close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

అడకత్తెరలో అన్నదాత

● పరిశ్రమల పేరుతో భూ సేకరణ

● ఏళ్లు గడుస్తున్నా వినియోగం శూన్యం.. పరిహారం దూరం

● ఆన్‌లైన్‌లో రైతుల పేర్ల తొలగింపు

● రాయితీ పథకాలకు అనర్హులైన సాగుదారులు


గుట్టపాడులో సాగు చేసిన పత్తి పంట

ఓర్వకల్లు మండలాన్ని గత ప్రభుత్వం పారిశ్రామిక హబ్‌గా ప్రకటించి వేలాది ఎకరాలు సేకరించింది.పరిశ్రమలు వస్తే తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనుకున్న రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పరిశ్రమలు రాలేదు. పరిహారం అందలేదు. మరోవైపు తమకున్న హక్కు చేజారిపోయింది. ఈ నేపథ్యంలో ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

న్యూస్‌టుడే, ఓర్వకల్లు: నాలుగేళ్ల క్రితం మండలంలోని 13 గ్రామాల్లోని 13,307.39 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లో ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం వస్తుందని భావించారు. కానీ, నాటి నుంచి పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు రాకపోవడం, పరిహారం ఇవ్వకపోవడంతో కర్షకులకు నిరాశే ఎదురైంది.

*బాధిత రైతులు అప్పటి నుంచి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి మూడెకరాల వరకు పట్టాలు పొంది సమీప బ్యాంకుల్లో పంట రుణాలు, రాయితీ విత్తనాలు, ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. ఆరు నెలల క్రితం బాధిత రైతుల భూములను ఆన్‌లైన్‌లో తొలగించి ఏపీఐఐసీ పేరుమీదుగా మార్పు చేశారు. అప్పటి నుంచి కర్షకులు ఎలాంటి పథకాలు పొందలేకపోతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములు ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో తమ పేర్లు తొలగించటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన సాగుదారులు రుణాలు చెల్లించి తిరిగి కొత్తవి తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాయితీ విత్తనాలు, రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు. తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, లేదంటే పరిహారమైనా ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు మాత్రం అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు కానీ సమస్యను పరిష్కరించటంలేదని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూములను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని, లేదంటే ఆన్‌లైన్‌లో ఎక్కించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

మండలంలో ఇలా

మండలంలోని 13 గ్రామాల్లో 13,307 ఎకరాలు సేకరించగా అందులో పట్టాలు పొంది సాగులో ఉన్న భూములు 1426.14 ఎకరాలు, పట్టాలు పొంది సాగులో లేని భూములు 1099.84 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ బంజరు భూములు 10921.45 ఎకరాలు ఉండగా పట్టా భూములు 959.80 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను ఏపీఐఐసీకి కేటాయించారు.

రూ.6 లక్షలు ఖర్చు చేశాను : లాల్‌ మహమ్మద్‌, బాధిత రైతు, సోమయాజులపల్లె

గ్రామ సమీపంలోని సర్వే నంబర్‌ 1లో పదేళ్ల క్రితం 2.00 ఎకరాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి భూ అభివృద్ధిలో భాగంగా బోరు వేయించి, మామిడి తోట నాటేందుకు రూ.6 లక్షలు ఖర్చు చేశాను. మామిడి తోటతో జీవనం కొనసాగిస్తున్నా. ఆన్‌లైన్‌లో తమ పేరు తొలగించి ఏపీఐఐసీ పేరు మీద మార్పు చేశారు. అంతర్జాలంలో పేరు లేకపోవటంతో బ్యాంకు అధికారులు అప్పు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం : శివరాముడు, తహసీల్దారు

ఓర్వకల్లు మండలంలోని ప్రభుత్వ భూములు ఏపీఐఐసీకి బదలాయించాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి మార్పు చేశాం. తమకు పరిహారం రాలేదని పేర్లు ఆన్‌లైన్‌లో తొలగించారని పలువురు రైతులు సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. పరిహారం విషయంపై సంయుక్త కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు అన్నదాతలకు న్యాయం చేస్తాం.

ఏళ్ల తరబడి సాగు చేస్తున్నాం

ఓర్వకల్లులోని సర్వే నంబర్‌ 372/1లో 3.50 ఎకరాలకు పట్టా ఇచ్చారు. పదేళ్ల క్రితం పట్టా ఇవ్వటంలో పలు పంటలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తొలగించటంతో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ పథకాలు వర్తించటం లేదు. తమ భూములు ఆన్‌లైన్‌లో నమోదు చేసి న్యాయం చేయాలి. - జ్ఞానముని, బాధిత రైతు, ఓర్వకల్లు

​​​​​​​
సోమయాజులపల్లెలో బాధిత రైతులు సాగు చేసిన కంది పంట

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.