close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

ఉత్తమ నారే... ఉపాధి మార్గమైంది

కూరగాయల నారుకు చిరునామా గన్నారం

ఐదేళ్లుగా రాణిస్తున్న ఖాదర్‌ బాషా

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

నారును పరిశీలిస్తున్న రైతు ఖాదర్‌ బాషా

చదువు రావడం లేదని, వ్యాపారంలో నష్టాలని, ఉద్యోగంలో ఇబ్బందులని, వ్యవసాయం కలిసి రావడం లేదనే కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ తమపై ఆధారపడిన కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు. ఆస్తిపాస్తులు, బంధువుల అండదండలు లేకపోయినా, పరిచయం లేని ప్రాంతానికి వచ్చి నీతి, నిజాయితీలనే పెట్టుబడిగా పెట్టి, కుటుంబ సభ్యులనే కూలీలుగా మార్చి నాణ్యమైన నారు పెంపకాన్ని ఉపాధి మార్గంగా మార్చుకున్నారు కూరగాయల నర్సరీ నిర్వాహకుడు రెడ్డి ఖాదర్‌ బాషా. లక్ష నారు మొక్కలతో ప్రారంభమైన నర్సరీ ప్రస్తుతం ఐదు లక్షల స్థాయికి చేరుకొంది. తక్కువ కాలంలోనే నాణ్యమైన కూరగాయల నారు చిరునామాగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రెడ్డి ఖాదర్‌ బాషాది పేద కుటుంబం. ఉపాధి వెతుక్కుంటూ ఐదేళ్ల క్రితం ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి వచ్చారు. నర్సరీలో పనిచేసిన అనుభవంతో రూ.5 లక్షలు అప్పు చేసి వ్యవసాయ భూమి లీజుకు తీసుకొని లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కుటుంబ సభ్యుల సహకారంతో దీన్ని నిర్వహించారు. టమాట, క్యాబేజీ, వంగ, మిరప, బంతి, క్యాప్సికం, క్యాలీఫ్లవర్‌, చెండుమల్లి తదితర నార్లు పెంచుతున్నారు. కర్షకులు తమకు నచ్చిన విత్తనం తీసుకొచ్చి ఇచ్చినా నారు పెంచి ఇస్తూంటారు. రకాల ఆధారంగా ఒక్కో మొక్కను 60 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తారు. నర్సరీ నారుపై రైతులకు అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో నష్టాలు వచ్చినా రెండో ఏడాది నుంచి పుంజుకొంది. ప్రస్తుతం నర్సరీని ఐదు లక్షల మొక్కల సామర్థ్యానికి విస్తరించారు. నాణ్యతకు పెద్దపీట వేయడంతో గిరాకీ పెరిగింది.

ట్రేలల్లో విత్తనం వెసేతున్న కూలీలు

ఉపయోగాలెన్నో..

సాధారణంగా రైతులు కూరగాయల నారును సొంతంగా పొలంలోనే పెంచి నాటుకుంటారు. ఈ విధంగా చేస్తే నారుకు పోషకాలు సరిగా అందకపోవడంతో పాటు, వేర్లు తెగిపోయే అవకాశముంది. ఎదుగుదల, దిగుబడులపై ప్రభావం పడుతోంది. నర్సరీలో పెంచడంతో ఈ నష్టాలు తగ్గించవచ్ఛు

* నారు పెంచేందుకు ప్లాస్టిక్‌ ట్రేలను ఉపయోగిస్తారు.

* అందులో బాగా మాగిన కొబ్బరి పీచు, వర్మీ కంపోస్టు ఎరువులను కలిపి ట్రేలలో నింపడంతో విత్తనం నాటడం, నిర్వహణ సులువుగా ఉంటుంది. తీసే సమయంలోనూ లేత మొలకలకు, వేర్లకు నష్టం కలగకుండా ఉంటుంది.

* ఎండ, గాలి, చలి నుంచి మొక్కలకు రక్షణ ఏర్పాట్లు చేయడంతో ఒకే పరిమాణంలో బలంగా ఎదుగుతున్నాయి.

* ఈ మొక్కలను పొలంలో నాటితే వెంటనే అంటుకొంటుంది.

పది మందికి ఉపాధి

ఉపాధి కోసం ఇంత దూరం వచ్చిన బాషా ప్రస్తుతం మరో పది మందికి ఉపాధి చూపుతున్నారు. గాంధారి, ధర్పల్లి, సిరికొండ, భీంగల్‌, సదాశివనగర్‌, కామారెడ్డి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు నారు కోసం ఇక్కడికి వస్తుంటారు.

ఏడాది పొడవునా కూరగాయల సాగు

నేను ఏడాది మొత్తం కూరగాయలు సాగు చేస్తాను. గతంలో నారు పోసుకొని సాగు చేసేవాళ్లం. ఇప్పుడు గన్నారంలో నాణ్యమైన నారు దొరుకుతుండటంతో అక్కడ నుంచే తీసుకుంటున్నాం. ఏటా రూ.10 వేలకు పైగా నారు కొనుగోలు చేస్తున్నాం.

- శ్రీనివాస్‌రెడ్డి

నాణ్యతకే మొదటి ప్రాధాన్యతా

నేను వ్యవసాయ కుటుంబం నుంచి రావడంతో అందులోని కష్టనష్టాలు బాగా తెలుసు. అందుకే లాభాలకు కాకుండా నాణ్యతకే నా మొదటి ప్రాధాన్యతనిస్తాను. ప్రస్తుతం నాతో పాటు మరో పదిమందికి ఉపాధి చూపడం సంతృప్తికరంగా ఉంది.

- ఎస్‌.రెడ్డి ఖాదర్‌ బాషా, నర్సరీ నిర్వాహకుడు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.