close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష!

తగిన రక్షణ ఏర్పాట్లతోనే ప్రమాదాల నివారణ
 విద్యుత్‌ గృహోపకరణాల నిర్వహణపై దృష్టి అవసరం
 ఇలా చేస్తే మేలు.. జేఎన్‌టీయూ ఆచార్యుడి సూచనలు
ఈనాడు, హైదరాబాద్‌

ఎల్బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి దుర్ఘటన నగరంలో కలకలం రేపింది. ఓ ఫ్రిజ్‌ కారణంగా విద్యుదాఘాతం జరిగి.. మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. నిత్యం గృహాలు, వాణిజ్య భవనాల్లో విద్యుత్‌ ఉపకరణాల కారణంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. తీగల అమరిక(వైరింగ్‌) సరిగా లేకపోవడంతో అనుకోని దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. మరి.. విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా గృహాలు, వాణిజ్య భవనాల్లో ఎలాంటి ఏర్పాట్లుండాలి..? గృహోపకరణాల రక్షణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? ఇలా వివిధ అంశాలపై జేఎన్‌టీయూ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆచార్యుడు  జి.తులసీరామ్‌దాస్‌ వివరిస్తున్నారిలా....

దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇవీ..
ఎర్తింగ్‌.. ఎంతో కీలకం

ఏ భవనానికైనా ఎర్తింగ్‌ అనేది కీలకం. విద్యుదాఘాతం జరగకుండా కాపాడేందుకు ఇది ఉండాలి. ఎర్తింగ్‌ ఉంటే అధిక కరెంటు వచ్చినప్పుడు నేరుగా ఎర్త్‌లోకి వెళ్లి విద్యుత్‌ ఉపకరణాలపై ప్రభావం పడదు. సాధారణంగా భవనాలకు విద్యుత్‌ పనులు చేసే సమయంలో గుత్తేదారులు ఎర్తింగ్‌ను ఏర్పాటు చేయరు. దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా మరో గుత్తేదారును ఎంచుకోవాలి. ప్రమాణాల మేరకు చేయించాలి. బొగ్గు, ఇసుక, ఉప్పు.. వంటివి అవసరానికి తగ్గట్టుగా వేసి చేస్తారు. ఎర్తింగ్‌ ఉండటమే కాదు.. దాని నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఎర్త్‌ రెసిస్టెన్స్‌ 0.5 కన్నా తక్కువగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

ఎంసీబీ.. ఉందా..?

ఎంసీబీ(మెయిన్‌ సర్క్యూట్‌ బోర్డు) అనేది ప్రతి భవనానికి కీలకం. కరెంటు అధికంగా రావడం, తక్కువగా రావడం జరిగినప్పుడు ఎంసీబీలోని స్విచ్‌లు ట్రిప్‌ అవుతాయి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఐఎస్‌ఐ మార్కు ఉన్న బోర్డులు అమర్చుకోవాలి. సాధారణంగా ఇంటికైతే ఎక్కడో ఒకచోట బోర్డు పెడతారు. వాణిజ్య భవనాల్లో ప్రతి అంతస్తు లేదా గదికి ఒకటి చొప్పున బిగిస్తారు. దీంతో ఎక్కడ సమస్య వస్తే అక్కడే ట్రిప్‌ అవుతుంది.

స్టెబిలైజర్‌ ఉందా.. లేదా..?

ప్రస్తుతం విద్యుత్‌ ఉపకరణాలకు ఇన్‌బిల్ట్‌ స్టెబిలైజర్లు వస్తున్నాయి. చాలామంది అలా ఉన్నాయో లేవో పరిశీలించుకోవడం లేదు. లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. కరెంటు హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు స్టెబిలైజర్‌ గ్రహించడంతో ప్రమాదాలు జరగకుండా నిలిపే అవకాశం ఉంది.

ఫ్యూజులు సరిచూసుకోండి!

విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ఫ్యూజులు కీలకం. కొన్ని సందర్భాల్లో అవి ఫెయిలైతే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. వోల్టేజీలో భారీ మార్పులు వస్తే ఫ్యూజులు పోతాయి. అలా జరగకపోతే గృహోపకరణాలు, తీగలపై ప్రభావం పడి స్కార్క్‌ వచ్చి మంటలు చెలరేగే అవకాశం ఉంది. అదే ఫ్యూజులు ట్రిప్‌ అయితే ఉంటుంది.

తీగలు గజిబిజిగా వద్దు

పాత భవనాల్లో వైరింగ్‌ సక్రమంగా ఉండటం లేదు. గజిబిజిగా, ఒకేచోట నుంచి కుప్పలుకుప్పలుగా వేసి కనెక్షన్లు ఇస్తుంటారు. ఎక్కువ ఏళ్లపాటు ఉండటంతో ఇన్సులేషన్‌ దెబ్బతిని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఐదేళ్లకోసారి వైరింగ్‌ వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి. పాతకాలం తీగలుంటే లోడ్‌ పెరిగి ఏ వస్తువు సున్నితమైతే దానిపై ప్రభావం పడి పాడవుతుంది. ఫేజ్‌లను బట్టి తీగలు అమర్చాలి.

జంక్షన్‌ జామ్‌ చేస్తే ప్రమాదాలే!

తీగలు వేర్వేరు గదులకు ఒకే జంక్షన్‌ నుంచి వేస్తే లోడ్‌ పెరిగి ప్రమాదాలకు ఆస్కారమిచ్చినట్లు అవుతుంది. వైరింగ్‌ కెపాసిటీ బట్టి ఎన్ని ఏసీలకు కనెక్ట్‌ చేయాలి..? ఎన్ని ఫ్రిజ్‌లకు ఇవ్వాలో చూసుకుని ఆ మేరకే చేసుకోవాలి. అతుకులు లేకుండా తీగలు ఉండాలి.

స్పార్క్‌తోనే మొదలు

వానాకాలంలో వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఎక్కువ. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఓల్టేజీ ఒక్కసారిగా పడిపోవడం.. పెరగడం జరుగుతుంది. ఉదాహరణకు 230 వోల్టులు కావాల్సి ఉంటే 180కి పడిపోవచ్చు. దీంతో కరెంటు సరఫరా పెరిగి ఉపకరణాలపై ఒత్తిడి(లోడ్‌) పడి మోటారు లేదా తీగలు మాడిపోయి స్పార్క్‌లు వస్తాయి. అది కాగితం, చెక్క, పీవీసీ పైపులు, క్లాత్‌, రబ్బరు.. ఇలా అగ్ని వాహకాలకు అంటుకుని మంటలు చెలరేగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.