close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

సమ్మె ఉద్ధృతం!

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు

డిపోల వారీగా నోడల్‌ అధికారుల నియామకం

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

గద్వాల ఆర్టీసీ డిపోలోకి వెళ్లకుండా మహిళా కండక్టర్లను అడ్డుకుంటున్న పోలీసు సిబ్బంది

మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో ఐకాస నేతలు ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తున్నారు. కార్మికులకు మద్దతుగా పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తుండటంతో కార్మికులు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నెల 30 వరకు ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ప్రతి రోజు డిపోల వద్ద వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని డిపోల వద్ద సోమవారం గేటు ధర్నాను చేపట్టారు. మహబూబ్‌నగర్‌ డిపో వద్ద జరిగిన గేటు ధర్నాలో భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణను కల్వకుర్తిలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జరిగిన నాగర్‌కర్నూల్‌ జడ్పీ సమావేశానికి ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. జడ్పీ సమావేశం ముందు కార్మికులు ధర్నా చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలవారు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు సోమవారం బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో బస్‌ పాస్‌ కౌంటర్ల వద్ద విద్యార్థులు బారులు తీరారు.

నిరంతర పర్యవేక్షణ : సమ్మె ఉద్ధృతమవుతుండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో అధికారులు బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. సోమవారం 397 ఆర్టీసీ బస్సులను, 183 అద్దె బస్సులను నడిపించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా డిపోల వారీగా నోడల్‌ అధికారులను నియమించారు. వీరు డిపో మేనేజర్లు, రీజియన్‌ మేనేజర్లకు సంధానకర్తగా ఉంటారు. దీంతోపాటు ప్రతి రోజు ఎన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు? బస్సుల ఏర్పాట్లపై ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తున్నారా? ఎక్కువ డబ్బులను వసూలు చేస్తున్నారా? విద్యార్థులకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? తదితర వివరాలపై డిపోల పరిధిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించడంతో వారు డిపోల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

గద్వాలలో వర్షంలో ప్లాస్టిక్‌ కవర్‌ పట్టుకుని నినాదాలు చేస్తూ వెళ్తున్న ఆర్టీసీ కార్మికులు

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు : సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. ప్రధాన మార్గాల్లోనే ఆర్టీసీ బస్సులు తిప్పుతుండటంతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత్యంతరం లేక ఆటోలను, జీపులను, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. వారు అడిగినంత డబ్బులు ఇవ్వలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం బస్‌పాసుల కోసం బస్టాండుల్లో విద్యార్థులు బారులు తీరారు. సమ్మె నేపథ్యంలో బస్‌పాస్‌ కౌంటర్లు మూసి ఉన్నాయి. పాఠశాలలు తెరవడంతో అన్ని బస్టాండుల్లో తాత్కాలిక సిబ్బందితో ఆ కౌంటర్లను తెరిపించారు. దీంతో విద్యార్థులు బస్టాండుల్లో పాసులను పునరుద్ధరించుకోవడానికి బారులు తీరుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బస్సు పాసులు రెన్యువల్‌ చేయించినప్పటికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.