close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

సార్వత్రిక విద్య.. భవితకు భరోసా

ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌, ఎస్సెస్సీలో నూతనంగా ప్రవేశాలు
ఈనెల 21 వరకు దరఖాస్తు గడువు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యా విభాగం

ఆర్థిక, సామాజిక పరిస్థితులతో బాల్యంలో చదువులకు దూరమైన వారికి విద్యావకాశాలను కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసానిస్తోంది సార్వత్రిక విద్య(ఓపెన్‌ స్కూల్‌).. చదువులకు దూరమైన వారికి దూర విద్య ద్వారా విద్యను చేరువ చేస్తోంది.. పాఠశాల విద్యలో కీలకమైన పదో తరగతి చదవనివారు, ఇంటర్‌ చదవనివారు, పూర్తి చేయనివారికి తోడు చదువులను మధ్యలో మానేసిన వారు దీని ద్వారా ఆ అర్హతలను సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వారు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వారి వారి పనులు చేసుకుంటూనే సెలవు దినాల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌ చదువులను పూర్తి చేసేందుకు ఓపెన్‌ స్కూల్‌ మంచి అవకాశం.. తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది..

విద్యార్హతలకు సువర్ణావకాశం
వివిధ కారణాలతో చదువులను మానేసిన వారు, ఎస్సెస్సీ, ఇంటర్‌ విద్యను అభ్యసించని వారితో పాటు అనుత్తీర్ణత పొందిన వారు ఆ విద్యార్హతలను పొందేందుకు ఓపెన్‌ స్కూల్‌ విధానం ఎంతో దోహదపడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 40 అధ్యయన కేంద్రాల్లో సెలవు దినాల్లో వీటిల్లో ప్రవేశాలు పొందిన వారికి తరగతులను నిర్వహిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు, పదోన్నతుల కోసం విద్యార్హతలు అవసరమైన వారితో పాటు ఉన్నత చదువులను చదవాలనే ఆసక్తి గల వారెందరో జిల్లాలో ఈ విధానం ద్వారా విద్యార్హతలను పెంచుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఏటా 4 వేల మంది వరకు అభ్యర్థులు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్‌ చదువుతున్నారు.

ప్రవేశాలకు ఎవరు అర్హులంటే..
* పదో తరగతిలో ప్రవేశాలకు 31 ఆగస్టు 2019 నాటికి 14 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులు. బడి మధ్యలో మానేసిన వారు, చదువులకు దూరమైన వారు ఇందులో ప్రవేశాన్ని పొందవచ్చు. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో బోధన జరుగుతుంది.
* ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు 31 ఆగస్టు 2019 నాటికి 15 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో బోధన ఉంటుంది.
* ఎస్సెస్సీ, ఇంటర్‌ కోర్సుల్లో అభ్యాసకులు వృత్తి విద్య కోర్సును ఒక ఐచ్చిక సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే వీలుంది.

ధ్రువపత్రాలకు సమాన ప్రాధాన్యత
* ప్రవేశాలను పొందే వారు ఆధ్యయన కేంద్రాల్లో సంప్రదించి మీ సేవా ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత అపరాధ రుసుంతో ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ రుసుంలు
* పదోతరగతికి రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.100(అందరికి). ప్రవేశ రుసుం జనరల్‌ కేటగిరీ పురుషులకు రూ.1000, ఇతరులకు రూ.600లు.
* ఇంటర్‌లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.200(అందరికి). ప్రవేశ రుసుం జనరల్‌ కేటగిరి పురుషులకు రూ.1,100, మిగిలిన వారికి రూ.800లు.

చదువులకు వెసులుబాటు
* దూర విద్యావిధానం ద్వారా అధ్యయన కేంద్రాల్లో సెలవు దినాల్లో ముఖాముఖిగా బోధన తరగతులను నిర్వహిస్తారు.
* ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ లేదా ఓపెన్‌ స్కూల్‌ వారిచే రూపొందించిన స్వయం అధ్యయన సామగ్రిని పంపిణీ చేస్తారు.
* ప్రవేశం పొందిన అయిదేళ్లలో 9 పర్యాయాలు పరీక్ష రాసే అవకాశం ఉంది.
* ఏటా మార్చి, ఏప్రిల్‌, అక్టోబర్‌లలో పరీక్షలను నిర్వహిస్తారు.
* ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన వారికి అందించే సర్టిఫికెట్లు రెగ్యులర్‌ చదువులు పూర్తి చేసిన వారు పొందే బోర్డు సర్టిఫికెట్లతో సమాన స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు గల ఈ సర్టిఫికెట్లు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు అర్హత కల్పిస్తాయి.

అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలి
-రాజయ్య పటేల్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌
ఓపెన్‌ స్కూల్‌ ద్వారా విద్యార్హతలను పెంచుకునేందుకు ప్రవేశాలను పొందేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. చదువులను మధ్యలో మానేసిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విద్యార్హతలను దీని ద్వారా పెంచుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలను పొందాలనే ఆసక్తి గల వారికి అందుబాటులోని ఆధ్యయన కేంద్రంలో సంప్రదించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.