close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

నాసిరకం శిరస్త్రాణం..తీస్తోంది ప్రాణం

నగరంలో జోరుగా నాసిరకం హెల్మెట్ల  అమ్మకాలు
చలాన్ల భయంతో నాణ్యతను పరిశీలించని వాహనదారులు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

* సెప్టెంబరు 6న హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ద్విచక్ర వాహనదారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు  మృతి చెందాడు. శిరస్త్రాణం ధరించినా ప్రాణాలు దక్కలేదు.
* ఆగస్టు చివర్లో ఎస్సార్‌నగర్‌ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడూ శిరస్త్రాణం ధరించే ఉన్నాడు. అది నాసిరకం కావడమే కారణం.
* సెప్టెంబర్‌ 4న అల్వాల్‌ పరిధిలో  వ్యాను ఢీకొనడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శిరస్త్రాణం ధరించి ఉంటే బతికేవారని పోలీసులు తెలిపారు.
నగరంలో నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో ఇలా ఎంతోమంది శిరస్త్రాణాలు ధరించకుండా.. ధరించినా నాణ్యత లేనివి కావడంతో ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారుడిలో మార్పు రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన చట్టంలో హెల్మెట్‌లేని ప్రయాణాలకు చలానాల ధరల్ని పెంచి నిబంధనలకు కఠినతరం చేయడంతో నగర వాసుల్లో మార్పు వచ్చింది. మార్పు మంచికే అయినప్పటికీ అనుసరిస్తున్న పద్ధతులు ముప్పు తెస్తున్నాయి. కేవలం చలానాల నుంచి తప్పించుకునేందుకు తక్కువ ధరల్లో వస్తున్న నాసిరకం శిరస్త్రాణాలు కొనుగోలు చేస్తున్నారు.


ప్రాణమా.. పైసలా?

చలానాల భయంతో కొనే నాసిరకం హెల్మెట్లు ప్రమాదాల వేళ ప్రాణాలు తీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రధాన రహదారుల వెంట  నాసిరకం శిరస్త్రాణాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో లైసెన్సులు లేకుండా యథేచ్చగా వ్యాపారం చేస్తున్నారు. తక్కువ ధరల్లో వస్తున్నాయనే ఆశతో కొన్న వాహనదారులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.


అమ్మకాలు.. ధరలూ పెరిగాయి

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన చట్టం ప్రకారం శిరస్త్రాణం ధరించని ప్రయాణికులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు శిరస్త్రాణాలు కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు ఇదే అదనుగా రేట్లను పెంచేశారు. ఏజెంట్లు ఒక్కోదాని ధర రెండు, మూడు వందలు పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 


చట్టాలేం చెబుతున్నాయి..

* 1988, మోటార్‌ వెహికిల్స్‌ చట్టంలోని సెక్షన్‌ 129 ప్రకారం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీఎస్‌ఐ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) గుర్తింపు పొందిన శిరస్త్రాణమే ధరించాలి. ధరించే ప్రతి శిరస్త్రాణం మీద ఐఎస్‌ఐ ముద్ర ఉండాల్సిందే.
* 1993 ప్రొటెక్టివ్‌ హెల్మెట్స్‌ అండ్‌ బైక్‌ రైడర్స్‌ చట్టం ప్రకారం బీఎస్‌ఐ గుర్తింపున్న ప్రతి శిరస్త్రాణానికి ఐఎస్‌ఐ మార్కు ఉంటుంది. ఐఎస్‌ఐ మార్కు చెరిపినా చెరగని రంగుతో వేసిన ముద్ర. దాంతో పాటు ఐఎస్‌4151 అనే కోడ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన (సీఎమ్‌/ఎల్‌)పేరుతో ఓ ఏడంకెల సంఖ్య ఉంటుంది.
*  కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఐఎస్‌ఐ గుర్తింపు లేని శిరస్త్రాణాలు అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష లేదా రెండు లక్షల జరిమానా తప్పదు.
* జూన్‌ 2017లో ‘మోటో వాన్‌ ఇండియా’ సంస్థ శిరస్త్రాణాల తయారీ సంస్థలకు నాణ్యత పరీక్షలు నిర్వహించింది. అన్నిరకాల శిరస్త్రాణాల్ని సుత్తెతో కొడుతూ పరీక్షించారు. వెగా, స్టడ్‌, స్టీల్‌బర్డ్‌ లాంటి ప్రముఖ సంస్థలు మినహా మిగతావన్నీ పగిలిపోయాయి. పగిలిన వాటిలో ఐఎస్‌ఐ ముద్ర ఉన్నవి కూడా ఉండటంతో సదరు సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తయారుచేసే నాసిరకం శిరస్త్రాణాలకు సైతం ఈ ముద్రల్ని వేయడంతో ప్రజలు నమ్మి కొనుగోలు చేస్తున్నారు.


ఐఎస్‌ఐ లేకుంటే కఠిన చర్యలే

రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఐఎస్‌ఐ ముద్ర లేని శిరస్త్రాణాలు అమ్ముతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులూ ఇందుకు సహకరించాలి. తప్పక నాణ్యమైనదాన్నే ధరించాలి. ఐఎస్‌ఐ ముద్ర లేనివి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.
- పాండురంగనాయక్‌, సంయుక్త రవాణా కమిషనర్‌


హెల్మెట్లలో రకాలు..

సంపూర్ణ శిరస్త్రాణం
ఇది అత్యంత భద్రమైనది. పూర్తి ముఖాన్ని కప్పేలా ఉంటుంది కాబట్టి వాహనదారులు కిందపడినా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడొచ్చు.

త్రిభుజాకార శిరస్త్రాణం
ఇవి కొనేందుకు నగర యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముందువైపు మొత్తం ఖాళీగా ఉండే ఈ శిరస్త్రాణాలకి కేవలం పైన, వెనకభాగాల్లో మాత్రమే షెల్‌ ఉంటుంది. దీన్ని ధరించడంతో కిందపడినప్పుడు ముఖం ముందు, దవడ భాగాలకు గాయాలయ్యే ప్రమాదముంది.

అర్ధ శిరస్త్రాణాలు..
అర్ధ శిరస్త్రాణాల వల్ల ఎలాంటి ప్రయోజం లేదు. కేవలం ట్రాఫిక్‌ చలాన్లు తప్పించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మోటార్‌ వెహికిల్స్‌ చట్టం ప్రకారం హాఫ్‌ హెల్మెట్స్‌ కూడా హెల్మెట్‌ ధరించనట్లే గుర్తించనున్నారు. 


కొనేముందు ఇవి చూడండి..

* కళ్లకు రక్షణగా వైజర్‌, పై భాగంలో షెల్‌, మరో ప్రధాన భాగం ప్యాడింగ్‌ ఉందో లేదో తప్పక చూడాలి.
* ఒక కిలో పైన బరువుందా లేదో పరిశీలించాలి.
* చెరిగిపోని ఐఎస్‌ఐ ముద్ర, భారతీయ గుర్తింపు సంఖ్య ఉందా లేదా చూడాలి.
* ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న హెల్మెట్‌ ధర నాణ్యతను బట్టి రూ.800 నుంచి రూ.3,000 దాకా ఉంది. నాన్‌-ఐఎస్‌ఐ అయితే రూ.75 నుంచి రూ.350 వరకు దొరుకుతున్నాయి.
* గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనడం ఉత్తమం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.