close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

పాపం పసివాళ్లు

 అగ్నిప్రమాద ఘటనతో ఉలికిపాటు
 ఎటుచూసినా రోదనలు.. హాహాకారాలు
 మంటలకు చిక్కిన చిన్నారులను చూసి వేదన
 పసికందు మృతితో అలముకున్న విషాదం

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, ఎల్‌.బి.నగర్‌, నాగోల్‌: వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆ ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. గత వారం రోజుల్లో వచ్చినవారే ఎక్కువ. సమస్యను బట్టి వేర్వేరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తమ బిడ్డలు కోలుకొని ఆరోగ్యవంతులు కావాలని, త్వరగా ఇళ్లకు చేరుకొని తమ చేతుల్లో కేరింతలు కొట్టాలని తల్లిదండ్రులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తూ రేయింబవళ్లు అక్కడే ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదం.. సరిగ్గా సోమవారం తెల్లవారుజామున 2.40గంటలకు అంతా గాఢనిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా ప్రమాదం. నవజాత శిశువుల చికిత్స విభాగంలో రిఫ్రిజిరేటర్‌ పేలి సంభవించిన ప్రమాదంతో అంతా తల్లడిల్లారు. చుట్టూ మంటలు, పొగలు వ్యాపించడంతో హాహాకారాలు చేశారు. రక్షించండి అంటూ రోదించారు. కొందరు పిల్లలను భుజంపై వేసుకొని మెట్లపై నుంచి దిగుతూ బయటకు పరుగులు తీయగా, ఇంకొందరు చిన్నారులను పట్టుకొని తీవ్రంగా విలపించారు. ఎల్‌బీనగర్‌ షైన్‌ ఆసుపత్రి వద్ద కనిపించిన దృశ్యమిది. ఇక్కడ జరిగిన ప్రమాదంలో 4 నెలల చిన్నారి మృత్యువాత పడటం...మరో ముగ్గురు గాయపడ్డంతో విషాదం నెలకొంది. శరీరంపై కాలిన బొబ్బలతో బిడ్డలు విలవిల్లాడుతుంటే కన్నవారి గుండె తరుక్కుపోయింది. ఆసుపత్రి కింది అంతస్తుల్లో ఉన్నవారు తీవ్ర భయకంపితులయ్యారు. సమీపంలోనే ఉన్న ఎల్బీనగర్‌ ఠాణా పోలీసులు, సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ అగ్నిమాపక సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి లోపలున్న చిన్నారులను రక్షించేందుకు ఆసుపత్రి అద్దాలను పగలగొట్టి పొగ బయటికి వెళ్లేలా చేశారు. అందరినీ కిందకు పంపేటట్లు చర్యలు తీసుకున్నారు.

గంటల తరబడి రోడ్లపైనే... ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర విభాగంలోని చిన్నారులను ఆయా ఆసుపత్రులకు తరలించిన షైన్‌ ఆసుపత్రి వైద్య సిబ్బంది.. అనంతరం ఎక్కడికక్కడ తలుపులు మూసివేసి పరారయ్యారు. కింద అంతస్థుల్లో ఉన్న చిన్నారులతోపాటు వారి కుటుంబ సభ్యులను రోడ్డున పడేసి పట్టించుకోవడం మానేశారు. దీంతో కొందరు తమ బిడ్డలను వివిధ ఆస్పత్రులకు తరలించగా.. పలువురు ఉదయం వరకు అక్కడే గడిపారు. వెంటతెచ్చుకున్న డబ్బులు ఖర్చయిపోవడంతో దిక్కుతోచని స్థితి ఎదుర్కొన్నారు. ఏడుపుతో పిల్లలు గొంతులు ఎండిపోయాయి. వారి గొంతు తడుపుదామన్నా పాల సీసాలు, వివిధ వస్తువులు ఆసుపత్రిలోనే ఉండి పోయాయి.

ముగ్గురు పిల్లలను కాపాడా... ‘‘ఒక్కసారిగా పేలుడు జరిగింది. దట్టంగా పొగలు కమ్మేశాయి. ఘటనలో మా బంధువు కుమారుడు చనిపోయాడు. నేను చొరవ తీసుకొని ముగ్గురు పిల్లలను బయటకు తెచ్చా. ప్రమాద సమయంలో ఎన్‌ఐసీయూలో ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. ముందే అప్రమత్తమై ఉంటే గాయాలు కాకుండా బయటకు కాపాడే పరిస్థితి ఉండేది.’’ అని ప్రత్యక్ష సాక్షి నవీన్‌ తెలిపారు. ‘‘ఈ భవనం నాలుగు ఫ్లోర్లు నిర్మించడం, అన్నింటికీ అనుమతుల్లేవని జీహెచ్‌ఎంసీకి 15 పర్యాయాలు ఫిర్యాదు చేశాం.. ఇటీవల కూడా ఇలానే అగ్ని ప్రమాదం జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా చేశారు’’ అని స్థానికులు గణేష్‌గౌడ్‌, జైపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌ తెలిపారు.

నేతల పరామర్శ... ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అక్కడకు చేరుకుని బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో కలిసి పలువురు భాజపా నేతలు మాట్లాడుతూ యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మృత్యుంజయురాలు... ఈ చిన్నారి!
ప్రమాదం పసిగట్టి బయటకు తెచ్చిన తండ్రి

నాగోలు, న్యూస్‌టుడే: ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో అక్కడ చికిత్స పొందుతున్న అయిదుగురు పిల్లల్లో ఓ పాప ఎలాంటి గాయాలు కాకుండా బయటపడింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం కురుమట్ల గ్రామానికి చెందిన నాగరాజు భార్య సుగుణమ్మ 13 రోజుల క్రితమే ఓ పాపకు జన్మనిచ్చింది. పాపకు శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడ్డంతో ఆదివారం ఉదయం ఈ ఆసుపత్రిలో చేర్పించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయానికి అక్కడే ఉన్న నాగరాజు ప్రమాద తీవ్రతను పసిగట్టాడు. అత్యవసర విభాగంలో పొగచూరిన గదిలో ఉన్న తన కుమార్తెను ధైర్యంచేసి వెళ్లి రక్షించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి సమీపంలోని దిశ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం ఉదయం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వారిని పరామర్శించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.