close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ఉచిత శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

యువత సద్వినియోగం చేసుకుంటే మేలు
తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివిన యువతకు, మధ్యలోనే చదువు మానేసిన వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అండగా నిలుస్తోంది. యువతను శక్తిమంతమైన వనరుగా తయారు చేయడంలో భాగంగా వారిలోని అంతర్గత నైపుణ్యాలను వెలికి తీసేందుకు తనవంతు పాత్ర పోషిస్తుందితిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ. దీని ద్వారా జిల్లా యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణను అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే వేలాది మందికి శిక్షణ ఇచ్చి బంగారు భవితకు దారి చూపగా, ఏటా ఈ కేంద్రానికి ఆదరణ పెరుగుతోంది. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థతో సత్ఫలితాలు వస్తున్నాయి.

ఇవీ అర్హతలు
అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారై ఉండాలి. కనీస విద్యార్హత పురుషులకు 7వ తరగతి, మహిళలకు 5వ తరగతి. తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

అందుబాటులో ఉన్న కోర్సులు
* ఎలక్ట్రికల్‌ మోటార్‌ రివైండింగ్‌, పంప్‌సెట్‌ నిర్వహణ దీ ఫొటో, వీడియోగ్రఫీ
* రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండీషనింగ్‌
* లేడీస్‌ టైలరింగ్‌ * ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ * బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌ * సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ * కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌ వర్కింగ్‌ దీ ఎల్‌.ఎమ్‌.వి. డ్రైవింగ్‌ ఓనర్‌ * కంప్యూటరైజ్‌డ్‌ అకౌంటింగ్‌ * ఘరేల్‌ విద్యుత్తు ఉపకరణ్‌ సేవా ఉద్యమి * జూట్‌ ప్రోడక్ట్‌ దీ కాస్ట్యూమ్‌ జూవెల్లరీ * కంప్యూటర్‌(డీటీపీ) * జనరల్‌ ఈడీపీ * షాప్‌ కీపర్‌ * టూ వీలర్‌ మెకానిక్‌ * పాపడ్‌, పికిల్‌ అండ్‌ మసాల పౌడర్‌ మేకింగ్‌.

సమగ్ర వ్యవసాయం అనుబంధ వృత్తులు
* పాడి పరిశ్రమలు, వర్మి కంపోస్టింగ్‌ * గొర్రెల పెంపకం * కూరగాయల పెంపకం, నర్సరీ నిర్వహణ * పాలీ హౌజ్‌, షేడ్‌ నెట్‌ ఫార్మ్‌ంగ్‌.

తొమ్మిదేళ్లలో 6300 మందికి శిక్షణ
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రం ద్వారా గడచినా తొమ్మిదేళ్లలో 223 శిక్షణ తరగతులు నిర్వహించగా, 6300 మంది శిక్షణ పొంది, 5000 మంది ఉపాధి పొందారని నిర్వాహకులు తెలిపారు. వీరు ఇంకొంత మందికి ఉపాధి చూపుతున్నారన్నారు. స్వయం ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నది కొందరైతే, పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది మరికొందరు.

దేశంలోని నిరుద్యోగాన్ని రూపు మాపి, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలంటే యువతలో మార్పు తేవాలి. వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఉపాధి మార్గాలు చూపాలనే ఉద్దేశంతో ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే 2010 డిసెంబర్‌, 20న తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. మెరుగైన శిక్షణను అందించి ఉపాధి కల్పలనో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతులు కల్పిస్తారు. ఏడాదికి 700 మందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను అందజేసి, బ్యాంకు నుంచి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుండడం విశేషం.

టెక్నీషియన్‌గా స్థిరపడతా
అంకం.సంతోష్‌, మల్యాల
నేను పదో తరగతి వరకు చదువుకున్నా. బోర్‌వెల్స్‌లో సూపర్‌ వైజర్‌గా పని చేశా. దాంతో ఎలాంటి ఆర్థికాభివృద్ధి లేదని అర్థమైంది. ఒక స్నేహితుడి ద్వారా ఈ శిక్షణ కేంద్రం గురించి తెలుసుకున్నా. ఆసక్తితో రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌ కండీషనింగ్‌లో శిక్షణ తీసుకున్నా. టెక్నీషియన్‌గా స్థిరపడతా.

సంవత్సర కాలంగా ఎదురుచూశా
ఆసంపల్లి విజయ్‌, వేములవాడ
నేను ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి, కొన్ని నెలలు సెంట్రింగ్‌ పనికివెళ్లాను. నాకు ఏసీ రిపేర్‌ చేయడం ఇష్టం. ఆర్థిక పరిస్థితుల కారణంగా బయట ఎక్కడా నేర్చుకోలేకపోయాను. ఈ శిక్షణ కేంద్రంలో రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌ కండీషనింగ్‌ కోర్సులో శిక్షణ ఇస్తారని తెలిసింది. సంవత్సరం దాకా ఎదురు చూశాను. సంస్థలో చేరి ఉత్సాహంగా శిక్షణను పూర్తి చేశాను.

ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్‌
అమీర్‌, శిక్షకుడు
ఏసీ, రిఫ్రిజిరేటర్లు మరమ్మతులు చేసే వారికి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఆధునిక కాలంలో వాటి వినియోగం చాలా వరకు పెరిగింది. ఈ నెల రోజుల శిక్షణలో మంచి నైపుణ్యం సాధించిన వారు స్వయం ఉపాధిలో రాణిస్తారు. ఈ శిక్షణలో మెళకువలు సాధించిన వారికి ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పిస్తాం. వారికి  స్వయం ఉపాధి వైపు ఆసక్తి ఉంటే రుణ సౌకర్యం సైతం అందించి సహకరిస్తాం.

కొత్తగా ఖైదీలకు సైతం శిక్షణ ఇవ్వబోతున్నాం
పి.దత్తాద్రి, సంస్థ డైరెక్టర్‌
మా సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది. చాలా మందికి స్వయం ఉపాధి పొందాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశాలు లేక ఇబ్బందులు పడతారు. వారందరి కోసమే ఈ సంస్థ స్థాపించాము. అందరూ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలి.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.