close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

ఖైదీల చేతుల్లో సిబ్బంది ‘ఖైదు’

జైళ్లలో భద్రతా సిబ్బందిపై దాడులు
బెంబేలెత్తుతున్న జైలు వార్డర్లు
చంచల్‌గూడ, న్యూస్‌టుడే

జైళ్లలో భద్రతా సిబ్బందిపై ఖైదీల దాడుల ఘటనలు పెరుగుతున్నాయి. నగరంలోని చర్లపల్లి, చంచల్‌గూడ కేంద్ర కారాగారాల్లో భద్రతా సిబ్బందిపై దాడులు కొత్తకాదు. ప్రస్తుతం తాజాగా చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో హై సెక్యూరిటీ బ్యారక్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్‌ వార్డర్‌ సత్యనారాయణపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీ దాడికి దిగడంతో కుడి కంటికి గాయాలయ్యాయి. జైలుకు వచ్చే కరుడు కట్టిన ఖైదీలతో రోజు వారి పనుల్లో అటు అధికారులకు ఇటు వార్డర్లకు బెదిరింపులు, దాడులు తరచూ తప్పని స్థితి. ఖైదీలను న్యాయస్థానాలకు, ఆసుపత్రులకు, ములాఖతులకు తరలించే సమయంలో వారివెంట ఉండే వార్డర్లకు చాలాసార్లు బెదిరింపులు, దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నా వాటిని వెల్లడించడం జైలు సిబ్బందికి సాధ్యం కాదు. జైలు బయట భద్రతా ఏర్పాట్లలో ఉండే పోలీసుల చేతుల్లో ఆయుధాలున్నా, జైలు లోపల భద్రతా సిబ్బందికి లాఠీలు తప్ప ఆయుధాలు ఉండవు. దీంతో కరుడు కట్టిన ఖైదీలు తరచు భద్రతా సిబ్బందిపై తిరగబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రధానంగా నిషేధిత వస్తువుల తనిఖీల్లో ఖైదీలు భద్రతా సిబ్బందిపై గుర్రుగా ఉంటుంటారు.

ఉగ్రవాదులు, విదేశీ ఖైదీల దాడులు..
2011లో చర్లపల్లి జైల్లో ఉగ్రవాదులు అక్కడి భద్రతా సిబ్బంది, అధికారులపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ దాడిలో తల పగిలి తీవ్ర గాయాలతో బతికి బయట పడ్డ జైలరు హనుమాన్‌ ప్రసాద్‌ ఇప్పటికీ తేరుకోక తరచు వైద్యుల పరిశీలనకు వెళుతుండడం గమనార్హం. ఈ దాడిలో ఉగ్రవాదులు క్రికెట్‌ వికెట్లు, ఇనుప రాడ్లతో తనిఖీలకు వచ్చిన అధికారులపై దాడికి చేశారు. 2014లో చర్లపల్లి జైల్లో నైజీరియాకు చెందిన విదేశి ఖైదీ డిప్యూటీ జైలరు ప్రకాష్‌పై దాడికి దిగడంతో అధికారి చేయి విరిగింది. 2017లో చంచల్‌గూడ జైల్లోనూ ఆఫ్రికాకు చెందిన ఖైదీలు భద్రతా సిబ్బందిపై దాడులకు దిగిన సంఘటనలున్నాయి. 2018లో ఇదే జైల్లో ములాఖతు వస్తువులను పరిశీలిస్తున్న వార్డర్‌ సంపత్‌పై, జైలు అధికారిపై ఉగ్రవాదులు దాడులకు దిగి గాయపరిచారు. గతంలో పలుమార్లు ఖైదీల వద్ద ఉండే వస్తువులను పరిశీలించేందుకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ఖైదీలు దాడులు జరిగాయి.

సిబ్బంది లేక ఇబ్బంది..
జైళ్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. చంచల్‌గూడలోని పురుషుల జైల్లో 1200కుపైగా ఖైదీలున్నారు. జైల్లో 175 మంది వార్డర్లకుగాను 20 పోస్టులు ఖాళీగా ఉండగా.. వారిలోనూ సగం మంది ఉన్నత కార్యాలయంలో, అధికారుల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.కేవలం 80మంది వార్డర్లు మాత్రమే రోజు వారి విధుల్లో ఉంటున్నారు. 800మంది ఖైదీలుంటున్న గోదావరి బ్యారక్‌ వద్ద భద్రతకు ఇద్దరు, ముగ్గురు భద్రతా సిబ్బంది ఉంటున్నారు. హై సెక్యూరిటీ బ్యారక్‌ల వద్దా ఇదే స్థితి నెలకొంది. 12 బ్యారక్‌లున్న అతి పెద్ద విచారణ ఖైదీల జైల్లోభద్రతకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల నిర్వహించిన పోలీసు అధికారుల పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వార్డర్లు సెలవుల్లో వెళ్లలేని స్థితి ఏర్పడింది.

మహిళా జైల్లో ఇద్దరే వార్డర్లు..
రాష్ట్రంలో చంచల్‌గూడ మహిళా ప్రత్యేక జైలు ఒక్కటే ఉంది. రాష్ట్రంలోని మహిళా ఖైదీలంతా ఈ జైలుకు రావాల్సిందే. విదేశీ మహిళా ఖైదీలు, అనిశా అరెస్టు చేసిన వారు, సీబీఐ కేసుల్లో అరెస్టయిన విచారణ ఖైదీలైనా ఇక్కడి లాకప్‌లో ఉండాల్సిందే. అయితే ఇంత ప్రాధాన్యమున్న మహిళా జైలును సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. రెండు వందలకు పైగా ఉంటున్న మహిళా ఖైదీల భద్రతకు ఇతర నిఘా కోసం చాలినంత మంది సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. మూడు నాలుగేళ్లుగా ఇద్దరు లేదా ముగ్గురు మహిళా వార్డర్లతో జైలు పర్యవేక్షణను నెట్టుకొస్తున్నారు. 14మంది వార్డర్లు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు వార్డర్లు విధుల్లో ఉంటున్నారు. నలుగురు హెడ్‌ వార్డర్లు ఉండాల్సిన చోట ఒక్కరే హెడ్‌ వార్డర్‌ విధుల్లో ఉంటున్నారు. ఆమె సైతం ప్రస్తుతం టీఓటీ శిక్షణలో ఉంది. అధికారుల సంగతి సరే సరి. చాలాకాలం వరకు జైల్లో జైలరు లేకపోవడం గమనార్హం. ఇటీవల పదోన్నతిపై ఇక్కడి జైలరు వరంగల్‌ జైలుకు బదిలీ కావడంతో చంచల్‌గూడ మహిళా జైలుకు ఇన్‌ఛార్జి పర్యవేక్షణాధికారిగా వరంగల్‌ జైలుకు చెందిన వెంకటలక్ష్మిని నియమించారు. మహిళా జైలరుగా ఉన్న జ్యోతిని చర్లపల్లిలో ఉన్న ఆనందాశ్రమంలో విధులు నిర్వహించేందుకు ఉంచడం గమనార్హం.

చంచల్‌గూడ జైల్లో హెడ్‌ వార్డర్‌పై ఖైదీ దాడి
చంచల్‌గూడ, న్యూస్‌టుడే: చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న హెడ్‌వార్డర్‌పై ఖైదీ దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనపై జైలు అధికారులు డబీర్‌పురా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఖైదీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఖైదీ కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడే విషయంలో హెడ్‌ వార్డర్‌ సత్యనారాయణకు, ఖైదీ గోలి రాజేష్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఖైదీ వద్ద ఫోన్‌ మాట్లాడేందుకు తగిన టోకెన్లు లేకపోవడంతో హెడ్‌వార్డర్‌ వారించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన ఖైదీ రాజేష్‌ హెడ్‌వార్డర్‌పై దాడి చేయడంతో ఆయన కుడికంటిపై గాయాలయ్యాయి. చోరీకేసులో మూడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న గోలి రాజేష్‌ను వరంగల్‌ జైలు నుంచి 9 నెలల క్రితం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడ అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో వల్లే ఇక్కడికి బదిలీ చేశారు. అయితే ఇక్కడ సైతం అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. సంఘటన తరువాత కూడా ఖైదీని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించినట్లు డబీర్‌పురా ఎస్సై శేఖర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.