close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

కుండపోత

 జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన

 అమలాపురంలో 6.42 సెం.మీ

 జిల్లాకు 72 గంటల పాటు భారీ వర్షసూచన

 ఎనిమిది చోట్ల కంట్రోల్‌ రూముల ఏర్పాటు


రాయవరం మండలం వి.సావరంలో వర్షాలకు నేలనంటిన వరి దుబ్బులను కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లాను వానలు ముంచెత్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా కురవడంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలోని డెల్టా, మెట్ట, మన్యంలో రోజంతా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమలాపురం మండలంలో అత్యధికంగా 6.42 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో 72 గంటలు జిల్లాకు భారీ వర్ష సూచన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కలెక్టరేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అప్రమత్తత..

జిల్లాలోని 13 తీర మండలాలతో పాటు అనుబంధంగా ఉన్న మరో 13 మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత తహసీల్దారు, ఎంపీడీవోలను ఆదేశించారు. మొత్తం జిల్లాలోని 64 మండలాలకు చెందిన తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు మూడు రోజుల పాటు కార్యస్థానంలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాలు నమోదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చాలని ఆదేశించారు. కలెక్టరేట్‌తో పాటు అమలాపురం, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రంపచోడవరం, ఎటపాక ఆర్డీవో, సబ్‌ కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరు 180042 53077తో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. ఎనిమిది కంట్రోల్‌ రూముల్లో 24 గంటలూ పనిచేసేలా సిబ్బందికి విధులు కేటాయించారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాకినాడలోని 17 పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో చాలాచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దశలవారీగా సరఫరాను పునరుద్ధరించారు. పల్లెల్లో ఎక్కువగా విద్యుత్తు అంతరాయాలు ఏర్పడ్డాయి. మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో ఎటువంటి నష్టాలు నమోదు కాలేదని కలెక్టరేట్‌ డీ-సెక్షన్‌ అధికారులు తెలిపారు.

ఆలస్యంగా వేసిన నాట్లకు ఇబ్బందే..

జిల్లాలో ఆగస్టులో వేసిన వరినాట్లు ఇప్పుడు పొట్ట దశకు వచ్చాయి. దీంతో తూర్పు డెల్టాలోని కొన్ని, మెట్ట ప్రాంతాల్లో పంటకు ఈ వర్షాలు నష్టం చేకూరుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జులైలో వేసిన నాట్లకు సంబంధించి పంట గింజ దశకు చేరిందని, వీటికి ఇబ్బంది లేదని చెబుతున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి పెద్దగా నష్టం ఉండదని, వర్షం కొనసాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు. పంట మడుల్లో నీరు నిల్వ లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ముంచెత్తిన వాన

జిల్లాలో మంగళవారం కురిసిన వర్షాలకు 34 మండలాల్లో 2 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. అమలాపురం మండలంలో 6.42 సెం.మీ అత్యధికంగా కురవగా, ఏలేశ్వరం 4.86 సెం.మీ, కాకినాడ అర్బన్‌ 4.70 సెం.మీ, కపిలేశ్వరపురం 4.42 సెం.మీ, కె.గంగవరం 4.32 సెం.మీ, కాట్రేనికోన 4.06 సెం.మీ, కాకినాడ గ్రామీణం 3.82 సెం.మీ, మండపేట 3.65 సెం.మీ, యు.కొత్తపల్లి 3.64 సెం.మీ, పెదపూడి 3.54 సెం.మీ, రౌతులపూడి 3.42 సెం.మీ, తొండంగి 3.42 సెం.మీ, రామచంద్రపురం 3.26 సెం.మీ, పిఠాపురం మండలంలో 3.22 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉప్పలగుప్తం, సామర్లకోట, శంఖవరం, పెద్దాపురం, ఐ.పోలవరం, కోటనందూరు, మామిడికుదురు, కరప, తాళ్లరేవు, అనపర్తి, అయినవిల్లి, రావులపాలెం, రాజానగరం, గొల్లప్రోలు, రాయవరం, రంగంపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి మండలాల్లో 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.