close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ

ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యం
పెద్దఎత్తున స్టోరేజీ, ప్రాసెసింగ్‌ యూనిట్లు
రైతులకు సొంత భూములు ఉండవు
చైనాలో వ్యవసాయంపై డీఏవో అధ్యయనం

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. సస్యరక్షణ చర్యల్లో మెలకువలు.. వెరసి అధిక దిగుబడులు.. చైనాలో సాగు రంగంలో వస్తున్న మార్పులతో కాలక్రమేణా పెట్టుబడి తగ్గుతుండగా.. దిగుబడులు పెరుగుతున్నాయి. పంట సాగుతో పాటు ఆహార ఉత్పత్తులను తయారు చేయడం ప్రత్యేకత.. దీంతో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ వెల్లడించారు.. చైనాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై నెల రోజుల పాటు అధ్యయనం చేసిన ఆయన పలు విషయాలను తెలుసుకున్నారు. ఆ వివరాలు..

న్యూస్‌టుడే, కరీంనగర్‌ వ్యవసాయం

చైనాలో పంటలతో వచ్చే ఆదాయం కన్నా రకరకాల ఉత్పత్తులు సృష్టించి మెరుగైన లాభాలు గడిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూలీల కొరతను అధిగమిస్తూ.. తక్కువ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వారి ప్రత్యేకత. వాతావరణ పరిస్థితులను పంట దిగుబడులకు అనుకూలంగా మలచుకునేలా స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్వహిస్తుంటారు.

ప్రభుత్వ ఆధీనంలోనే భూములు
చైనాలో 200 మిలియన్ల ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. సాగు భూములకు యాజమాన్య హక్కు ఉండకపోగా ప్రభుత్వ ఆధీనంలోనే భూములు ఉంటాయి. సాగు చేసేవారికి లీజుకు మాత్రమే ఇస్తుంటారు. అత్యధికంగా 90 ఏళ్ల వరకు లీజుకు ఇస్తారు. వచ్చే ఫల సాయాన్నే పొందాలి. నివాస స్థలాలైనా అంతే.. అక్కడ ఏదీ ఎవరిది కాదు. అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటుంది. ధాన్యం, గోధుమలు, టమాట, జొన్న, సోయాబీన్‌, బంగాళదుంప, వేరుశనగ వంటి ప్రధాన పంటలు పండిస్తారు.

ప్రభుత్వమే సూచిస్తుంది..
అక్కడి ప్రభుత్వం చేతిలోనే సాగు ఆధారపడి ఉంటుంది. ఏ పంట వేయాలన్నది పరోక్షంగా సూచిస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు ఇన్సెంటివ్‌ ప్రకటిస్తుంది. దాన్ని బట్టి కచ్చితంగా ఆ పంటలనే సాగు చేస్తారు. పంట దిగుబడికి లక్ష్యం విధిస్తారు.. తదనుగుణంగా దిగుబడి రాబట్టిన వారికి ఇన్సెంటివ్‌లు ఇస్తారు. విత్తనం, ఎరువులు, పెట్టుబడి సాయం ఏమీ ఉండకపోగా ఇన్సెంటివ్‌ ఒక్కటే ఆధారం. గ్రామ కమిటీలు కొనుగోలుదారులు, విక్రయదారులను సమన్వయపరిచి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తాయి. తప్పనిసరిగా మద్దతు ధరకే కొనుగోలు చేస్తారు.

పంట ఉత్పత్తులతోనే అధిక లాభాలు
మన దగ్గర పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం 20 మిలియన్‌ టన్నులు కానీ, చైనాలో పదింతలు రెట్టింపుగా 120 మిలియన్‌ టన్నులు నిల్వ చేసేవి ఉన్నాయి. పురుగు రాకుండా నిల్వ చేయడం, భారీఎత్తున ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఉష్ణోగ్రత తక్కువ చేయడం దాని ప్రత్యేకత. మన ప్రాంతంలో హైబ్రిడ్‌ ధాన్యం హెక్టారుకు 7-8 టన్నులు మాత్రమే దిగుబడి వస్తే అక్కడ 14-16 టన్నుల దిగుబడి సాధిస్తారు. అక్కడ దేశం మొత్తం మీద హైబ్రిడ్‌ విత్తనాలే సాగు చేస్తుంటారు. వేరే రకాలుండవు. హైబ్రిడ్‌ విత్తనాల రూపకర్త లాంగ్‌పింగ్‌.. అతని వల్లే దిగుబడుల్లో గణనీయ మార్పులు సాధించారు. వరితో పాటు గోధుమలు, టమాట, జొన్న, సోయాబీన్‌, బంగాళదుంప, వేరుశనగ వంటి పంటలన్ని హైబ్రిడ్‌ విత్తనాలే..

పొదుపుగా నీటి వినియోగం
నదులు, ఇతర నీటి ద్వారా పంటలు సాగు చేస్తుంటారు. నీటికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పొదుపుగా నీటిని వినియోగిస్తారు. బిందు, తుంపర సేద్యం ఎక్కువ. గ్రామాల్లో 2 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాలు సాగు చేసే రైతులున్నారు. రైతు తలసరి ఆదాయం మన దేశంలో 7060 డాలర్లు కాగా చైనాలో 16760 డాలర్లు.

చట్టాలు కఠినం..
అక్కడ శాఖాహారులే ఎక్కువ.. అయినా శారీరకంగా దృఢంగా ఉంటారు. పాలు తాగరు. శారీరక సౌష్టవం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. చట్టాలు కఠినం. ఎంతటివారైనా శిక్షార్హులే. మహిళలకు పూర్తి రక్షణ ప్రాంతం. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం. పంటలు దిగుబడి వచ్చాక, వాటిని వివిధ రకాల ఉత్పత్తులుగా తయారు చేసి విక్రయిస్తుంటారు. ఒక బియ్యం నుంచే 50 వెరైటీలు తయారుచేయడం వారి ప్రత్యేకత.’’

మరిన్ని వార్తలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు. క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి. వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు. మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.