close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

తాగితే.. మా ఆయన మనిషి కాదు!

సంసారంలో మద్యం చిచ్చు

మహిళా ఠాణాలో 40 శాతం కేసులివే

న్యూస్‌టుడే, వికారాబాద్‌

* మా ఆయన రోజంతా బాగానే ఉంటాడు. సాయంత్రం కాగానే మద్యం తాగి అకారణంగా గొడవ పడతాడు. మద్యం మత్తులో పరుష పదజాలంతో దూషిస్తాడు. ఆ మాటలకు నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా పరిస్థితిలో మార్పు లేదు. గత్యంతరం లేక మహిళా పోలీస్‌ ఠాణాను ఆశ్రయించా.

- ఓ గృహిణి మనోవేదన.


* మావారు మద్యానికి బానిస. రోజు కూలీ పనికి వెళ్తే వచ్చిన డబ్బులను తాగుడుకే తగలేస్తాడు. దీంతో కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా తాగుడు మానుకోలేదు. పైగా మద్యం మత్తులో విచక్షణ మరచి నన్ను, పిల్లలను చితకబాదుతాడు. భరించలేక మహిళా ఠాణాలో ఫిర్యాదు చేశా.

- మరో బాధితురాలి ఆవేదన.

 

పండంటి కాపురాల్లో మద్యం చిచ్చు రేపుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతోంది. తమ వద్దకు వచ్చే కేసుల్లో తాగుడు కారణంగా దంపతుల సమస్యలు తలెత్తి విడిపోవాలని భావిస్తున్నవి 40 శాతంపైగా ఉంటున్నాయని మహిళా పోలీస్‌ ఠాణా సిబ్బంది చెబుతున్నారు. తగవులు తీర్చి కలిసుండేలా చేసేందుకు శతథా ప్రయత్నిస్తున్నామన్నారు. వికారాబాద్‌లోని ఈ ప్రత్యేక ఠాణాలో నమోదవుతున్న కేసుల తీరుపై కథనం.

సాధారణ సమయాల్లో తమ భర్తలు బాగానే చూసుకుంటారని.. మద్యం తాగితే అకారణంగా కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురి చేస్తారని చాలామంది మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అనారోగ్యం, ఆర్థికంగా చితికిపోవడంతో పాటు సంసారాల్లోనూ కల్లోలం రేగే పరిస్థితులను ఉదహరిస్తూ ఠాణా సిబ్బంది వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఒకటికి రెండుసార్లు వివరిస్తుండటంతో.. కలిసి ఉండటానికి కొందరు ఇష్టపడుతున్నారు. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదని.. గొడవ పడకుండా ఉండేలా చూడగలుగుతున్నా, మద్యం తాగే అలవాటు మాన్పించలేకపోతున్నామని పేర్కొంటున్నారు.

వేరుగా జీవించాలని..

ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక వేరుగా జీవించాలని చాలామంది మహిళలు భావిస్తున్నారు. ఇది కుదరని వేళ దంపతుల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయి. ఇలాంటివారూ తమ వద్దకు వస్తున్నారని మహిళా ఠాణా పోలీసులు చెబుతున్నారు. మొదట అడిగినప్పుడు భర్త సరిగా చూసుకోవడం లేదని.. లేదా ఇతర కారణాలు చెబుతున్నారు. ఆరా తీసేసరికి వేరు కాపురం ఆలోచన చెబుతున్నారు. అలా చేస్తే భర్తతో మంచిగా ఉండేందుకు అంగీకరిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తలెత్తే చిన్నచిన్న ఘటనలనూ పెద్దవిగా చూస్తుండటం సమస్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివారికి ఉమ్మడి కుటుంబాల్లో ఉండే అనురాగం, ఆప్యాయతలు, పెద్దల పట్ల చూపాల్సిన బాధ్యత గురించి వివరించి వారిని ఒప్పించేందుకు చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భార్యాభర్తలతో పాటు ఇంట్లో ఉండే కుటుంబసభ్యులకూ కౌన్సిలింగ్‌ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దల సహకారం ఎలా ముందుకు నడిపిస్తుందో వివరిస్తున్నారు.

అనుమాన భూతంతో..

జీవిత భాగస్వామిపై అనుమానంతో గొడవలు పెట్టుకుంటున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. భర్త లేదా భార్య ఇతరులతో మాట్లాడినా, ఉద్యోగరీత్యా ఎక్కువ సమయం కార్యాలయంలో ఉండాల్సి వచ్చినా.. దంపతుల మధ్య విభేదాలు వస్తున్న పరిస్థితి. ఈ కారణంగా మహిళా పోలీస్‌ ఠాణాకు వచ్చినవారిని కౌన్సిలింగ్‌ చేశాక.. తమవన్నీ లేనిపోని అనుమానాలు అని చాలామంది పేర్కొంటున్నారు. కలిసి జీవించడానికే దంపతులు మొగ్గు చూపుతున్నారు. ఇలాగే అనుమానాలు పెంచుకుంటే జీవితాలను గందరగోళంలోకి నెట్టుకున్నట్లే అని.. ఈ పరిస్థితి తెచ్చుకోవద్దని తిరిగి వారే సూచిస్తున్నారు.

కౌన్సిలింగ్‌ సత్ఫలితాన్నిస్తోంది

- నిర్మల, సీఐ, మహిళా పోలీస్‌ ఠాణా

వికారాబాద్‌ మహిళా పోలీస్‌ఠాణాలో ఇస్తున్న కౌన్సిలింగ్‌ ప్రక్రియ సత్ఫలితాన్నిస్తోంది. విడిపోతామని, గొడవలు పడి ఇక్కడికి వస్తున్నవారిలో వివరంగా మాట్లాడాక దాదాపు 95 శాతం మంది కలిసుండేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా తక్కువ శాతం మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.