close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

రా.. రమ్మని ఆతిథ్యమిద్దామని..

ఏడాదికి 60 లక్షల మంది పర్యాటకులు జిల్లాకు రాక 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పర్యాటక రంగం అభివృద్ధికి అడుగులు

● నిధులొస్తే అహోబిలం, మహానంది, బెలూం గుహలకు నూతన శోభ


పచ్చని నల్లమల అందాల నడుమ మహానంది క్షేత్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వారసత్వ సంపద, పర్యావరణ, ప్రకృతి పర్యాటకాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో రూ.1005.88 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. నెల రోజుల్లో వీటికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో వారసత్వ ప్రాంతాల ప్రగతి కోసం ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ పేరుతో రూ.136.53 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటిలో అహోబిలం, మహానంది, బెలూం గుహలు ఉన్నాయి. కేంద్రం పర్యాటక రంగానికి నిధులు మంజూరు చేస్తే ఈ మూడు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. - న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

గతంలో అహోబిలం క్షేత్రం అభివృద్ధికి రూ.10 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా కేంద్ర సర్కారు రూ.5 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రోప్‌వే నిర్మాణం కలగా మారింది. దీనికోసం కేంద్రం అటవీ, పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దేవాలయ ప్రాంతంలో 2 ఎకరాల విస్తీర్ణంలో వీఐపీ అతిథిగృహం, రెస్టారెంట్‌, పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాల్సి ఉంది. ● మహానంది ఆలయానికి మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ● రాయలసీమలో కొలిమిగుండ్ల మండలంలో వెలసిన బెలూం గుహలు ఎంతో పేరుగాంచాయి. ఈ బెలూం గుహలు అనంతపురం, కడప, కర్నూలు మూడు జిల్లాలకు సరిహద్దుగా ఉన్నాయి. గత సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు బురదమయంగా మారాయి. గుహల్లో లైటింగ్‌, మ్యూజియం అస్త్యవస్తంగా మారాయి. రెస్టారెంట్‌ మూత పడింది. ఆ ప్రాంతంలో పచ్చదనం అంతంతమాత్రంగానే ఉంది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే జిల్లాకు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ● ఐదేళ్ల క్రితం హెరిటేజ్‌ సర్క్యూట్‌ పేరుతో జిల్లా పాలనాధికారి పర్యాటక రంగం అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలను గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాలో ప్రఖ్యాత ప్రాంతాలు, వారసత్వ సంపద, ప్రకృతి పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.

వీటిపైనా దృష్టి సారిస్తేనే..

జిల్లా కేంద్రంలో నడిబొడ్డున కొండారెడ్డి బురుజుపై 168 అడుగుల జాతీయ జెండాను శాశ్వతంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన అయిదేళ్లకు పైగా ఆచరణకు నోచుకోలేదు. కొండారెడ్డి బురుజుపై శాశ్వత జెండాను ఏర్పాటు చేస్తే ప్రపంచంలోనే 5వ స్థానాన్ని కర్నూలు దక్కించుకుంటుంది. ఇది కలగానే మిగిలిపోయింది.

గతంలో కొండారెడ్డి బురుజుపై శాశ్వత జాతీయ జెండా ఏర్పాటుకు, గోల్‌ గుమ్మాజ్‌ అభివృద్ధికి కేంద్రం రూ.2 కోట్లు మంజూరు చేసింది. అనుమతులు రాకపోవడంతో ఆ నిధులు వెనక్కెళ్లాయి. ● జాతీయ రహదారుల పక్కన ప్రయాణికులు కాసేపు విడిది చేసేందుకు వసతులు ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. అదీ నెరవేరలేదు. కర్నూలు-నంద్యాల-కడప జాతీయ రహదారిపై పాణ్యం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో రహదారి పక్కన వసతుల కల్పన ఆచరణలోకి రాలేదు. ● బెలూం గుహల తరహాలోనే ప్యాపిలి దగ్గర వాల్మీకి గుహలను గుర్తించారు. ఈ వాల్మీకి గృహాలకు ప్రత్యేకించి నిధుల కేటాయింపు జరగలేదు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఏమాత్రం అడుగులు పడలేదు. ● హైదరాబాదు-బెంగళూరు జాతీయ రహదారిలో వెంకన్న బావి సమీపంలో విజయ వనాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతూ వచ్చారే తప్ఫ. ఎలాంటి ప్రగతికి నోచుకోలేదు. విజయవనం రూపుదిద్దుకొంటే నగరవాసులకు విడిది కేంద్రంగా ఎంతో మేలు చేకూర్చినట్లవుతుంది. ఆ దిశగా పనులు చేపట్టాల్సి ఉంది. ● సప్త నదుల సంగమేశ్వరం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. పుష్కరాల సమయంలో కొంత అరకొర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అక్కడే రూ.కోటితో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినా అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. సంగమేశ్వరంలో బోటు ఏర్పాటు కలగా మారింది. ● జగన్నాథగట్టు మీద రూ.3-4 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకు శిలాఫలకం వేశారు. అదీ నెరవేరలేదు. ● కేతవరం రాతి వనాల అభివృద్ధికి రూ.93 లక్షలు, ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌కు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. కాగా, వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అధికంగా కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ● జిల్లాలో టెంపుల్‌ టూరిజం కింద శ్రీశైలం, అహోబిలం, మహానంది, మంత్రాలయం, యాగంటి క్షేత్రం, బెలూం గుహలు, ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌కు పర్యాటకుల సందడి ఉంది. గార్గేయపురం సమీపంలో నగరవనంలో అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలో నెలకు సగటున 5 లక్షల మంది పర్యాటకులు టెంపుల్‌ టూరిజం కింద వస్తున్నారు. అందులో విదేశీయులు నెలకు కేవలం 20-30 మంది కంటే ఎక్కువగా రావడం లేదు. మొత్తం మీద ఏడాదికి 60 లక్షలకు మించి పర్యాటకులు రావడం లేదు. దేశ, విదేశీయులను ఆకర్షించేలా జిల్లా పర్యాటక రంగం వన్నెలీనాల్సి ఉంది.

ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఇలా..

● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాదం పథకం కింద శ్రీశైలం అభివృద్ధికి రూ.కోటి, అహోబిలం ఆలయానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆ రెండు క్షేత్రాల్లో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ● వే సైడ్‌ అమినిటీస్‌ కింద జాతీయ రహదారుల పక్కన విడిది కేంద్రాలకు స్థలాల కొరత వేధిస్తుంది. కర్నూలు-కడప జాతీయ రహదారిపై పాణ్యం, ఆళ్లగడ్డ దగ్గర వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉంది. ● దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయం, ప్యాపిలి ప్రాంతంలో వాల్మీకి గుహలు, బేతంచర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురంలో మద్దిలేటి స్వామి ఆలయం, అదే మండలంలో కడమ కింద కొట్టాల(కేకే కొట్టాల)లో గుహలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మంత్రులు వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

రూ.100 కోట్లతో ప్రతిపాదనలు - బి.వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక శాఖ అధికారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుంది. గతంలో రూ.100 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి హెరిటేజ్‌ సర్క్యూట్‌ పేరుతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారసత్వ, పర్యావరణ, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జిల్లాకు నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది.


సీమకే మకుటం కొండారెడ్డి బురుజు

బంగారు కాంతులీనుతున్న బెలూం గుహలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.