close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

కుటుంబ సభ్యులతో సమ్మె

17వ రోజూ కొనసాగిన కార్మికుల నిరసనలు


కొత్తగూడెం బస్టాండ్‌ వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన

ఈనాడు, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సమ్మె కొనసాగుతోంది. ఖమ్మంలో ఉదయం 5 గంటలకే కార్మికులు డిపోకి చేరుకుని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. కార్మికుల కుటుంబ సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ తీయాలని నిర్ణయించారు. ర్యాలీ మార్గం మధ్యలో డిపోవైపు ఓ బస్సు వెళ్తూ ఎదురుగా కార్మికులకు కనిపించింది. దీంతో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌పై కార్మికులు చేయిచేసుకున్నారు. అనంతరం ర్యాలీ బస్టాండ్‌ వరకు సాగింది. అక్కడ నిరసన వ్యక్తం చేసి ఆటాపాట నిర్వహించారు. డిపోకి చేరుకొని అక్కడ వంటావార్పు చేశారు. ఈ సమ్మెలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, సీపీఎం నేత ఎర్రా శ్రీకాంత్‌, భాజపా నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్‌, తెజస నేత బత్తుల సోమయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు టి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

* కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికులకు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కాసాని ఐలయ్య తదితరులు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. బస్టాండు వద్ద ప్రదర్శన, బైఠాయింపు చేశారు.

* మధిరలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు సమ్మెకు హాజరయ్యాయి. తెదేపా జిల్లా కన్వీనర్‌ డా.వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు.

* భద్రాచలంలోని బ్రిడ్జిసెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు కార్మికులు, కుటుంబ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండులో ఆందోళన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ సెంటర్‌కు అక్కడ నుంచి బ్రిడ్జిసెంటర్‌కు చేరుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వీరికి మద్దతు తెలిపారు. మణుగూరు డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మరికొందరు కార్మికులు పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చున్నారు. ఈ సమయంలో కాస్తంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుగా ఉన్న వారిని చెదరగొట్టడంతో పరిస్థితి చక్కబడింది.

పోలీసుల అదుపులో కాంగ్రెస్‌ నాయకులు.. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఉభయ జిల్లాల్లోని పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను ఖానాపురం హవేలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉభయ జిల్లాల్లోని కాంగ్రెస్‌ జిల్లా, మండల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

నడిచినవి..:

* ఆర్టీసీ బస్సులు: 290

* ప్రైవేటు బస్సులు: 162

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.