close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

నాన్నకు ఏమైంది?

పాపాయిలను అమ్మేస్తున్న తండ్రులు
తల్లడిల్లుతున్న కన్న తల్లులు

రెండు జిల్లాల్లో ఏటా సుమారు 40 నుంచి 50 వరకు అమ్మకాలు జరుగుతుంటాయనేది అధికారుల అంచనా. అయితే ఆడపిల్లగా పుట్టడమే మేం చేసిన పాపమా అంటూ ఆ పసిహృదయాలు ఆవేదన చెందుతున్నాయి.
కంటి పాపకు కనురెప్పనై రక్షకుడిగా ఉంటాననే నాన్నే దారి తప్పుతున్నాడు. ఆర్థిక బాధల్లో బాధ్యతలు మరిచి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. నేనేం పాపం చేశాను నాన్న అని లోకం తెలియని ఆ పాప కన్నీళ్లతో అడుగుతున్నా... ఇలా ఎందుకు చేస్తున్నావయ్యా..అని ఆ కన్నతల్లి కన్నీటి పర్యంతమవుతూ అడ్డుకుంటున్నా.. ఇలా చేయవద్దని కాళ్లపై పడి వేడుకుంటున్నా.. అవేమి పట్టించుకోక కసాయి తండ్రిగా మారుతున్నాడు. కొందరు నాన్నలు వ్యసనాలకు బానిసలై ‘ఇంటి వెలుగును’ అందినకాడికి అమ్మేసిన..అమ్మేస్తున్న సంఘటనలు రోజుకోచోట వెలుగుచూస్తూ మనసున్న అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. నేడు ఆ బంగారు తల్లుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతూ... నాన్నకు ఏమైందని ఆ పసి హృదయాలు కన్నీటితో ప్రశ్నిస్తున్నాయి.

17.10.2019
నూజివీడు మండలం కొత్తూరుతండాలో ఓ మహిళకు ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. విజయవాడ ఆసుపత్రిలో ఉన్న వారిలో ఒక శిశువును రూ.1.50 లక్షలకు తండ్రే అమ్మకానికి పెట్టడంతో ఆ తల్లి హృదయం తల్లిడిల్లిపోయింది. ఆ అమ్మ తన బిడ్డను కాపాడుకోవటానికి భర్తను ఎదురించి కుటుంబ సభ్యుల సాయంతో ఉన్నతాధికారులను ఆశ్రయించి తన బిడ్డను దక్కించుకుంది.

14.10.2019
గుంటూరు నగరానికి చెందిన 19 ఏళ్ల ఓయువతి ఓ ఆడ పిల్లకు జన్మనిస్తే ఆ పాపను కన్న తండ్రే రూ.2 లక్షలకు అమ్మకానికి పెట్టాడు.ఈ విషయం తెలుసుకుని ఆమె  అడ్డుకుంది. భర్త కత్తితో దాడి చేశాడు.ఆమె తీవ్రంగా గాయపడింది. తన బిడ్డను ఇప్పించాలంటూ ఆ తల్లి సోమవారం పోలీసు స్పందన కార్యక్రమంలో    ఎస్పీని ఆశ్రయించింది.

23.09.2019
మైలవరం మండలం పోరాటనగర్‌లో ఓ పసిపాపను కన్న తండ్రే రూ. 2 లక్షలకు అమ్మేయడంతో ఆ తల్లి గుండెపగిలేలా రోదించింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు రంగంలోకి దిగి కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి ఆ పాపను తల్లి ఒడికి చేర్చారు.

అదే రోజూ..: -మైలవరం మండలం కనిమెర్ల తండాల్లో ఇలాంటి సంఘటనే అధికారులకు తెలిసింది. వారు అక్కడకూ వెళ్లి ఆపాపను తీసుకువచ్చి తల్లి చెంతకు చేర్చారు

తల్లడిల్లిపోతున్న కన్నతల్లులు
నవమాసాలు మోసి, రక్తం పంచి..పేగు తెంచి ప్రాణం పోసిన పసికందులను తండ్రే అమ్మేస్తున్నాడని తెలుసుకున్న ఆ కన్నతల్లులు తల్లడిల్లిపోతున్నారు. ముందస్తుగా తెలిసిన తల్లి తన బిడ్డను కాపాడుకోవటానికి నానారకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను అమ్మటానికి వీలులేదని భర్తను ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కసాయి భర్తలు కిరాతకులుగా మారుతున్నారు.

జీవితాలు పాడైపోతాయి
పచ్చనోట్లకు ఆశపడి ఆడపిల్లలను అమ్మేస్తే ఆ పిల్లల జీవితాలను చేతులారా నాశనం చేసిన వారుగా మారుతారు. కొనుగోలు చేసిన వారు వారిచేత వెట్టిచాకిరి చేయించడంపాటు కొంతమంది వ్యభిచారకూపాల్లోకి దించుతున్నారు. కాబట్టి వారినిఅమ్మడం చేయకుండా ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తండ్రిపై ఉంది.లేదంటే మన పిల్లల జీవితాలను మనమే పాడుచేసిన వారమవుతాం.

అనేక రకాలు
పసిప్రాయంతో అమ్మకాలు చేసేవాళ్లు కొందరైతే...ఐదేళ్లు వయసు దాటిన తర్వాత విక్రయాలు చేస్తున్నవాళ్లు మరికొందరు ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వలన కొందరు అమ్మకాలు చేస్తున్నారని, మరికొందరు తమ భార్యలపై అనుమానంతో కసాయివాళ్లగా మారుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి

అవకాశాలు తెలుసుకో..
ఆడపిల్లలకు ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అందులో ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, దుస్తులు, ఉపకార వేతనాలు అందించడంతోపాటు అన్నింటిలోను వారికి ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. పలు కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏటా బాలికలు, విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించి ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారు. ఇలా బాలికలు చదువుకోవటానికి అనేక సదుపాయాలు ఉన్నవి. వాటన్నింటి గురించి తెలుసుకొని పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్ది మంచి తండ్రిగా పేరు తెచ్చుకోవచ్చు.

1098కు సమాచారం ఇవ్వండి
ఆడపిల్లలను అమ్మడం చాలా బాధాకరం. ఎవరైనా వారిని పెంచలేమనుకుంటే ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అలాంటివాళ్లు 1098కు సమాచారం ఇస్తే మేము వచ్చి వారిని తీసుకొని బాలల సంక్షేమ సమితి దృష్టికి తీసుకువెళ్లి వారి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడైనా పిల్లలను అమ్ముతున్నా, కొనుగోలు చేస్తున్నా 1098కు సమాచారం ఇస్తే పోలీసుల సాయంతో ఆ పిల్లలను కాపాడతాం.

- కోలా సమీర్‌కుమార్‌, ఛైల్డ్‌లైన్‌  జిల్లా సమన్వయకర్త,
ఇబ్రహీంపట్నం, గన్నవరం న్యూస్‌టుడే

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.