close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

మూడేళ్లు.. రూ.1774 కోట్లు

 గ్రేటర్‌ ఆర్టీసీ నష్టాలివీ
 ఆర్థిక దీనావస్థతో సతమతం
 డొక్కువి మార్చరు.. కొత్తవి కొనరు
 ప్రభుత్వ తోడ్పాటుతోనే మనుగడ సాధ్యం
ఈనాడు, హైదరాబాద్‌

వస్తున్న ఆదాయానికి, నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయానికి ఎక్కడా లంకె కుదరకపోవడంతో హైదరాబాద్‌ మహానగర ఆర్టీసీ ఆర్థికంగా దీనావస్థలో ఉంది. ప్రతి రోజూ బస్సులను తిప్పడమే కష్టసాధ్యంగా మారింది. గత నాలుగేళ్లలో నగర ఆర్టీసీ రూ.1774 కోట్ల నష్టాల్లో మునిగిపోయింది. దీనివల్ల ఒక కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు ఇవ్వకపోతే చాలా కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తే అధికారుల వైఫల్యాలు అనేకం కనిపిస్తున్నాయి.

భాగ్యనగరంలో ప్రతి రోజూ 3525 ఆర్టీసీ బస్సులు తిరుగుతూ 33 లక్షల మంది ప్రయాణీకులను తరలిస్తున్నాయి. గత 14 రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మె వల్ల మూడొంతుల సిటీ బస్సులు తిరగకపోవడంతో లక్షలమంది ప్రజలకు పూర్తిస్థాయి రవాణా వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది బయట ప్రయాణాలను తగ్గించుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఆర్టీసీ నగర ప్రజల జీవనంలో ఎంతగా పెనవేసుకుపోయిందో ఇట్టే విదితమవుతోంది.

 

కష్టాలకు కారణాలివీ
* ఆర్టీసీ సంస్థకు అధికంగా నష్టాలు రావడానికి ప్రధాన కారణం ఆధునికత వైపు వెళ్లకపోవడమే. ప్రస్తుతం ఉన్న 3697 ఆర్టీసీ బస్సుల్లో అధిక భాగం డొక్కువే.
* నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పూర్తైన బస్సులను తుక్కు కింద పరిగణిస్తారు. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర దాదాపు 750 బస్సులు ఇవే ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవే.
నిబంధనల ప్రకారం వీటిని రోడ్ల మీద నుంచి తొలగించాల్సిందే. కానీ అధికారులు మరమ్మతులు చేస్తూ రంగులు వేసి రోడ్ల మీదకు వదులుతున్నారు. ఇవి కండీషన్‌ లేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎక్కడబడితే అక్కడ ట్రాఫిక్‌లోనే నిలిచిపోతున్నాయి. దీంతో ఆర్డినరీ బస్సులు ఎక్కాలంటేనే ప్రయాణీకులు భయపడుతున్నారు.
* డొక్కు బస్సుల వల్ల డీజిల్‌ వ్యయం పెరిగిపోతోంది. సాధారణంగా ఒక బస్సు రద్దీ రూట్లలో లీటరు డీజిల్‌కు 6-8 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంది. డొక్కువైతే మూడు కిలో మీటర్లు మేర కూడా నడవడం లేదు.
* 2006-07లో కేంద్ర ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద 1200 బస్సులు కొనుగోలు చేసింది. అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మార్కోపోలో పేరుతో ఉన్న వీటి వల్ల ఆర్టీసీ నష్టపోయింది. వీటి డీజిల్‌ వినియోగం లీటరుకు కేవలం 3 కి.మీ వస్తోంది. ఆర్టీసీకి ఇవి భారంగా మారాయి. వీటిని పక్కన పెట్టాలంటే కొత్తవాటి కొనుగోళ్లు లేవు.
* ఏటా వెయ్యి బస్సులను గత నాలుగైదేళ్లలో కొనుగోలు చేసి ఉంటే పరిస్థితి మెరుగపడేది. గత మూడేళ్లలో నామమాత్రంగానే కొనుగోలుచేశారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వ తోడ్పాటుపైనే ఆధారపడింది. జీహెచ్‌ఎంసీ నుంచి ఏటా కొన్ని నిధులు ఆర్టీసీకి కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా విడుదల చేయలేదు.
* నగరంలో కొన్ని రూట్లలో ఒకవైపు మెట్రో, మరోవైపు ఎంఎంటీఎస్‌ ప్రజలకు సేవలందించడంలో దూసుకుపోతున్నాయి. వీటికి అధికంగా ఆదరణ లభిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్టీసీ అధికారులు తమ రూట్‌ ప్రణాళికను కొత్తగా రూపొందించుకోలేదు. మినీ బస్సులను సమకూర్చుకుని వేలాది కొత్త కాలనీల నుంచి తిప్పడం ప్రజల మన్నన పొందవచ్చు. అటువంటి ప్రయత్నాలేవీ జరగలేదు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.