close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఆశలు ఆవిరి

యాసంగిలో పంటలకు నీరెట్ల?

నిజాంసాగర్‌ మొదటి ఆయకట్టు ప్రశ్నార్థకమే

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

గత రెండు నెలల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌ జలాశయం వెలవెలబోతోంది. కష్టకాలంలో ఆదుకునే ఎగువన ఉన్న సింగూరులో కేవలం 0.45 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రబీలో ఆయకట్టు కింద సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ప్రాజెక్టు నీటి ఆధారంగా పంటలు వేసే మొదటి ఆయకట్టు రైతుల పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉంది.

జలాశయం ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటి మట్టం పెరగడం లేదు. పోచారం జలాశయం నిండడంతో పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో 108 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1388.46 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

మళ్లింపు జలాలతోనే గట్టెక్కిన ఖరీఫ్‌

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సింగీతం, కళ్యాణి రిజర్వాయర్ల నుంచి జలాలను ప్రధాన కాలువకు మళ్లించడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తీరింది. ప్రాజెక్టు ప్రధాన కాలువపై ఆధారపడ పంటలను సాగుచేసే మొదటి ఆయకట్టు రైతులతో పాటు చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందింది. ప్రస్తుతం పంటలు చేతికొస్తున్నాయి.

ఆందోళనలో మొదటి ఆయకట్టు రైతులు

జలాశయం మొదటి ఆయకట్టు (నిజాంసాగర్‌ నుంచి అలీసాగర్‌ వరకు) రైతులు ప్రధాన కాలువ నీటి ఆధారంగానే పంటలు సాగుచేస్తుంటారు. ఈ సారి సాగర్‌లో నేరు లేకపోవడంతో సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు జలాలనే నమ్ముకున్న మొదటి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

రెండో ఆయకట్టుకు....

రెండో ఆయకట్టు (అలీసాగర్‌ నుంచి గుత్పఎత్తిపోతల వరకు)లో రైతులు ప్రాజెక్టు నీటితో పాటు బోరుబావుల ద్వారా పంటలను సాగు చేస్తున్నారు. దీంతో ఈ రైతులు తమ సాగునీటి లభ్యతను చూసుకొని పంటలను సాగుచేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ సారి ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో నిండడంతో.. ఇప్పటికే అలీసాగర్‌, గుత్పఎత్తిపోతల నీటి విడుదలను ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం చెరువులు, కుంటలు నిండాయి. భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. ఈ సారి బోరు బావుల్లో నీటి కొరత తలెత్తదని భూగర్భజల నిపుణులు చెబుతున్నారు.

కాళేశ్వరం సాకారమైతేనే..

మంజీర ఎగువ ప్రాంతంలో చెక్‌డ్యాంల నిర్మాణం, అడ్డుకట్టలు వేయడంతో నిజాంసాగర్‌కు వరద రావడం లేదు. జలాశయం నిండాలంటే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తరలించడమే ఏకైక మార్గం. మల్లన్న సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ మీదుగా హల్దివాగు నుంచి నిజాంసాగర్‌లోకి జలాలను తరలిస్తామని పాలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇవి పూర్తయితేనే నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకునే వీలుంది.

మొదటి ఆయకట్టు: 1,15,000

(నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి, బోధన్‌)

రెండో ఆయకట్టు: 1,20,000

(ఎడపల్లి, రెంజల్‌, నవీపేట, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, మాక్లూర్‌, నిజామాబాద్‌)

మొత్తం ఆయకట్టు: 2,35,000 ఎకరాలు

పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు

ప్రస్తుత నీటి మట్టం 3.42 టీఎంసీలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.