close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

జ్వరం చంపేస్తోంది!

ఉభయ జిల్లాల్లో పెరుగుతున్న బాధితులు

విష జ్వరాలతో వంద మందికిపైగా మృత్యువాత

ఆ మరణాలు లేవంటున్న వైద్య ఆరోగ్య శాఖ

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే

 

పది రోజుల క్రితం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మించిన శిశువుకు పుట్టకతోనే డెంగీ ఉన్నట్లు నిర్ధారణైంది. కేవలం 1.2 కేజీల బరువుతో పుట్టిన శిశువు అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యులు పరీక్షించారు. దీంతో డెంగీ ఉన్నట్లు నిర్ధారించి ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స అందిస్తున్నారు. కాన్పు సమయంలో తల్లి కూడా జ్వరంతో బాధపడుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. తద్వారా బిడ్డకు డెంగీ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

* ఖమ్మం న్యాయస్థానంలో రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తిగా పని చేస్తున్న జయమ్మ జ్వరం బారిన పడ్డారు. తగ్గుముఖం పట్టక పోవడంతో కుటుంబీకులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. న్యాయమూర్తి జయమ్మ డెంగీ జ్వరంతోనే చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్త్రత ప్రచారం జరిగింది.

ఇదీ తాజా సంఘటన..

జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

తరుణ వ్యాధుల సీజన్‌ ముగిసే సమయంలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జ్వరాల విజృంభిస్తున్నాయి. పూర్తిగా మైదాన ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా జనం జ్వరాలతో మంచమెక్కుతున్నారు. ఇంట్లో ఆరుగురు సభ్యులుంటే కనీసం ముగ్గురికి జ్వరం తప్పనిసరిగా వస్తోంది. కొందరికైతే ఓ విడత జ్వరం సోకి తగ్గిన తర్వాత కూడా మరికొద్ది రోజుల్లో రెండో విడత జ్వరం వస్తున్న సంఘటనలున్నాయి. ఖమ్మంలో ప్రధానాసుపత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బయటి రోగుల సంఖ్య నమోదవుతూనే ఉంది.

వర్షాలు, పండుగలు, సెలవుల ప్రభావం..

ఉభయ జిల్లాల్లో గతేడాదితో పోల్చితే వాతావరణ పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. రోజులో ఏదో ఒక సమయంలో తీవ్రమైన ఎండ ప్రభావం కన్పిస్తుంది. ఆ కొద్ది సేపటికే మబ్బులు పట్టి వర్షం కురుస్తోంది. ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవనే చెప్పాలి. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మం జిల్లాలోనూ అప్పటికప్పుడు మబ్బులు పట్టి చిరు జల్లులు కురుస్తుండటం సర్వసాధారణంగా మారింది. దీంతో పరిసరాలు చిత్తడిగా మారి అపరిశుభ్రం తాండవిస్తోంది. ఇటీవల 30 రోజుల ప్రణాళికలో వీధులను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసినప్పటికీ ఆ ఫలితం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. దీంతో కీటకాలు వృద్ధి చెందుతూ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదని వైద్యాధికారులు కూడా అంచనా వేస్తున్నారు.

మన్యాన్ని వీడని మహమ్మారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాకాలం సీజన్‌ ఆరంభం నుంచి జ్వరాల తీవ్రత నెలకొంది. ముఖ్యంగా భద్రాచలం మన్యం ప్రాంతంలోని మండలాల్లో విష జ్వరాలు అధికంగా వ్యాపిస్తున్నాయి. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌ మండలాల్లో జిల్లా కేంద్రానికి సమీప గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం లోపించి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. మల్లారంలో కొందరు గ్రామస్థులు జ్వరాల తీవ్రత తగ్గేంత వరకు బంధువుల ఇళ్లకు వెళ్తుండటం గమనార్హం. ఈ గ్రామంలో తరచూ ఎవరో ఒకరు జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో జ్వర పీడితుల కారణంగా స్థానిక ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఓపీ రెట్టింపు అవుతుండగా, పీడితుల్లో చిన్నారులూ ఉంటుండటం గమనార్హం.

రక్త ఫలకలతో పోరాటం.. జ్వర పీడితుల్లో రక్త ఫలకికల తగ్గుదల సర్వసాధారణంగా మారుతోంది. ఏదైనా జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత మనిషి బాగా నీరసించి రక్త ఫలకికలు తగ్గిపోవడం ఎక్కువ మందిలో కనిపిస్తున్న లక్షణంగా మారింది. దీంతో బాధితులు భయభ్రాంతులకు గురై అనివార్యంగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. జ్వరంతో వైద్యుడి దగ్గరికి వెళుతున్న సమయంలో కొందరు డాక్టర్లు అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్‌ మందులను రోగికి ఎక్కించడం కూడా సమస్యగా మారుతోంది. ఇంజెక్షన్లు ఇష్టానుసారంగా ఇవ్వడంతో జ్వరపీడితులు నీరసించి ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే యాంటీ బయాటిక్స్‌ను నేరుగా సూది ద్వారా ఎక్కించకుండా ఫ్లూయిడ్స్‌లో అంటే సెలైన్‌లో ఇవ్వడం వల్ల వాటి ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్లేట్‌లెట్స్‌ ఫోబియా జనానికి గుబులు పుట్టిస్తుండగా మరోవైపు రక్తనిధి కేంద్రాలు, ఆస్పత్రులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.

మరణాలే లేవట.. ఖమ్మం జిల్లాలో విష జ్వరాల కారణంగా ఇప్పటికి 91 మంది మృత్యువాత పడినట్లు సాధారణ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఏ ఒక్కరూ జ్వరంతో చనిపోలేదని వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో రాసుకుంది. జ్వరంతో మరణించిన వారందరికీ ఇతర కారణాలు చూపిస్తూ నివేదికలు తయారు చేసింది. డెంగీ మరణాలు వెలుగు చూసినపుడు వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక బృందం కుటుంబీకులను సంప్రదించి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు ఆ ప్రభావం మనిషి శరీరంలో ఏదో ఒక అవయవంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ అవయవం తట్టుకోగలిగితే మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేకుంటే ఆ అవయవం దెబ్బతిని మృత్యువు సంభవిస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం కేవలం సంబంధిత అవయవ లోపం కారణంగానే మరణం సంభవించిందని, జ్వరం వల్ల చనిపోలేదని కాకి లెక్కలు రాసి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఫలితంగా అధికారిక లెక్కల ప్రకారం ఈ వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క జ్వర మరణం కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

మొత్తం జ్వర బాధితులు: 24,654

టైఫాయిడ్‌: 9,987

మలేరియా : 463

డెంగీ: 5

అతిసారం: 4,689

* ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 196 మంది ఓపీ సేవలు పొందగా వారిలో 126 మంది జ్వరపీడితులే ఉన్నారు.

* జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం 97,583 మంది జ్వరంతో చికిత్స పొందినట్లు లెక్కల్లో తేల్చారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సంఖ్య రెండు లక్షలకు పైగా చికిత్స తీసుకున్నట్లు సమాచారం.

జనవరి నుంచి ఇప్పటి వరకు జ్వరాల జోరు..

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.