close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

కాసులిస్తే ఫ్లాట్‌..కావాల్సినట్లు ప్లాట్‌!  

● సాగు భూముల్లో అక్రమ లేఅవుట్లు

● నాయకుల అండతో ఇష్టారాజ్యం●

● కాసుల కక్కుర్తితో కన్నెత్తి చూడనితీరు

రొద్దం పంచాయతీ పరిధిలో చెరుకూరు రోడ్డు పక్కన ఓ ప్రైవేటు సంస్థ వేసిన అక్రమ లేఅవుట్‌ ఇది. దాదాపు 5 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చలేదు. దీనికితోడు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవు. అయినా ప్రైవేటు కంపెనీవారు యథేచ్ఛగా ప్లాట్లను విక్రయిస్తున్నారు.

న్యూస్‌టుడే, పెనుకొండ, రొద్దం : జాగా కన్పిస్తే చాలు.. పాగా వేసేయడమే. ఆకర్షణీయ ప్రచారాలతో అదరగొట్టడం.. ఎంచక్కా ప్లాట్లు వేసి అంటగట్టడం.. అనుమతులు, నిబంధనలు పట్టక పోవడం.. రాజకీయుల ఆశీస్సులతో దూసుకెళ్లడం.. కఠినంగా వ్యవహరించాల్సిన వారు కాసులకు దాసోహమై ఆ దిక్కు చూడకపోవడం.. రెవెన్యూ, పంచాయతీ శాఖల ఆదాయానికి గండి కొట్టడం... పరిపాటిగా మారింది. పల్లెల్లో నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ లే అవుట్లు అడ్డగోలుగా వెలుస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. ప్రధానంగా అహుడా సమీప పంచాయతీల్లో ఈ జోరు ఎక్కువైంది. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని ముందు వెనకా చూసుకోకుండా కొనుగోలు చేస్తూ ప్రజలు సైతం లబోదిబోమంటున్న వైనమిది.

నిబంధనలు ఇలా..

పంచాయతీల్లో వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేయాలంటే మొదట సంబంధిత భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మార్కెట్‌ విలువ

ప్రకారం ఎకరాకు 3 శాతం చొప్పున రెవెన్యూ శాఖకు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రెవెన్యూ అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తారు.

ఆ తర్వాత లేఅవుట్‌ వేయడానికి పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. చదరపు మీటర్‌కు మైనర్‌ పంచాయతీల్లో రూ.4, మేజర్‌ పంచాయతీలు, మండల కేంద్రంగా ఉన్న మైనర్‌ పంచాయతీల్లో రూ.8 చొప్పున చెల్లించి లేఅవుట్‌ వేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.

గ్రామ పంచాయతీ అధికారులు జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు నివేదికలు పంపుతారు. సంబంధిత అధికారులు వచ్చి ప్రధాన రోడ్డు 40 అడుగులు, అంతర్గత రోడ్డు 33 అడుగుల చొప్పున ఉండేలా పరిశీలించి సాంకేతిక అనుమతులు ఇస్తారు.

ఆపై ఎకరాకు పంచాయతీకి పది శాతం చొప్పున భూమి రిజిస్ట్రేషన్‌ చేయించి లేఅవుట్‌ను పూర్తి చేసి ప్లాట్ల విక్రయాలు చేసుకొనే వీలుంది.

నాయకుల ఒత్తిళ్లు..అధికారుల నిర్లక్ష్యం

రొద్దం పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు సంస్థ వారు, స్థిరాస్తి వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్ల విక్రయాలు చేస్తున్నారు. మండలం కేంద్రం నుంచి కిలోమీటర్‌ దూరంలో చెరుకూరు రోడ్డు పక్కన దాదాపు 5 ఎకరాల్లో, పెద్దకోడిపల్లి సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఏడు ఎకరాలకుపైగా వ్యవసాయ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేశారు.

స్థిరాస్తి వ్యాపారులు రొద్దంలో, పెన్నానది ఒడ్డున పలుచోట్ల అక్రమంగా లేఅవుట్లను వేసి ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఈ తంతు జరుగుతున్నా స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. ఇందుకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, కింది స్థాయి ఉద్యోగుల ఆమ్యామ్యాల తీరుతో చర్యలు లేవనే విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌, బెంగళూరు నుంచి పలువురు రియల్టర్లు రంగంలోకి దిగి.. ఓ ప్రణాళిక ప్రకారం ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. రొద్దం మండలంలోని చేళేమర్రిలో ఒకటి, మండల కేంద్రమైన రొద్దంలో నాలుగు అక్రమ లే అవుట్లు ఉన్నాయి. అలాగే పెనుకొండ మండలంలో 15, గోరంట్ల మండలంలో 15, సోమందేపల్లి మండలంలో 4 వరకు అక్రమ లే అవుట్లు ఉన్నాయి. ఈ మూడు అహుడా పరిధిలోవి అయినా పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం.

కఠిన చర్యలు తీసుకుంటాం - విజయకుమార్‌, డీఎల్‌పీవో

అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమ లేఅవుట్లపై రొద్దం మండలంలోని ఈవోఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిలో రాళ్లను తొలగింపజేస్తాం. పంచాయతీలకు ఎకరాకు పది శాతం చొప్పున భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించి, సంబంధిత రుసుమును చెల్లించాకే లే అవుట్లు వేయడానికి అనుమతులు ఇస్తాం. అనుమతులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

రొద్దం పంచాయతీ పరిధిలోని పెద్దకోడిపల్లి సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఓ ప్రైవేటు సంస్థ అక్రమంగా వేసిన లే అవుట్‌ ఇది. నలుగురు వ్యక్తులు కలిసి తొమ్మిది ఎకరాలు కొన్నారు. దీనిని వ్యవసాయేతర భూమిగా మార్చలేదు. అధికారులకు దరఖాస్తు మాత్రమే చేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయినా ఏడు ఎకరాలకుపైగా అక్రమంగా లేఅవుట్‌ వేసి సగానికిపైగా ప్లాట్లను విక్రయించారు. సెంటు రూ.50 వేల నుంచి రూ.80 వేల చొప్పున విక్రయాలు జరిగాయి. నిత్యం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆ రహదారిలో వెళ్తున్నా అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోలేదు.

రొద్దం సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన పెన్నానది ఒడ్డున వేసిన అక్రమ లేఅవుట్‌ ఇది. 7.34 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చారు. లే అవుట్‌ వేయడానికి పంచాయతీకి దరఖాస్తు చేసినా.. జిల్లా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీకి పది శాతం భూమిని రిజిస్టర్‌ చేయలేదు. నిబంధనలు తుంగలో తొక్కి ప్లాట్లను వేసి సెంటు రూ.60 వేల నుంచి రూ.80వేల చొప్పున విక్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.