close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

మీ జీవితంలో ఒక్కసారైనా..రక్తదానం చేయండి

ఈ నెల 30 వరకు మాసోత్సవాలు

జిల్లాలో లక్ష్యాన్ని మించి రక్త సేకరణ

ఆసక్తి కనబరుస్తన్న మహిళలు

రక్త సేకరణ వాహనంలో రక్తం ఇస్తున్న దాతలు

 (పాతచిత్రం)

రక్తహీనతతో బాధ పడేవారికి రక్తమే చికిత్స. అత్యవసర సమయంలో రక్తం ఎక్కించకపోతే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి, 18 ఏళ్లు దాటి 50 కిలోలు ఉన్న వ్యక్తులు ఎవరైనా స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్ఛు ప్రభుత్వం అవగాహన కల్పించడంతోపాటు రక్త సేకరణ వాహనాలతో వెళ్లి రక్తం సేకరిస్తున్నారు. ప్రజల్లోని అపోహలను తొలగించి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చేలా చైతన్యం చేస్తున్నారు. తద్వారా జిల్లాలో రక్తం సేకరించడంలో గత రెండేళ్ల నుంచి లక్ష్యానికి మించి చేపట్టింది. దీంతో అత్యవసర సమయంలో అందరికీ రక్తం అందజేస్తున్నారు. పురుషులతోపాటు మహిళల్లో కూడా అవగాహన పెరిగి రక్తదానం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం. - న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

జిల్లాలో రక్తసేకరణ, రక్తనిధి కేంద్రాలు

1.ప్రభుత్వ సర్వజన వైద్యాశాల, కర్నూలు, 2.నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి 3.ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, 4.అక్షయ బ్లడ్‌ బ్యాంక్‌ కర్నూలు, 5.శాంతిరాం మెడికల్‌ కళాశాల, నంద్యాల, 6.విశ్వభారతి జనరల్‌ ఆసుపత్రి, పెంచికలపాడు, 7.ఆర్‌ఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌, కర్నూలు, 8.విశ్వభారతి బ్లడ్‌ బ్యాంక్‌ కర్నూలు, 9.విజయ బ్లడ్‌ బ్యాంక్‌, నంద్యాల, 10. న్యూలైఫ్‌ బ్లడ్‌ బ్యాంక్‌, కర్నూలు, 11.ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, కర్నూలు, 12.రక్త సేకరణ, సరఫరా వాహనం నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ రేణుక. కర్నూలులో నివాసముంటున్నారు. ఆమె రక్త గ్రూప్‌ ఏబీ పాజిటివ్‌. ఇప్పటి వరకు రేణుక 16 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. చాలా మంది మహిళలు రక్తం తక్కువగా ఉందని బాధ పడుతుంటున్నారు. అలాంటి వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆమె చెబుతున్నారు.

ఇదే నినాదం..

ప్రతి ఏడాది అక్టోబరు 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం మానవ జీవితంలో రక్తం అవసరం, ఆవశ్యకతను తెలియజేయడం. మొట్టమొదటిసారిగా 1975లో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేక నినాదంతో అవగాహన కల్పించడం, రక్తదాతలను ప్రోత్సహిస్తుండటం చేస్తున్నారు. ఈ ఏడాది ‘మీ జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయండి’ అనే నినాదంతో ఈ నెల 30 వరకు మాసోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పెరుగుతున్న రక్త సేకరణ

గత ఐదేళ్లలో గమనిస్తే ప్రస్తుతం రక్త సేకరణ పెరిగింది. 2015, 2016, 2017 సంవత్సరాల్లో ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని ఛేదించలేదు. 2017-18 నుంచి అనుకున్న లక్ష్యాన్నిమించి రక్తం సేకరించారు. శిబిరాలు కూడా 2018-19లో కేటాయించిన వాటికంటే 140 అదనంగా నిర్వహించారంటే ప్రజల్లో వచ్చిన చైతన్యానికి గుర్తుగా చెప్పవచ్ఛు జిల్లాలో పెరుగుతున్న రక్తదాతలు, యువకులకు పోటీగా మహిళలు కూడా రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తుండటం గమనార్హం.

జిల్లాలో రక్త నిల్వ కేంద్రాలు

ప్రభుత్వం జిల్లాలోని సీహెచ్‌సీ కేంద్రాల్లో రక్త నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, డోన్‌, కోవెలకుంట్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి, ఆదోనిలోని మాతా, శిశు ఆసుపత్రుల్లో రక్త నిల్వలు ఉంటాయి.

కళాశాలలు ముందుకు వస్తున్నాయి - డా.సుధాకర్‌, రక్తనిధి కేంద్రం ఇన్‌ఛార్జి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి

రక్త సేకరణ పెరిగిందంటే కారణం యువతే. కళాశాలలు, శిక్షణ కేంద్రాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా కొంత మంది రక్తదానం చేస్తున్నారు. నాయకులు, సినీ నటుల అభిమానులు కూడా అధిక సంఖ్యలో రక్తం ఇస్తున్నారు. దీంతో రక్తహీనతతో బాధ పడేవారికి రక్తం అందుబాటులో ఉంటోంది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్ఛు

మహిళలు రక్తదానం చేయడం అభినందనీయం - డా.పి.చంద్రరావు, జిల్లా అదనపు వైద్యారోగ్య అధికారి (ఎయిడ్స్‌, లెప్రసీ), కర్నూలు

జిల్లాలో మూడేళ్ల నుంచి ప్రభుత్వం కేటాయించిన లక్ష్యంకంటే ఎక్కువగా రక్తాన్ని సేకరిస్తున్నాం. దీంతో కొంత మేర రక్తం కొరత లేకుండా చూస్తున్నాం. మహిళలు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. జిల్లాలో గతేడాది సుమారు 60 మంది మహిళలు రక్తదానం చేశారు. జీవితంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నాం. రక్తం ఒకరు ఇస్తేనే మరొకరికి ఎక్కించగలుగుతాం. ఇందుకు అపోహలు వీడి యువత ముందుకు రావాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.