close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

పగలు కాపలా.. రాత్రిళ్లు చోరీలు

నిందితుల నుంచి బంగారు నగలు స్వాధీనం


స్వాధీనం చేసుకున్న నగలు, నిందితులతో మార్కాపురం డీఎస్పీ, సీఐ

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు సర్కిల్‌లో రెండు పోలీస్‌స్టేషన్లు, పామూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పలు బంగారు నగల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి గిద్దలూరు పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గత నెలలో గిద్దలూరు రాచర్ల గేటు ప్రాంతంలో గుర్తుతెలియన వ్యక్తులు ఒకే రోజు మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో గిద్దలూరు సీఐ యు.సుధాకరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం సాయంత్రం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామ సమీపంలోని భీమలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద గిద్దలూరు ఎస్‌ఐ సమందర్‌వలి వాహనాలను తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పోరిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం చిన్నయస్వామి చెంచుగూడెం గ్రామానికి చెందిన సవరం శివయ్య, అదే గ్రామానికి చెందిన ఇండ్ల సుబ్బరాయుడు, గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామానికి చెందిన గుజ్జారి గురవయ్యగా గుర్తించారు. గత నెల గిద్దలూరు రాచర్ల రహదారిలోని అలసందలపల్లె బాలసుబ్బయ్య ఇంట్లో చోరీ చేయడంతోపాటు, గతంలో గిద్దలూరు పాతబద్వేలు రహదారిలోని రామాలయం గుడి, ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురు వీధి, కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో మద్యం దుకాణం ఎదురుగా, గిద్దలూరు సగిలేరు బ్రిడ్జి వద్ద, రాచర్ల మండలం రాచర్ల గ్రామంలోని పలు గృహాల్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. తాను పామూరులోని ఓ గృహంలో చోరీ చేసినట్లు శివయ్య పోలీసుల విచారణలో బయటపెట్టాడు. ఈ నిందితులు గత ఏడాది గిద్దలూరు మండలం ఎల్లుపల్లె గ్రామంలో రైతుల పొలాల వద్ద కాపలాదారులుగా ఉంటూ రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. సవరం శివయ్య 24 గ్రాముల బంగారు నగలు ఎత్తుకొని పారిపోగా మిగతా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, జైలుశిక్ష అనుభవించిన అనంతం విడుదల చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. బయటకు వచ్చిన తరువాత కూడా వీరి తీరు మారకపోగా యథాప్రకారం దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించారు. దీంతో వీరిని మరలా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 10 కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. బంగారు నగలను రికవరీ చేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ యు.సుధాకరరావు, ఎస్‌ఐలు సమందర్‌వలి, రవీంద్రారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.