close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

పర్యావరణానికి పోటు

జిల్లాలో ప్రధాన ఆలయాల్లో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ వినియోగం

పూజా సామగ్రి విక్రయ దుకాణాలపై కొరవడిన పర్యవేక్షణ

భక్తులకు అవగాహన కల్పించడంలోనూ అధికారుల నిర్లక్ష్యం

జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్‌ వినియోగం అధికమవుతోంది. దీని ఫలితంగా పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని అమలు చేస్తుండగా.. జిల్లాలో మాత్రం ఈ దిశగా చర్యలు కానరావడం లేదు. తాజాగా విజయవాడలోని దుర్గ గుడిలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం దేవస్థానంలో సైతం అమలు చేస్తున్నారు. జిల్లాలో అన్నవరంతో పాటు ఇతర ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్‌ వినియోగం కొనసాగుతూనే ఉంది.

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం ఆలయ పరిధిలో రోజుకు సుమారు రెండు టన్నుల వ్యర్థాలు వస్తుండగా.. ఇందులో 10 శాతం మేరకు వాడిపడేసిన ప్లాస్టిక్‌ కవర్లు ఉంటున్నాయి. అన్నవరం కొండపై ప్రసాదం కొనుగోలు చేసే వారికి పర్యావరణహితమైన బ్యాగులను దేవస్థానం విక్రయిస్తోంది. వ్రత పూజా సామగ్రి, ఇతర పూజలకు కొబ్బరి కాయలు, అరటి పండ్లను కూడా ఇలాంటి సంచుల్లోనే వ్యాపారులు అందజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పూలు, తులసి పత్రి వంటి వాటిని మాత్రం ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ కవర్లలోనే భక్తులకు అందిస్తున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు ఈ కవర్లతో వీటిని తీసుకెళ్లి పూజ అనంతరం అక్కడే పడేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్‌ కవర్లు కూడా వస్తున్నాయి. దీనికితోడు అన్నవరంలో కొన్ని దుకాణాల్లో ఇంకా ప్లాస్టిక్‌ కవర్లను విక్రయిస్తున్నారు. ఈ విషయంలో భక్తులకు అవగాహన కల్పించడంతో పాటు కొండపై ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించకుండా కట్టడి చేయడంపై అధికారులు చొరవ చూపడం లేదు. జిల్లాలో అంతర్వేది, తలుపులమ్మలోవ, ద్రాక్షారామ తదితర దేవస్థానాల్లో కూడా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం కొనసాగుతోంది.

* క్షారామలో స్వామి అభిషేకానికి వినియోగించే పాలను పాలథిన్‌ కవర్లలో పోసి భక్తులకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించవద్దని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ పూజా సామగ్రి విక్రయానికి కూడా ప్లాస్టిక్‌ కవర్లనే వాడుతున్నారు. స్వచ్ఛభారత్‌ అమలు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగించేందుకు అన్నవరంలో రెండు యంత్రాలను ఓఎన్జీసీ ఏర్పాటు చేసినా ఫలితముండటం లేదు. ఈ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. దీనికితోడు వీటి వినియోగంపై భక్తులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఫలితంగా ఈ యంత్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

ఏమి చేయాలంటే..

* ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్‌ వినియోగించకుండా భక్తుల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. ● ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి నిషేధించి ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్ధాలను వివరించాలి. ● అన్నవరం, ఇతర దేవస్థానాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంగా భోజనాల సమయంలో ప్లాస్టిక్‌ గ్లాసులు వినియోగించకుండా చర్యలు చేపట్టాలి. అన్నవరం కొండపై వ్యాపారులు ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించకుండా చూడాల్సి ఉంది. ● పర్యావరణ హితమైన కవర్లు, గడ్డ సంచులు వినియోగించేలా ప్రోత్సహించాలి.

అన్నవరంలో సేకరించిన వ్యర్థాల్లో భారీగా ప్లాస్టిక్‌ కవర్లు

చర్యలు తీసుకుంటాం

అన్నవరం దేవస్థానంలో ప్లాస్టిక్‌ వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు వీటి విక్రయాలు చేపడితే చర్యలు తీసుకోవడంతో పాటు భక్తులకు కూడా అవగాహన కల్పిస్తాం. ఇందుకోసం బోర్డులు ఏర్పాటు చేసి మైకుల ద్వారా ప్రచారం చేయిస్తాం.

- వి.త్రినాథరావు, ఈవో, అన్నవరం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.