close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

అదిరే పంచ్‌.. అబ్బుర పరిచే ప్రతిబ

బరిలోకి దిగితే పతకాలే

తైక్వాండోలో రాణిస్తున్న సోదరులు

చిన్నప్పటి నుంచి కరాటే అంటే సరదా.. చదువుకొంటూనే ఖాళీ సమయాల్లో ప్రత్యేక సాధన చేశాడు. తోటి విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగాడు. సరదా కాస్త ఆసక్తిగా మారి తైక్వాండో క్రీడలో అద్భుత ప్రతిభ చాటుకునే స్థాయికి ఎదిగాడు. ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. చివరకు అదే విద్యలో శిక్షకుడిగా ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. అతడి తమ్ముడు కూడా అన్నదగ్గరే శిక్షణ పొంది రాణిస్తున్నాడు. వివిధ పోటీల్లో పతకాలు సాధిస్తూ అభినందనలు అందుకొంటున్నారు అచ్చంపేటకు చెందిన యువకులు బి.శేఖర్‌, హరికృష్ణ.

- న్యూస్‌టుడే, అచ్చంపేట

నిరుపేద కుటుంబంలో విరిసిన కుసుమాలు..

తైక్వాండోలో శేఖర్‌ వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు

అచ్చంపేటకు చెందిన నిరుపేద దంపతులు ముత్యాలు, వెంకటమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిరు వ్యాపారం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు శేఖర్‌ డిగ్రీతో పాటు ఉపాధ్యాయ శిక్షణ (డీఎడ్‌) పూర్తి చేశాడు. తైక్వాండో శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. ప్రయివేట్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉంటూ తనకిష్టమైన తైక్వాండోలో శిక్షణ ఇస్తూ.. ఖాళీ సమయాల్లో సాధన చేస్తూ తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకొంటున్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న తమ్ముడు హరికృష్ణలకు కూడా తైక్వాండోలో శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు.

ఇదీ శేఖర్‌ ప్రతిభ..: 2012లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.

* అదే ఏడాది వరంగల్‌లో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని రజత పతకం అందుకొన్నాడు.

* 2014 గద్వాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం దక్కించుకున్నాడు.

* అదే ఏడాది కేరళ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకొన్నాడు.

* గతేడాది పంజాబ్‌ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లోనూ అత్యంత ప్రతిభ చాటాడు.

* ఈ ఏడాది జూన్‌ 11 నుంచి 16 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో శేఖర్‌ పాల్గొని మొదటి దశలో అర్హత సాధించి.. ఆ తరువాతి దశలో కొద్దిపాటి తేడాతో వెనుదిరిగాడు. ఈ పోటీలకు ప్రపంచంలోని 25 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిల్వలేకపోయినా.. ఇతని ప్రతిభకు తైక్వాండో ఇంటర్నేషనల్‌ స్థాయి రెండో బ్లాక్‌ బెల్టు అందించారు.

ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యం : తైక్వాండో అంతర్జాతీయస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. ఈ క్రీడకు పాఠశాల క్రీడా సమాఖ్య గుర్తింపు ఉంది. తైక్వాండోలో ప్రతిభావంతులకు క్రీడా విభాగంలో ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం ఉంది. తైక్వాండో సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యదర్శిగా తైక్వాండో క్రీడను విస్తరించేందుకు కృషి చేస్తా.

- బి.శేఖర్‌, అచ్చంపేట

సోదరుడి ప్రతిభ..

సాధన చేస్తున్న దృశ్యం

శేఖర్‌ సోదరుడు హరికృష్ణ కూడా తైక్వాండోలో పలు పతకాలు సాధించాడు. 2012 మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2013 జిల్లాస్థాయి పోటీల్లో మహబూబ్‌నగర్‌లోనే బంగారు పతకం దక్కించుకున్నాడు. 2015 విశాఖపట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఎస్‌జీఎప్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించి ప్రశంసలు అందుకున్నాడు.

హరికృష్ణ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.