close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

ప్రాణాలపైకి రయ్‌...రయ్‌..!

250 సీసీ ఆపైన వాహనాలతో రోడ్లపై విన్యాసాలు
వేగ నియంత్రణ లేక ప్రమాదాలు
మైనర్లు, కళాశాల విద్యార్థులే అధికం

 

* హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై వికారాబాద్‌లో జరిగిన మౌంటెయిన్‌ బైక్‌ రేసింగ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగానే సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌ అయింది. అమెరికాలో ఉంటున్న అరవింద్‌ నగరానికి వచ్చి సరదాగా స్నేహితులతో కలిసి వికారాబాద్‌ జిల్లా గోధుమగూడ సమీపంలోని ఓ రిసార్టులో మౌంటెయిన్‌ బైక్‌ రేసింగ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

* తాజాగా హైదరాబాద్‌ నడిబొడ్డున ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా వుండే నెక్లెస్‌ రోడ్డుపై బైక్‌తో స్టంట్స్‌ చేస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ఇద్దరూ మృతి చెందారు. ఇద్దరు యువకులు మితిమీరిన వేగంతో వస్తూ తమ ముందు వెళుతున్న ఓ కారును ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి విభాగినిని(డివైడర్‌ను) ఢీ కొట్టారు. బైక్‌తో పాటు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. బైక్‌ నడుపుతున్న యువకుడు, వెనుక కూర్చున్న అతను కూడా మరణించారు.

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ఎవరికీ అందని వేగంతో...జుమ్మని శబ్దం చేస్తూ... విన్యాసాలతో బైక్‌ నడిపేందుకు కొందరు యువత ఉవ్విళ్లూరుతుంటారు. బైక్‌ విన్యాసాలతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నగరంలో ఎటువంటి రేసులకు అనుమతి లేకపోయినా రాత్రిళ్లు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంతవరకు శివార్లలో నిర్వహించే ఈ బైక్‌ రేసులు ఇప్పుడు రాజధాని నడిబొడ్డుకు పాకాయి. రాత్రిళ్లు  అధిక వేగంతో బైక్‌లపై చక్కర్లు కొడుతూ ఎదుటి వారి ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. నెక్లెస్‌ రోడ్డు, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి తదితరాలు ఇందుకు వేదికగా మారాయి. నిర్మానుష్య ప్రాంతాలు బైక్‌రేసింగ్‌ పాయింట్లుగా మారిపోతున్నాయి. ప్రాణాలు పోతున్నా యువత ఈ వ్యసనాన్ని వదలలేకపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు ఒకే ద్విచక్రవాహనంపై కూర్చొని రోడ్లపై దూసుకెళుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ కేసులు బుక్‌ చేస్తున్నా మార్పు కనిపించడం లేదు.

మితి మీరిన వేగంతో స్వీయ చిత్రాలు
బీటెక్‌, ఎంటెక్‌, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల్లోనే ఈ తరహా వ్యసనం ఎక్కువగా కనిపిస్తోంది. స్పీడో మీటర్‌లో అత్యధిక వేగాన్ని తాకాలంటూ మరణం అంచుల దాకా వెళ్తున్నారు. మీటర్‌ ముల్లు 100 పైన ఉన్నప్పుడు స్వీయచిత్రాలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయాలని ప్రయత్నిస్తూ ప్రమాదంతో ఆటలాడుతున్నారు. మితిమీరిన వేగం, ట్రిపుల్‌ రైడింగ్‌, అడ్డదిడ్డంగా నడపుతూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలకు వెళ్లే చాలామంది విద్యార్థులు బైకులు మితిమీరిన వేగంతో నడుపుతున్నారు.

రేసింగ్‌ అడ్డాలు...
రాజేంద్రనగర్‌, నార్సింగ్‌ ఠాణాల పరిధిలోని గండిపేట, ఔటర్‌ రింగ్‌రోడ్‌, గచ్చిబౌలి ప్రాంతాలు బైక్‌రేసింగ్‌లకు అడ్డాలుగా మారాయి. తెల్లారుజామున ఒకే బైక్‌పై ఇద్దరు ముగ్గురు కలిసి రోడ్లపైకి వస్తారు. పది, పదిహేను ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక ప్రాంతానికి చేరుకొని బైక్‌లపై ఫీట్లు చేస్తున్నారు. వారాంతపు సెలవులు వచ్చాయంటే పరిస్థితి అదుపు దాటుతోంది. ఇందులో పాల్గొనే వారిలో అధికులు 18-28 ఏళ్ల యువతే ఉంటోంది. రాత్రి 10 దాటితే చాలు పైవంతెనలు, ఔటర్‌ రింగ్‌రోడ్లుపై బైక్‌ రేసింగులు జరుగుతున్నాయి.

మైనర్లే అధికం
గతంలో నార్సింగ్‌ పోలీసులు ఏకంగా 80 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే మరో 34 మందిని పట్టుకున్నారు. వీరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఇలా పట్టుబడిన వారిలో దాదాపు మైనర్లే అధికంగా ఉన్నారు. గతంలో వాకర్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న 150 బైక్‌ రేసర్లను నెక్లెస్‌ రోడ్డులో, గండిపేటలో 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కేబీఆర్‌ పార్కు, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో రేసింగ్‌కు పాల్పడిన 19 మంది యువకులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి వాహానాలను స్వాధీనం చేసుకున్నారు.

సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు
రేసుల్లో పాల్గొనేవారు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. వాట్సాప్‌ ద్వారా గ్రూపులు నిర్వహిస్తూ రేసింగ్‌ వేదికలు, ఏర్పాట్లు, నిర్వహణ తీరు, బెట్టింగ్‌ తదితర అంశాల గురించి నిత్యం చర్చిస్తున్నారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఓ మైనర్‌ను విచారించగా ఈ విషయం బహిర్గతమైంది. రేసింగ్‌లో ఇంత వేగాన్ని అధిగమించాలంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

అనుమతి ఉంటేనే ఆధునికీకరణ
బైకులకు సరికొత్త హంగులను అద్దుతూ, ట్రాఫిక్‌లో స్టంట్‌లు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తమ బైక్‌ల సైలెన్సర్లను మార్చుతున్నారు. గన్‌షాట్‌ శబ్దాలు, పెద్ద పెద్దహారన్‌లు వంటివి అమరుస్తున్నారు. ఇలా మార్పులు చేసుకోవాలంటే ముందుగానే రవాణా శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా విస్మరిస్తున్నారు. తయారీదారు నుంచి వచ్చే వాహనాలను యథాతథంగా ఉంచాలని, ఎటువంటి మార్పులు చేయరాదని, కొత్త పరికరాలు బిగించరాదని గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం గమనార్హం.

నగర రోడ్లపై ప్రమాదాలు తప్పవు
రేసింగ్‌లకు నగరంలో అనుమతి లేదు. నగర రహదారులు ఇందుకు  పనికి రావని నిపుణులు చెబుతున్నారు. 250 సీసీ ఆపైన బైక్‌లు నగర రోడ్లపై కేవలం పరిమిత వేగంతో ప్రయాణించాలి. లేదంటే ప్రమాదాలు తప్పవని  హెచ్చరిస్తున్నారు. 350సీసీ ఆపైన ఉండే వాహనదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

అవగాహన లేక..ప్రాణాలు పణంగా
- శ్రీధర్‌, ప్రొఫెనల్‌ బైక్‌ రేసర్‌
రేసింగ్‌లో జాకెట్‌లకు అనుమతి లేదు. సింగిల్‌సూట్‌ను వేసుకుని రేసింగ్‌ చేయాల్సి ఉంటుంది. అది కాళ్లు, చేతులను కప్పి ఉంచుతుంది. అత్యాధునిక ప్రమాణాలతో ఉన్న హెల్మెట్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో బకెల్‌ ఉంటుంది. దీన్ని పట్టుకుని లాగితే తలకి బిగుసుకుటుంది. ప్రమాదం జరిగినా తలను వీడి బయటకు రాదు. వీటిని బెంగళూరు, విదేశాల నుంచి తెప్పిస్తుంటాం. ధర రూ.80,000 నుంచి మొదలవుతుంది. రేసింగ్‌ వేగాన్ని తట్టుకుని మన శరీరాన్ని కాపాడే దుస్తులు, శిరస్త్రాణాలు, బూట్లు, గ్లౌజులు ఇతరాలకు అన్నింటికీ కలిసి సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతాయి. ప్రమాదాలు జరిగినా ఇలాంటివి ధరించడం వల్ల చిన్నపాటి గాయాలతో బయటపడే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు రేసర్లు తమ గేమ్‌లో చాలా మెలకువలను పాటిస్తుంటారు. వేగ నియంత్రణ, బ్రేక్‌ లాక్‌, అన్‌లాక్‌ వంటివి పాటిస్తుంటారు.

బైక్‌ రేసింగ్‌ ఆటకు అర్థమే మార్చేశారు
-సందీప్‌, నేషనల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌
బైక్‌ రేసింగ్‌ ఓ ఆట. దీని అర్థాన్నే మార్చేశారు నగర యువకులు. ప్రమాణాలు తెలియకుండా, ఏ మాత్రం అనువుగా లేని నగర రోడ్లపై విన్యాసాలు చేస్తున్నారు. రేసింగ్‌లకు చెన్నైలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చాలా మంది ఇష్టపడి ఖరీధైన బైక్‌లను కొనుగోలు చేస్తుంటారు. 250సీసీ ఆపైన వాహనాల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు.  రోడ్డుపై అమ్మే, నాణ్యత లేని శిరస్త్రాణాలను వాడుతుంటారు. ఇది ప్రమాదకరం. బైకులను ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయిస్తూ ఉండాలి. నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగాన్ని నియంత్రించలేకపోతే మామూలు సందర్భాల్లోనూ ప్రమాదాలు జరుగుతాయి. టైర్‌ కాంపొనెంట్స్‌పై దృష్టి పెట్టాలి. డిస్క్‌ బ్రేక్‌ షూలు, చైన్‌ లూబ్రికెంట్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి.

మరిన్ని వార్తలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.