close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఇక బడులు రెండు అంచెలే..

ప్రాథమికోన్నత పాఠశాలల మూసివేతపై ఆలోచన

ఉమ్మడి జిల్లాలో 495 యూపీఎస్‌లు

6, 7 తరగతులు ఉన్నత పాఠశాలల్లోకి మార్పు

ఉపాధ్యాయుల సర్దుబాటు.. విద్యార్థుల విలీనం

ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

న్యూస్‌టుడే, వీరన్నపేట (మహబూబ్‌నగర్‌)

రాజోలి : పెద్ద ధన్వాడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు

ఉమ్మడి జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలు : 495

ఆరోతరగతి చదువుతున్న విద్యార్థులు : 47, 924

ఏడోతరగతి చదువుతున్న విద్యార్థులు : 47, 136

పాఠశాల విద్యలో ప్రాథమిక.. ప్రాథమికోన్నత.. ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉన్నాయి.. కానీ రానున్న రోజుల్లో ప్రాథమిక.. ఉన్నత పాఠశాలలు మాత్రమే ఉండనున్నాయి.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సరి చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.. అవకాశం ఉన్నచోట ఉన్నత పాఠశాలలుగా మార్ఫు. లేనిచోట సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.. ఉన్నత పాఠశాలలు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.. ప్రస్తుతం ప్రతిపాదనల వరకే ఉన్న ఈ నిబంధన రానున్న రోజుల్లో అమలుకు అధికారులు సిద్ధమవుతున్నారు..

ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొదటి నుంచి విద్యార్థుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్నత తరగతులు కావడంతో సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాల్సి ఉండగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ఈ విద్యార్థులకు బోధించాలంటే స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, సాంఘిక, సామాన్యశాస్త్రం ఉపాధ్యాయులు అవసరమవుతారు. అందుకే ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కంటే సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న అదే తరగతికి చెందిన విద్యార్థుల్లో సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు. ఇప్పటికే పది, ఇరవై మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ప్రస్తుతం చాలా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా మార్పు చేసుకునేందుకు అస్కారం ఉంది. వాటిని ఉన్నత పాఠశాలలుగా అధికారులు మార్పు చేస్తున్నారు. అవకాశం లేని చోట ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఉపాధ్యాయులను అవసరమున్నచోట సర్దుబాటు చేయనున్నారు.

మిడ్జిల్‌ మండలం బైరంపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల

ఈ ప్రాంతాల్లో ఏం చేస్తారు? : ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల విలీనంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? అని ఉపాధ్యాయ సంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా కొన్ని మండలాల్లో ఉన్నత పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రాథమికోన్నత పాఠశాలల కొనసాగింపు అనివార్యం అవుతుంది. ఒకవేళ దూర ప్రాంతంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులు తక్కువ ఉన్నారని విలీనం చేయకుండా ఉన్నత పాఠశాలలుగా మార్పు చేస్తే చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రతిపాదన దశలో ఉండటంతో అధికారికంగా ఎలాంటి నిర్ణయం వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సబ్జెక్టుపరంగా ప్రయోజనం : రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేస్తే విద్యార్థులకు సబ్జెక్టుపరంగా ప్రయోజనం కలగనుంది. దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలల్లోకి మార్పు చేయడం ద్వారా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారు. దీంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలలు దగ్గర ఉండకుండా దూరం వెళ్లాల్సి ఉంటే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. డ్రాపవుట్స్‌ పెరిగే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదేశాలు రావాల్సి ఉంది..: ప్రాథమిక ఉన్నత పాఠశాలల విలీనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పాఠశాలల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ఆదేశాలు రావాల్సి ఉంది. అధికారులు త్వరలో నిర్వహించే సమావేశంలో ఓ నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం యథావిధిగా పాఠశాలల్లో తరగతుల నిర్వహణ సాగుతుంది.

- ఉషారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.