close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఎత్తుకెళ్లి పోతున్నారు..!

పలు కోచ్‌లు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు తరలింపు

జోన్‌ రాకముందే తూర్పుకోస్తా బరితెగింపు

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కాకముందే తమ అవసరాల్ని తీర్చుకునేందుకు తూర్పుకోస్తా ఉవ్విళ్లూరుతోంది. వాల్తేరు డివిజన్‌ విభజన జరిగి విజయవాడ డివిజన్‌లో కలుస్తుందనే ప్రతిపాదనలు వెళ్లిన నేపథ్యంలో.. జోన్‌ ఏర్పడ్డాక తూర్పుకోస్తా పరిధిలో ఏ ప్రాంతాలైతే ఉంటాయో అక్కడ బలపడేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ముసుగులోనే ఈ మధ్యే కొన్ని కోచ్‌ల్ని, కొత్తగా విధుల్లోకి చేరిన సిబ్బందినీ ఒడిశావైపు తరలిస్తున్నారు.

740 మంది వచ్చారు.. కానీ!: ఈ మధ్యే గ్రూప్‌-డి, ఇతర కిందిస్థాయి సిబ్బంది నియామకాల్ని రైల్వేబోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్‌కు 740 మంది సిబ్బందిని కేటాయించింది. వీరంతా ఇటీవలే వాల్తేరు డివిజన్‌ కార్యాలయంలో రిపోర్టు చేశారు కూడా.

* ఈ సిబ్బందిని విభాగాల వారీగా అవసరాల్ని బట్టి పంచిపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. లోతుగా విశ్లేషిస్తే కొన్ని కీలక విషయాలు బయట పడుతున్నాయి.

* రైళ్ల నిర్వహణ పరంగా వాల్తేరు డివిజన్‌ చాలా వెనుకబడి ఉంది. ఈ రైళ్లన్నీ బాగవడానికి విశాఖే కేంద్ర బిందువు. కానీ సిబ్బందిలో ఎక్కువ భాగాన్ని విశాఖకు కాకుండా ఒడిశా వైపు తీసుకెళ్లారు.

* రైళ్ల నిర్వహణలో అతి కీలకమైన ఓ విభాగంలో 70మందిని కేటాయించినట్లే కేటాయించి.. ఆ తర్వాత కేవలం 15మందినే విశాఖలో ఉంచి.. మిగిలిన వారిని రాయగడ, కోరాపుట్‌, బచేలీ లాంటి ప్రాంతాలకు తరలించారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ● వచ్చిన సిబ్బందిలో ఎక్కువ మందిని జోన్‌ ఏర్పాటయ్యాక తూర్పుకోస్తా పరిధిలో ఉండే కేకే లైన్‌, కేఆర్‌ లైన్‌కు సంబంధించిన విభాగాల్లో నియమించారు.● రైళ్ల నిర్వహణ సరిగా లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నా.. సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా సిబ్బందిని తరలించేశారు.

ఇదిగో ఇంకో ఆధారం..: ఈనెల 15న రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ ఆన్‌లైన్‌ ద్వారా భువనేశ్వర్‌-నయాగఢ్‌ టౌన్‌ సేవా ఎక్స్‌ప్రెస్‌ (18423/24) రైలును ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే.. విశాఖకు కేటాయించిన కోచ్‌ల్ని తూర్పుకోస్తా రైల్వే తీసుకెళ్లి.. ఆ కొత్త రైలుకు తగిలించుకుంది. ఈ ఆధారాన్ని కూడా ఫొటోల్లో గమనించవచ్ఛు

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లూ పాయే: 15రోజుల క్రితం విశాఖకు ఒక కొత్త ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌ వచ్చింది. దాంతో పాటు ఒక పవర్‌కార్‌ కూడా వచ్చింది. అయితే ఈ రెండింటినీ విశాఖలోనే ఉంచుతారని మొదట్లో చెప్పినా.. ఆ తర్వాత వాటిని భువనేశ్వర్‌కు తరలించారు. మరికొన్ని కోచ్‌ల్ని విశాఖకు రానివ్వకుండానే నేరుగా తీసుకెళ్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. గతేడాది విశాఖకు వచ్చిన 5 ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్ని కూడా ఇదే తరహాలోనే భువనేశ్వర్‌ తీసుకెళ్లిపోయిన విషయాన్ని కూడా అప్పట్లో ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది.

సేవా ఎక్స్‌ప్రెస్‌ రైలులో విశాఖకు కేటాయించిన ఓ కోచ్‌ దర్శనమిచ్చిందిలా..

కేవలం శిక్షణ నిమిత్తమే..

- వాల్తేరు అధికారుల వివరణ

వాల్తేరు డివిజన్‌కు 740 మంది సిబ్బంది వచ్చినమాట వాస్తవమేనని, వీరిలో ఎక్కువమందిని కేఆర్‌, కేకే లైన్‌ పరిధిలోకి పంపినమాట వాస్తవమేనని వాల్తేరు డివిజన్‌లోని ఓ కీలక అధికారి వివరించారు. ఇది కేవలం శిక్షణ నిమిత్తమేనని, కొత్త సిబ్బంది ఎవరొచ్చినా ఇలాగే పంపుతారని వారన్నారు. ఈ కొత్త సిబ్బంది అనుభవజ్ఞులుగా మారాక, అక్కడ అదివరకే పనిచేస్తున్న పాత సిబ్బందిని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని లైన్ల పరిధిలో కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన సిబ్బంది కేవలం 2018 ప్రతిపాదనల ప్రకారమేనని, 2019 ప్రతిపాదనల ప్రకారం మరో 500 మంది రావాల్సి ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.