close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

ప్రైవేటు.. లేకనే!

● జిల్లాలో ట్రావెల్స్‌ నిర్వాహకుల దందా

● అనుమతులు, నిబంధనలు బేఖాతరు

రవాణాశాఖ అధికారులు జప్తు చేసిన బస్సులు

అడిగేదెవరప్పా

●ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ మూడు బస్సులకు అనంతపురం నుంచి బెళుగుప్ప మీదుగా రాయదుర్గం వరకు పర్మిట్లు ఉండగా అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం వరకు నడుపుతున్నారు. .

రాయదుర్గం నుంచి బళ్లారికి కొన్ని బస్సులను నాన్‌స్టాప్‌ సర్వీసులుగా నడుపుతున్నారు.

అనంతపురం నుంచి రాయదుర్గానికి, రాయదుర్గం నుంచి బళ్లారికి పలు బస్సులు ఓవర్‌ లోడ్‌తో సాగి ప్రమాదాలకు గురవుతున్నాయి.

రాయదుర్గం నుంచి బెంగళూరు వెళ్లే ప్రైవేటు బస్సులు వాణిజ్య పన్నులను చెల్లించకుండా యథేచ్ఛగా లగేజీతో వెళుతున్నాయి.

న్యూస్‌టుడే, అనంతపురం (అరవిందనగర్‌), రాయదుర్గం : జిల్లాలో కొందరు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతర్‌రాష్ట్ర పర్మిట్‌ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన స్టేజి క్యారేజి బస్సులను నడుపుతున్నారు. అధికారులు నిర్దేశించిన మార్గంలో కాదని తమకు లాభాలొచ్చే నగరాలకు తిప్పుతున్నారు. బస్సుకు ఐదేళ్లకోసారి అనుమతి (పర్మిట్‌), ఏడాదికోసారి వాహన సామర్థ్య ధ్రువీకరణ (ఎఫ్‌సీ) చేయించాలన్న నిబంధనను ఖాతరు చేయడం లేదు. బస్సులో సీట్ల కెపాసిటీకి మించి అదనంగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు.

ప్రయాణికులతో చెలగాటం

ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ఆ నిబంధనలను కొందరు బస్సు 

యజమానులు లెక్కచేయడం లేదు. ఐదేళ్లకోసారి ఇచ్చే అనుమతి పత్రాన్ని గడువులోపు నవీకరణ చేసుకోకుండా తిప్పుతున్నారు. నిర్దేశించిన సీట్ల కంటే 5 నుంచి 10 సీట్లను అదనంగా అమర్చి ఓవర్‌లోడుతో నడుపుతున్నారు. మరోవైపు మితిమీరిన వేగంతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.జిల్లా వ్యాప్తంగా 196 బస్సులను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇంటర్‌ స్టేట్‌ పర్మిట్‌తో నడుపుతున్నారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి

నిర్దేశించిన మార్గంలో కాదని తమకు లాభాలొస్తున్న మార్గంలో బస్సులు తిప్పుతున్నారు. ఉదాహరణకు అనంతపురం నుంచి బళ్లారికి వయా బెళుగుప్ప మార్గంలో పర్మిట్‌ తీసుకుని.. కణేకల్లు మీదుగా నడుపుతున్నారు. బస్సుకు ఇరువైపులా యజమాని పేరు, పర్మిట్‌ గడువు, ఎఫ్‌సీ, చోదక అనుమతి తదితర వివరాలు ముద్రించాలి. కానీ అవేవీ కనపడటం లేదు. మరే జిల్లాలోనూ ఇంతపెద్ద సంఖ్యలో స్టేజి క్యారేజి బస్సు సర్వీసులు లేవు. అయినా పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా పోయిందని ప్రయాణికులు రవాణా శాఖ కమిషనరుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలందుకున్న జిల్లా అధికారులు ఒక్క రోజులోనే 10 బస్సులను జప్తు చేశారు.

నిబంధనలు ఇలా...

ఇంటర్‌ స్టేట్‌ స్టేజి క్యారేజి బస్సుకు ఐదేళ్లకొకసారి పర్మిట్‌ (అనుమతి) కోసం రూ.2 వేల రుసుం చెల్లించాలి. వాహన సామర్థ్య ధ్రువీకరణ పత్రాన్ని కొత్త వాహనానికి రెండేళ్ల కాలానికి ఒకసారి, ఆ తర్వాత ఏడాదికోసారి ఇస్తారు. ప్రతి ఏడాదికి రూ.960 ప్రకారం రుసుం చెల్లించాలి. బస్సులో సీట్ల సంఖ్య ఆధారంగా ఒక సీటుకు మూడు నెలలకు ఒకసారి రూ.1,800 చెల్లించాల్సి ఉంది. తనిఖీ అధికారులు అడిగినప్పుడు అన్ని పత్రాలు చూపించేలా అందుబాటులో ఉంచాలి.

ఆకస్మిక తనిఖీలో దొరికితే..

పర్మిట్‌ లేదంటే రూ.5 వేలు, వాహన సామర్థ్య ధ్రువపత్రానికి రూ.5 వేలు, బస్సు చోదకుడికి చోదక అనుమతి లేకుంటే రూ.5 వేలు అపరాధ రుసుం కట్టాలి. బస్సులో నిర్దేశిత సీట్లకంటే అదనంగా ఉంటే.. ఒక సీటుకు రూ.1,800 ప్రకారం అపరాధ రుసుముతోపాటు అదనంగా రూ.5 వేలు చెల్లించాలి. ఉదాహరణకు అదనంగా 10 సీట్లు అమర్చితే రూ.18 వేలు, మరో రూ.5 వేలు కలిపి రూ.23 వేలు చెల్లించాల్సి ఉంటుంది. బస్సుకు అనుమతించిన మార్గంలో కాకుండా మరో దారిలో నడిపినట్లు తేలితే పర్మిట్‌ను నెలరోజులు రద్దు చేస్తారు.

కఠిన చర్యలు తప్పవు: శివరామ ప్రసాద్‌, డీటీసీ

జిల్లాలో తిరుగుతున్న ఇంటర్‌ స్టేట్‌ స్టేజి క్యారేజి బస్సుల నిర్వాహకులు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి, పన్ను ఎగవేత నివారించడానికి ఇకపై రోజూ 15 బస్సులు తనిఖీ చేయాలనేది లక్ష్యం. అందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. నిబంధనలు ఖాతరు చేయని నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.