close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

మృత్యుపోరులో క్రీడాకెరటం

జి.వేమవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంఘటన

పూర్తిగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న జాతీయ క్రీడాకారుడు నాగ శివ లక్ష్మీనారాయణ

కూలి పనికి వెళ్లి ప్రమాదం బారిన పడిన వైనం

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగశివ లక్ష్మీనారాయణను పరామర్శిస్తున్న కలెక్టర్‌

మురళీధర్‌రెడ్డి, చిత్రంలో సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు తదితరులు

తాళ్లరేవు, మసీదు సెంటర్‌ (కాకినాడ)- న్యూస్‌టుడే: ఆటంటే ప్రాణం.. చదువంటే ఇష్టం.. ఈ రెంటిలోనూ రాణించాలనే తాపత్రయం ఆ కుర్రాడిది..ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా..ప్రతికూలతలు వెంటాడుతున్నా ఎదురీదుతూ నెట్టుకొచ్చే కుటుంబ నేపథ్యం.. క్రీడాకారుడిగా సత్తాచాటుతూ చదువులోనూ ప్రతిభ కనబరచాలని తపన పడుతున్న తరుణంలో విధి వెక్కిరించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు రూపంలో ప్రమాదం మీదపడింది. తాళ్లరేవు మండలం జి.వేమవరంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రామంలోని రామాలయంపేటకు చెందిన యర్రంనీడి నాగ శివ లక్ష్మీనారాయణ (నాగబాబు) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే ఈ విద్యార్థి పూర్తిగా కాలిన గాయాలతో కొనఊపిరితో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు..ఆటల్లో విజేతగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన నాగ శివ లక్ష్మీనారాయణ క్షేమంగా తిరిగిరావాలని గ్రామస్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని ..మిగతా 16లోరామాలయంపేటకు చెందిన రైతు సత్యనారాయణకు ఇద్దరు కుమారులు.వీరిలో పెద్దకొడుకు లక్ష్మీనారాయణ పదో తరగతి వరకు జి.వేమవరంలోనే చదువుకున్నారు. కొంత విరామం తర్వాత కాకినాడలో ఇంటర్‌లో చేరాడు. ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీనారాయణ తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటూ ఖాళీ సమయంలో కూలి పనులకు వెళ్తుంటాడని గ్రామస్థులు తెలిపారు. కళాశాలలో ఫీజు చెల్లింపు గడువు ఈనెల 25తో ముగియనుండడంతో నగదు సర్దుబాటు చేసుకునేందుకు ఖాళీ సమయంలో తన ఇంటి సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రానికి పనికి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం తండ్రి సత్యనారాయణతో కలిసి పనికి వెళ్లిన లక్ష్మీనారాయణ ఈ ప్రమాదంలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడని వారు వివరించారు. ప్రమాదంలో అతని తండ్రి సత్యనారాయణ కూడా స్వల్పంగా గాయపడ్డారు. గ్రామంలో చలాకీగా తిరిగే కుర్రాడు అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం స్థానికులను కలిచివేస్తోంది.పేలుడు ఘటనలో మొత్తం 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో లక్ష్మీనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులు బర్నింగ్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు.

విజేతగా నిలవాలని..

జాతీయ క్రీడాకారుడిగా రాణించి పోలీసు ఉద్యోగం సాధించాలన్నది లక్ష్మీనారాయణ లక్ష్యం. పాఠశాల దశ నుంచి వాలీబాల్‌, త్రోబాల్‌, సాఫ్ట్‌బాల్‌, హైజంప్‌, అథ్లెటిక్స్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచి పలు బహుమతులూ దక్కించుకున్నాడు. వాలీబాల్‌ పోటీల్లో ప్రత్యర్థులు కొట్టే షాట్లను అడ్డుకోవడంలో సెంటర్‌ బ్లాకర్‌గా, రాష్ట్ర జట్టులో ప్రధాన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. జి.వేమవరం జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి వాలీబాల్‌, త్రోబాల్‌, సాఫ్ట్‌బాల్‌.. ఇలా ఏ పోటీలు జరిగినా ఇతని మార్కు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అనంతపురంలో 2016లో జరిగిన సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ సాధించాడు. 2017-18లో అథ్లెటిక్స్‌లో పోటీల్లో హైజంప్‌లో నైపుణ్యం సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపాడు. 2017లో హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగిన త్రోబాల్‌ జాతీయ స్థాయిల్లోనూ లక్ష్మీనారాయణ సత్తా చాటాడు. ఇటీవల ఆచంటలో జరిగిన వాలీబాల్‌ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీల్లోనూ ప్రతిభ చూపాడు.

నాన్నను పిలిచేందుకు వెళ్లి..

జి.వేమవరం గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి గండి గోవిందు గొల్లపాలెంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి నాగేశ్వరరావు కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూంటారు. శుక్రవారం తండ్రి బాణసంచా తయారీ కేంద్రానికి పనికి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తండ్రిని పిలిచేందుకు వెళ్లిన గోవింద్‌ అనూహ్యంగా ఈ ప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న గోవింద్‌ పరిస్థితిని చూసి తల్లి లోవలక్ష్మి గుండెలవిసేలా విలపిస్తోంది. బాణసంచా తయారీ కేంద్రం వద్ద ఆ సమయంలో ఉన్న మరో ఇంటర్‌ విద్యార్థి వెంకటేష్‌ కూడా ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు.

బాణసంచా బాధితులను పరామర్శించిన కలెక్టర్‌

కాకినాడ (మసీదు సెంటర్‌):: తాళ్లరేవు మండలంలోని జి.వేమవరంలో జరిగిన బాణసంచా పేలుడులో గాయపడిన వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రావును ఆదేశించారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.