close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

నిండు కుండ... రబీకి అండ

ఎస్సారెస్పీ నిండటంతో ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం
జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే

ఉత్తర తెలంగాణ వరదాయని శ్రీరాంసాగర్‌లోకి సీజన్‌ చివర్లో భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. జూన్‌లో డెడ్‌స్టోరేజీ మట్టంలోఉన్న ఎస్సారెస్పీలోకి గత నెల రోజులుగా ఇన్‌ఫ్లో పెరగగా ప్రస్తుతం గరిష్ఠ మట్టానికి చేరటం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు ఊరట కలిగించింది. ఖరీఫ్‌ పంటల అవసరం ముగిసిన తరుణంలోనూ ఎస్సారెస్పీ నిండుకుండను తలపిస్తుండటంతో రబీకి పూర్తిస్థాయిలో సాగునీరు, జిల్లా ప్రజల అవసరాలకు తాగునీరు అందే వీలుకలిగింది.
ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి భారీగా వరదనీరు వస్తుండగా గరిష్ఠస్థాయిలో 90.313 టీఎంసీల నీటిని నిల్వచేసి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతున్నారు. జిల్లాకు నీరందించే కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఈ నీటిని కరీంనగర్‌ వద్దగల దిగువమానేరు జలాశయం, రోళ్లవాగు తదితర చిన్నతరహా జలాశయాలు, నేరుగా నీరు చేరే చెరువుల్లోకి తరలించనున్నారు. ఐతే ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వరిపైరు చివరికి రావటంతో ఆయకట్టుకు నీరువద్దని రైతులు పేర్కొంటుండగా కాకతీయ కాలువద్వారా మొత్తం నీటిని చిన్ననీటి వనరుల్లోకి తరలించనున్నారు. ఎల్‌ఎండీ నిండితే మిగులు జలాలను మళ్లీ మానేరు వాగుద్వారా గోదావరికి వదలనున్నారు. ఎల్‌ఎండీలోనూ ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిలువుండగా కాకతీయ కాలువద్వారా కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీరు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఎల్‌ఎండీ, రోళ్లవాగు, చిన్నతరహా నీటినిల్వలను పూర్తిగా నింపే అవకాశముంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆధారితంగా ఉమ్మడి జిల్లాలో 5.73 లక్షల ఎకరాల ఆయకట్టుఉంది. ఎస్సారెస్పీ నుంచి నీటిని వరదకాలువలోకి వదిలి నిండుగా  నిల్వచేసే అవకాశముండటంతో ఈ కాలువ పరిసర గ్రామాల్లో దాదాపుగా 59 వేల ఎకరాలకుపైగా అదనంగా పంటలు సాగులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.313 టీఎంసీల నీరుండగా వారబందీ పద్ధతిన రబీలో 8-10 నీటితడులను అందిస్తే 55-60 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రాజెక్టు పరిధిలోనున్న గుత్ప, ఆలీసాగర్‌, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు 5.50 టీఎంసీలు, మిషన్‌ భగీరథ తాగునీటి అవసరాలకు 5.50 టీఎంసీలు, ఆవిరిగా 4.50 టీఎంసీల నీరు వెళ్తుంది. ప్రస్తుతం ఎల్‌ఎండీలో నిండుగా నీరుండటం, వరదకాలువలోనూ నీరుండటంతో ఎస్సారెస్పీ నుంచి వదిలే నీటి అవసరం తగ్గనుంది. ఈ నేపథ్యంలో రబీ పంటలకు పూర్తిగా నీరందించినా ఇంకనూ దాదాపుగా 16-20 టీఎంసీల వరకు నీరు ఎస్సారెస్పీలో మిగిలే అవకాశముంది. మొత్తానికి ఖరీఫ్‌ చివర్లో నీరునిండిన ఎస్సారెస్పీతో ఉమ్మడి జిల్లాలో రబీలో మెండైన పంటలు సాగులోకి వచ్చి ధాన్యాగారంగా తనపేరును సార్థకం చేసుకుంటుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.