close

ఆదివారం, నవంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఫలితం లేని.. ‘ప్రత్యామ్నాయం’!

ఆర్టీసీకి రూ.3 కోట్ల నష్టం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 18 రోజులుగా కొనసాగుతోంది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిత్యం వేలాది మందిని గమ్యాలకు చేర్చే బస్సులు సజావుగా కదలడంలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కొన్ని మార్గాల్లో విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ ప్రాంతాలను గుర్తించి బస్సులను నడిపించేందుకు అధికారులు కృషి చేయాలి. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లును నియమించినా అందినకాడికి వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలోని మూడు డిపోల పరిధిలో సుమారు రూ.3 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

జిల్లాలో వికారాబాద్‌, పరిగి, తాండూరు పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మొత్తం 251 బస్సు సర్వీసులు ప్రజలను గమ్యస్థానానికి చేర్చేవి. సాధారణ రోజుల్లో రోజుకు సరాసరిన సుమారు రూ.24 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం తాత్కాలిక సిబ్బందితో సుమారుగా 198 బస్సులను నడిపిస్తున్నప్పటికీ ఆదాయం రూ.6 లక్షలకు చేరుకోవడంలేదు. తాండూరు డిపోలో 94 బస్సులు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు రూ.8 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 73 బస్సులను నడిపిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు మించి రావడం లేదంటున్నారు. పరిగి డిపో నుంచి నిత్యం 79 బస్సులు ప్రయాణాలు సాగించేవి. రోజుకు రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం 62 బస్సు సర్వీసులను నడిపిస్తున్నా, రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదాయం ఉంటోంది. ఇక వికారాబాద్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. 78 బస్సులకు 68 నడిపిస్తున్నారు. సాధారణ రోజుల్లో సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం ఉండేది. ప్రస్తుతం రూ.2 లక్షలుల మాత్రమే వస్తోంది. 75 శాతం బస్సులను నడిపిస్తున్నప్పటికీ ఆదాయం రూ.24 లక్షల నుంచి రూ.6 లక్షలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

తాత్కాలిక సిబ్బంది చేతివాటం

తాత్కాలిక విధులకు హాజరువుతున్న డ్రైవర్లు, కండక్టర్లు తాము వసూలు చేసిన ఛార్జీలను మొత్తం అప్పగించకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.టిమ్స్‌ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అక్రమ వసూళ్లను అరికట్టలేకపోతున్నామని ఆర్టీసీకి చెందిన ఓ అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. డిపో నుంచి బస్సు తీసుకుని వెళుతున్నారు. ఎక్కడ ఉంటున్నారో? ఎటు తిప్పుతున్నారో తెలియడం లేదు. వారిని పర్యవేక్షించే నిఘా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆలస్యమైందని అడిగితే బస్సులు ఆపుతున్నారని చెబుతున్నారు. ఆర్టీసీ శాశ్వత కార్మికులకు సరాసరిన నెలకు రూ.22 వేల నుంచి 30 వేల వేతనం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక విధులకు హాజరవుతున్న డ్రైవర్‌కు రోజుకు రూ.1,500 ఇస్తున్నారు. కండక్టర్‌కు రూ.వెయ్యి చెల్లిస్తున్నారు.

ఫిర్యాదులు తగ్గాయి: రమేష్‌, ఆర్టీసీ డీవీఎం

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తాత్కాలిక సిబ్బందితో మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. ప్రస్తుతం సుమారు 75 నుంచి 80 శాతం సర్వీసులు నడిపిస్తున్నాం. ఒక్కో డిపో పరిధిలో రోజుకు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది. గతంలో ఈ మొత్తం రూ.8 లక్షల వరకు ఉండేది. ఇటీవల టిమ్స్‌ ఇచ్చాక తాత్కాలిక సిబ్బంది పై ఫిర్యాదులు తగ్గాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.