close

మంగళవారం, నవంబర్ 12, 2019

ప్రధానాంశాలు

పుడమితో జత పరిశోధనలో విజేత 

వ్యవసాయ శాస్త్రవేత్త ఘనత
పురస్కారాల్లో ఆయనే సాటి

ఉపరాష్ట్రపతి నుంచి రైతునేస్తం అవార్డు అందుకుంటూ

న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం : ఆయనో భూమి పుత్రుడు..చిన్నప్పట్నుంచి పంటల సాగులో తండ్రి కష్టాన్ని చూసిన వాడు..కరవు జిల్లాలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనుకున్నాడు.. ఆ పట్టుదలతోనే కష్టపడి చదివి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించాడు. అది మొదలు గత 18 ఏళ్లుగా పంటల దిగుబడి పెంచడానికి, మెట్ట పంటల్లో మేలైన రాబడులకు, పంటలపై తెగుళ్ల నివారణకు తన పరిశోధనలతో నిర్విరామ కృషి చేస్తూ కర్షకులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు..ఈ కృషికి ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు పొందాడు...ఇవన్నీ రైతులవేనని, తనకు మరింత పరిశోధనలకు ప్రోత్సాహాన్నిచ్చేవని అంటాడు..
ఆయనే..రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో భూసార పరిశోధనా శాస్త్రవేత్త విజయశంకర్‌బాబు. 

కర్షక కుటుంబం..రైతు సాయం :

ఉరవకొండ మండలానికి చెందిన విజయశంకర్‌బాబు ఇంటర్‌ వరకూ అక్కడే చదువుకున్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ తిరుపతిలో పూర్తిచేశారు. భూసార విభాగంలో పీహెచ్‌డీని బెంగళూరులో పూర్తి చేశారు. 2001లో వ్యవసాయ శాస్త్రవేత్తగా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో చేరారు. నాటి నుంచి భూసార, సస్యరక్షణ విభాగాల్లో విశేష పరిశోధనలు నిర్వహించారు. నేలకు సరిపడా పంటలు సాగుచేయడం వల్ల చీడపీడల తెగుళ్ల బెడదను అరికట్టవచ్చని తెలియజెప్పారు. నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటేనే వ్యవసాయంలో దిగుబడి పెరుగుతుందని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగం పెంచడానికి కృషి చేశారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని గుర్తించారు. విత్తన శుద్ధిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 


వరించిన పురస్కారాలు

వ్యవసాయ పరిశోధనల్లో విస్తృత పరిశోధనలు నిర్వహించినందుకు విజయశంకర్‌బాబుకు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. 2010లో ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు. భూసార పరీక్షలు, ఎరువుల యాజమాన్యంపై 2012లో పీజీ.కృష్ణ బంగారు పతకాన్ని పొందారు. 2015లో తిరుపతిలో రాష్ట్ర ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు స్వీకరించారు. 2017లో వసంతరావునాయక్‌ జాతీయ అవార్డుని అందుకున్నారు. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి రైతునేస్తం అవార్డుని అందుకున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర, జాతీయ సైన్ప్‌ఫేర్లకు న్యాయ నిర్ణేతగా ఉన్నారు.
వ్యవసాయం లాభసాటిగా చేయాలని

అవార్డుల కోసం పనిచేయలేదు. జిల్లాలో వ్యవసాయం లాభసాటిగా మార్చే క్రమంలో భూసార విభాగంలో, ఎరువుల యాజమాన్యంపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాను. ఈ క్రమంలో ప్రభుత్వాలు గుర్తించి అవార్డులు ఇచ్చాయి. ఇంకా 13 ఏళ్లపాటు శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశంతో మరిన్ని పరిశోధనలకు కృషి చేస్తాను. రేకులకుంట పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త వీరరాఘవయ్య, తోటి శాస్త్రవేత్తల సహకారం మరువలేనిది. - విజయ్‌శంకర్‌బాబు భూసార విభాగం శాస్త్రవేత్త  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.