close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

స్త్రీనిధి పెన్నిధి

● 29శాతం పూర్తైన రుణ లక్ష్యం

● ఐదునెలల్లో ఇవ్వాల్సింది రూ.45.71 కోట్లు

● సద్వినియోగంపై డీఆర్‌డీఏ అవగాహన

ముందుకు వస్తున్న లబ్ధిదారులు

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు స్త్రీ నిధి రుణాలతో ఆర్థిక భరోసా లభిస్తోంది. సత్వరం రుణాలు పొందే వెసులుబాటు ఉండటంతో ఉపాధికి బాటలు పడుతున్నాయి. సభ్యుల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతోంది. అయినా పల్లెల్లో మహిళలకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదు. దీనిని గుర్తించిన జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ యంత్రాంగం అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పూర్తి సమాచారం అందించేందుకు డీఆర్‌డీఏ అధికారులు కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్త్రీ నిధి రుణాల పంపిణీ తీరుపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని 565 పంచాయతీల్లో 1.14 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదయ్యారు. సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను అందజేస్తున్నారు. సభ్యులకు వ్యక్తిగతంగా ‘స్త్రీ నిధి’ని సమకూరుస్తున్నారు. మహిళల ఆసక్తికి అనుగుణంగా ఆయా రంగాల్లో రాణించేలా వీటిని పంపిణీ చేస్తున్నారు. రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పొందే అవకాశం కల్పించారు. పిల్లల అవసరాలకు, చరవాణి కొనుగోలుకు రూ.6 వేలు, సైకిల్‌ కొనుగోలుకు రూ.5వేలు, ఉన్నత విద్య, సాంకేతిక విద్యనభ్యసిస్తున్న సభ్యురాలి పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల కొనుగోలుకు రూ.35 వేల వరకు సహకారం అందిస్తున్నారు.

చిన్న తరహా పరిశ్రమలకు: చిన్నతరహా పరిశ్రమలు, కిరాణం, హోటళ్లు, బేకరీ, దర్జీ దుకాణం, విస్తరాకుల తయారీ కేంద్రం వంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొస్తే అందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. వ్యవసాయం చేసేవారికి పెట్టుబడికి, కౌలుకు, ఎద్దులు, పాడిపశువులు కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తున్నారు. డీఆర్‌డీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే మంజూరుకు ఆమోదిస్తున్నారు.

డెబ్బై మందికి రూ.లక్ష రుణం

జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో డెబ్భై మందికి రూ.లక్ష చొప్పున రుణాలను అందజేయగా మహిళలు సొంతంగా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. ఎల్మకన్నెలో సభ్యురాలు కుమారుడిని బీటెక్‌, కూతురును డైట్‌ చదివించారు. చెంగోల్‌కు చెందిన మహిళ పట్టణంలో అలంకార సామగ్రి విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన ఆదాయంతో నెలకు రూ.2,330ల చొప్పున వాయిదాలను చెల్లిస్తున్నారు. సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ మొత్తాన్ని తిరిగి ఇస్తున్నారు.

ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడకుండా రూ.లక్ష రుణం ఇచ్చి ప్రైవేటు అప్పులపై ఆధారపడే బాధ లేకుండా చేశారు. రుణం తీసుకున్న సభ్యురాలు మృతి చెందితే మొత్తాన్ని మాఫీ చేయనున్నారు. అంతేకాకుండా అప్పటివరకు చెల్లించిన రుణ వాయిదాల సొమ్మును తిరిగి కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. అంత్యక్రియలకు రూ.5వేల ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటివరకు పదిమందికిపైగా సభ్యురాలు మృతి చెందితే ఆర్థికసాయాన్ని వారి కుటుంబసభ్యులకు అందించినట్లు డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు.
 

ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి

స్త్రీ నిధి రుణాల లక్ష్యం రూ.కోట్లల్లో ఉంటుండగా ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అరవై నుంచి డెబ్భై శాతం మహిళలు మాత్రమే పొందుతున్నారు. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.కోట్లాది రూపాయల రుణాలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఇప్పటివరకు ఆరునెలలుగా 29శాతం రుణాల లక్ష్యం పూర్తైంది. మరో ఐదున్నర నెలల వ్యవధిలో 71 శాతం రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. చాలావరకు మండలాల్లో రుణాల లక్ష్యం రూ.కోట్లల్లో ఉంటే పొందింది రూ.లక్షల్లో ఉంది.

ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి లక్ష్యం పూర్తిచేసే వీల్లేకుండాపోతుందని డీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు నడుంబిగించారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్త్రీ నిధి రుణాలు పొందడం, మంజూరు, అర్హతలు, సద్వినియోగం చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిసంఘంలోనూ అర్హులైన సభ్యులు స్త్రీ నిధి రుణాలు పొందేలా వివరిస్తున్నారు. వందశాతం రుణాల పంపిణీ లక్ష్యం సాధించాలన్న పట్టుదలతో యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది.


డిసెంబరు నాటికి శత శాతం

మహేష్‌మడపతి, స్త్రీనిధి పర్యవేక్షకులు, వికారాబాద్‌

ఈ ఆర్థికసంవత్సరంలో స్త్రీ నిధి రుణాల పంపిణీని డిసెంబరు నెలాఖరులోగా వందశాతం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పరస్పర సహకారంతో మహిళలకు రుణాలు పొందడంపై అవగాహన కల్పిస్తున్నాం. కొంతమంది ముందుకొస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తున్నాం.


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.