close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

వన సంపదకు రక్షణ

త్వరలో ఏర్పాటు కానున్న అటవీ స్టేషన్లు

 ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

 బేస్‌ స్టేషన్లనే మార్చే యోచన

 సిబ్బందికి అధునాతన ఆయుధాలు


అటవీ స్టేషన్‌ కానున్న బేస్‌ స్టేషన్‌

ఏళ్లుగా తలనొప్పిగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్త పద్ధతిని తెర పైకి తీసుకొచ్చారు. పోలీస్‌ స్టేషన్ల తరహాలోనే అటవీ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వీటి ద్వారా సంబంధిత ప్రాంతంలోని అడవి పరిస్థితిని ఎప్పటికప్పుడూ తెలుసుకోవడంతోపాటు నిందితుల విచారణ, దుంగల నిల్వ తదితర సమాచారమంతా ఇక్కడి నుంచే జరుగనుంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అధునాతన ఆయుధాలు అందించేందుకు ప్రయత్నాలు సాగుతుండగా, పోలీస్‌ స్టేషన్ల తరహాలో సిబ్బంది నియామకం, ఆయుధాలు వాడటం వంటి కార్యకలాపాలు ఈ ఫారెస్టు స్టేషన్ల ద్వారా చేపట్టనున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, నంద్యాల నేరవిభాగం

జిల్లాలో ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా నల్లమల అటవీ పరిధిలో ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎర్ర చందనం సుమారు 212.19 చ.కి.మీ. విస్తరించి ఉంది. అహోబిలం బీట్‌ నుంచి చాగలమర్రి, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మీదుగా శేషాచలం అడవుల వరకు బాగా ఈ వృక్షాలు ఉన్నాయి. జిల్లాలో ప్రత్యేకించి ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నేల స్వభావంతో అహోబిలం, రుద్రవరం రేంజ్‌ పరిధిలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. చేతిలో ఆయుధాలు లేక, ఉన్నా అరకొర సిబ్బందితో ఎర్రచందనం అక్రమ రవాణాను సరిగ్గా అరికట్టలేని పరిస్థితి ఉంది. నామమాత్ర తనిఖీలతో కొద్దిగా పట్టుకోవడం తప్ప తరలిపోయే కలపను పూర్తిస్థాయిలో నిలువరించలేని దుస్ధితి నెలకొంది. ఈ చెట్లు నరికి, అక్రమంగా తరలించి రూ.కోట్లకు పడగలెత్తిన అక్రమార్కులకు కొదవలేదు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నంద్యాల, ఆత్మకూరు నల్లమల పరిధిలో నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇవేవీ అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నాయి. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని టాస్క్‌ఫోర్స్‌కు నియమించినా కొన్నిరోజులకే తీసేశారు.

*● జిల్లాలో ఎర్రచందనం అటవీ విస్తీర్ణం : 212.19 చ.కి.మీ.

*● 2007 నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన దుంగలు : 229.06 టన్నులు

●* అదుపులోకి తీసుకున్న నిందితులు : 612

*● సీజ్‌ చేసిన వాహనాలు : 68

కేరళకు ప్రత్యేక బృందం

జిల్లాలో ఎర్రచందనం చెట్ల నరికివేత, అక్రమ రవాణాదారుల(స్మగ్లర్ల) కదలికలు ఎక్కువైనట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఫారెస్టు స్టేషన్ల ఏర్పాటు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అడవుల్లో బేస్‌ క్యాంప్‌లు, క్షేత్రాలయాలు ఉన్నాయి. కానీ ఇవి కేవలం అలంకారప్రాయంగా ఉన్నాయి. వీటి ద్వారా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. సిబ్బంది ఉండటానికి, పట్టుకున్న దుంగలను నిల్వ చేయడానికి, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఉండటానికి అనువుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం బేస్‌ క్యాంప్‌లనే ఫారెస్ట్‌ స్టేషన్లుగా మార్చి ఉపయోగించనున్నారు. దీనికోసం అటవీ సిబ్బందిని కొంతమందిని ఎంపిక చేసి కేరళలో అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపుతున్నారు. నంద్యాల డివిజన్‌లోనే ఎక్కువ ఎర్రచందనం ఉండగా ఇక్కడ 12 బేస్‌ క్యాంప్‌లు నడుస్తున్నాయి. ఇందులో చలమలో రెండు, రుద్రవరంలో మూడు బేస్‌ క్యాంప్‌లు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలోనే కొత్తగా ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ స్టేషన్లలోనే శిక్షణ పొందిన సిబ్బందితోపాటు వారికి అధునాతన ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా ఎర్ర చందనం చెట్ల నరికివేతను అడ్డుకోవడంతోపాటు నరికిన దుంగలు అడవి దాటకుండా కట్టడి చేసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క స్టేషన్లు, మరోపక్క అధునాతన ఆయుధాలు సమకూరితే సిబ్బందికి అదనపు బలం చేకూరే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.