close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

దహిస్తోంది అవినీతి.... ఆర్పే దిక్కేది?

 వేల సంఖ్యలో రక్షణలేని నిర్మాణాలు
 ఆహుతవుతున్న అమాయక జనం
 ముడుపులతో  నిద్దరోతున్న జీహెచ్‌ఎంసీ
 షైన్‌ ఆసుపత్రి దుర్ఘటనతోనైనా మేల్కొనేనా?
ఈనాడు, హైదరాబాద్‌

నిద్రలో ఉన్న వారిని తట్టి లేపగలం.. అదే నిద్ర నటించేవారిని మాత్రం ఏమీ చేయలేం కదా..! నగర యంత్రాంగానిదీ అదే పరిస్థితి.. ఇదే అమాయకుల ఉసురు తీస్తోంది.. మహా నగర పాలక సంస్థ అధికారుల అవినీని అమాయకులను దహించేస్తోంది.. యంత్రాంగం నిర్లక్ష్య వైఖరితో నగర వ్యాప్తంగా మెజార్టీ ఆస్పత్రులు అగ్నిమాపక నిరోధక చర్యల్లేకుండా నడుస్తున్నాయి. అదనపు అంతస్తుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గుహల్లాంటి గదుల్లో పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాలు కొనసాగుతున్నాయి. సొరంగాల్లాంటి భవంతుల్లో పబ్బులు, రెస్టారెంట్లు వెలిశాయి. అడ్డదిడ్డంగా కొలువుదీరిన వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్‌ హాళ్లు, సభా స్థలాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాల్లో మచ్చుకు కూడా అగ్నిమాపక చర్యలు, ప్రమాద నివారణ చర్యలు కనిపించట్లేదు. అనుమతుల్లేకుండా, ప్రమాదభరితంగా నడుస్తోన్న ఆయా నిర్మాణాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల అండదండలుండటంతో అధికారులు నెల మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడట్లేదన్న విమర్శలున్నాయి.

హైదరాబాద్‌ మహా నగరంలో అగ్నిమాపక నిరోధక చర్యల అమలు రెండు రకాలుగా ఉంది. అగ్ని ప్రమాదాల నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం 15మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుండే భవనాలకు రాష్ట్ర అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం ఇస్తుంది. దానికన్నా తక్కువ ఎత్తుండే నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తాయి. రెండు శాఖలూ ఒకటే తీరులో.. అవినీతి మంత్రం పాటిస్తూ అగ్నిమాపక చర్యల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. పలువురు అవినీతి అధికారులు వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలల నుంచి ముడుపులు తీసుకుని ఎన్వోసీల జారీని విక్రయానికి పెట్టారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అదే అధికార యంత్రాంగం రెండు రోజులు నోటీసుల జారీ పేరుతో హడావిడి చేయడం.. ఆపై మిన్నకుండిపోవడమే అందుకు నిదర్శనం. కంటి తుడుపు చర్యలతో అక్రమార్కులను కాపాడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
* ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య లోపం, సిబ్బంది తీరు, రద్దీ, రోగ నిర్ధరణ పరీక్షల ఫలితాల వెల్లడిలోని జాప్యం తదితర కారణాలతో చాలా మంది పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా భారమైనా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రైవేటు యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా రక్షణ చర్యలకు తిలోదకాలిచ్చి అగ్గిపెట్టెల్లాంటి నిర్మాణాల్లో ఆస్పత్రులను నిర్వహిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు తలొగ్గి పట్టించుకోవట్లేదు.

పాఠశాలల పరిస్థితీ అధ్వానం..
నగరంలో దాదాపు 90శాతం మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివిస్తుండగా అక్కడా పరిస్థితి దారుణంగానే ఉంది. 40, 50గజాల స్థలంలో మూడు, అంతకు మించి అంతస్తుల్లో వెలసిన నిర్మాణాల్లో ప్లేస్కూళ్లు నడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో, సరిగా నడిచేందుకు దారిలేని భవనాల్లో నడుస్తోన్న పాఠశాలలు, కళాశాలల్లో నగర వ్యాప్తంగా 2లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారని, మరో 2లక్షల మంది అధ్వానంగా ఉన్న వసతి గహాల్లో ఆశ్రయం పొందుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల సమయంలో ఒకే సారి వేల మంది ఉండే ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, పరిశ్రమలు, సినిమా హాళ్లలోనూ అదే దుస్థితి. జీహెచ్‌ఎంసీ అగ్ని ప్రమాదాల నివారణ విభాగం అధికారులు నోటీసులు ఇచ్చి.. తరువాతా స్పదించకపోతే కేసులు నమోదుచేయాలి. నోటీసులు మాత్రమే ఇచ్చి బేరాలు కుదుర్చుకుంటున్నారన్న విమర్శలూ ఎన్నెన్నో.

‘నోటీసులిచ్చాం..

నగర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోని 700 పబ్బులు, 600 పాఠశాలలకు నోటీసులిచ్చామని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. వాటన్నింటినీ మూసేస్తామని హెచ్చరించడంతో యాజమాన్యాలు దిగొచ్చి పరిస్థితిని చక్కదిద్దుకోవడంతో ఎన్‌వోసీలు ఇచ్చామని చెప్పారు.

నగరంలో ఇలా..

* 50 పడకల ఆస్పత్రులు.. 120 నుంచి 150
* 10-20 పడకల ఆస్పత్రులు, క్లినిక్‌లు.. 3వేల నుంచి 4వేలు
* 200లకుపైగా పడకలున్న దవాఖానాలు..   15+
* చిన్నా, పెద్దా కలిపి ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకలు.. 6,000+

అక్రమ గోదాములు..

కాటేదాన్‌, బాబుల్‌రెడ్డినగర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 1,500 అక్రమ గోదాములున్నాయి. మూడేళ్లలో 50కి పైగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్థానికులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అధికారులు తెలియని విషయం కాదిది.

ఆసుపత్రుల్లో గత దుర్ఘటనలు..

* సోమాజిగూడ పార్క్‌ ఆసుపత్రి(ప్రస్తుతం డెక్కన్‌)లో షార్ట్‌ సర్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 39 మంది చికిత్స పొందుతున్నారు. వార్డుల్లోకి మంటలు వ్యాపించడంతో ఒక రోగి మృతిచెందారు. మిగతా వారిని అగ్ని మాపక సిబ్బంది కాపాడారు.
* నిలోఫర్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. లక్డికాపూల్‌లోని లోటస్‌ ఆసుపత్రిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం సంభవించలేదు.
* ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో కూడా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు అప్రమత్తం కావడంతో ఎవరికి హాని జరగలేదు.

మలక్‌పేటలో ‘అగ్గి’ మేడలు!

రెండు రోజుల కిందట మలక్‌పేట సలీంనగర్‌ సర్వీస్‌రోడ్డులోని ఆది హోండా షోరూం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం భవనాన్ని పరిశీలించగా.. షోరూంలో ప్రమాదాల నివారణకు బిగించిన నీటి పైపులైన్లు పనిచేయలేదని తేలింది. లోపలున్న సిబ్బంది బయటకు తప్పించుకునే వాతావరణం లేదు. సెల్లార్‌ నుంచి రెండో అంతస్తు వరకు పూర్తిగా ద్విచక్రవాహనాలు నిండి ఉన్నాయి. దిల్‌షుక్‌నగర్‌ కేంద్రంగా అనేక శిక్షణ కేంద్రాలు పిట్టగూళ్లలాంటి గదుల్లోనే ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో వందలాది మంది యువత శిక్షణ తీసుకుంటారు. ఇటీవల సూరత్‌లో ఓ శిక్షణ కేంద్రంలో మంటలు చెలరేగి పలువురు అగ్నికి ఆహుతైన దుర్ఘటనను సైతం లెక్కచేయకుండా ఇక్కడి వారు అలాగే కేంద్రాలను కొనసాగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసుల పేరుతో సూరత్‌ ఘటన తర్వాత కొంతకాలం హడావిడి చేసి తర్వాత వదిలేశారు. విద్యాశాఖ వారూ పట్టించుకోవట్లేదు.

భారీ భవన సముదాయాల ప్రాంతం.. భద్రత అంతంత మాత్రం

* వేల సంఖ్యలో రక్షణలేని నిర్మాణాలు
* ఆహుతవుతున్న అమాయక జనం
* ముడుపులతో  నిద్దరోతున్న జీహెచ్‌ఎంసీ
* షైన్‌ ఆసుపత్రి దుర్ఘటనతోనైనా మేల్కొనేనా?
-న్యూస్‌టుడే, మలక్‌పేట

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.