, ఇళ్ల వివరాలను నమోదు చేయాలని ఎండీ దానకిషోర్‌ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను ప్రతి డివిజన్‌, సెక్షన్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల ఇంటిని నిర్మించినా సరే...పాత ఫోటో ఆధారంగా కేటగిరి మార్చే వీలుంటుంది. క్షేత్ర స్థాయిలో లైన్‌మెన్లు, మేనేజర్లు తరచూ పరిశీలిస్తుండటం వల్ల అక్రమాలు లేకుండా చూడడంతో పాటు బోర్డు ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది. అక్రమ నల్లాలు తీసుకుంటే క్రిమినల్‌ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.