close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

అయ్యప్ప దీక్ష.. ఆరోగ్య రక్ష

ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప భక్తుల సందడి

మాలధారణ రోజుల్లో నియమాల ఆచరణ

మాల ధారణం నియమాల తోరణం అనే అయ్యప్పస్వామి కీర్తనే దీక్ష మహత్మ్యం చెబుతుంది. దీక్ష ధరించినన్ని రోజులు పాటించే నియమాలు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి.

- ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే

కార్తికమాస ఆరంభానికి ముందే అయ్యప్ప దీక్షధారుల సందడి మొదలైంది. ఏటా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి సుమారు నలభై వేలమందికి పైగా భక్తులు అయ్యప్ప దీక్షలను స్వీకరిస్తుంటారు. ప్రతిసారి మాల ధరిస్తున్న వారితోపాటు కోరుకున్న కోర్కెలు తీరాయని కొందరు, తీరాలని మరికొందరు ఏటా నూతనంగా దీక్షలు స్వీకరించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.

సాధారణంగా 108 రోజులు, 61 రోజులు, 41 రోజులు, 21 రోజులు ఇలా వీటిలో భక్తులకు వీలైనన్ని రోజులు మాలధారణ చేస్తారు. స్వామివారి కరుణకటాక్షలు లభించడమే కాకుండా దీక్షా సమయాల్లో పాటించే కనీస నియమాలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయని పండితులు చెబుతున్నారు. తెల్లవారు జామున 4.30 గంటలకు చన్నీటిస్నానం చేసి, నూలు వస్త్రధారణ, నుదట విభూది, సింధూరం, చందనం, మెడలో రుద్రాక్ష, తులసి మాలల ధారణ, షాఢశోపచార పూజలు, నేలపై పడక ఇవన్నీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని పేర్కొంటున్నారు.

దంతధావనం

వేపపుల్లలతో దంతధావనం చేయడం ద్వారా నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. పయోరియా వంటి చిగురు వ్యాధులను నివారిస్తుంది. మద్ది, మర్రి, నేపాలం, రేగ మారేడు, మేడి, కడిమి, ఉత్తరేణి పుల్లలతో దంతధావనం పళ్లకు, నోటికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

రుద్రాక్షమాల

దీక్షలో ధరించే తులసి, మందార, రుద్రాక్ష మాలలు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరస్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మవ్యాధులను నివారిస్తాయి.

త్రిపుండధారణ

త్రిపుండధారణ నుదిటికి మంచిది... నుదుటిపై సూర్యక్రాంతి ప్రసరణ వల్ల కనుబొమ్మల మధ్య ఉండే నాడులు ఉత్తేజితమై శరీరానికి ప్రాణశక్తిని అందిస్తాయి. ముఖపర్చస్సు పెరుగుతుంది. నేత్ర, నాసికా వ్యాధులు దూరమవుతాయి. నిత్యం షాఢశోపచార పూజా విధానంలో ఉండే దీపధూపాలు హారతులు ఆరోగ్యాన్నిస్తాయి.

పంచామృతం సేవనం

పంచామృతం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అరటిపళ్లు, కొబ్బరినీళ్లు కలిపిన పంచామృతంలో శరీరానికి కావాల్సిన సోడియం, కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

నదితీరాన చన్నీటి స్నానం

దీక్ష సమయంలో చన్నీటి స్నానం చేయడం ఆనవాయితీ. అదికూడా నదీ తీరన చేస్తే చక్కటి ఆరోగ్యంతో పాటు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. దీక్ష ముగిసే లోపు ఏదోఒక సందర్భంలో బృందాలుగా ఏర్పడి భద్రాచలంలోని గోదావరి నదితీరాన చన్నీటి స్నానం ఆచరించి పక్కనే ఉన్న భద్రాద్రి రామయ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఏటా కార్తిక మాసంలో సుమారు ఐదువేల మందికి పైగా అయ్యప్ప భక్తులు చన్నీటి స్నానం ఆచరిస్తారు.

అయ్యప్ప క్షేత్రాలు

వైరాలోని హరిహరసుత అయ్యప్ప క్షేత్రానికి ఎంతోపేరుంది. దీనిని తెలంగాణ శబరిమలైగా పిలుస్తారు. కార్తికమాసం నుంచి మకరజ్యోతి వరకు ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకుంటారు. సుమారు రెండువేలమందికి పైగా భక్తులు ఈ క్షేత్రంలో దీక్షధారణ చేస్తారు. దీంతో పాటు ఖమ్మంనగరం శ్రీనివాసనగర్‌లో అయ్యప్పక్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఏటా సుమారు 4వేల మందికి పైగా భక్తులు మాలధారణ చేస్తారు. మధిర, కొత్తగూడెం, పాల్వంచలో అయ్యప్ప క్షేత్రాలున్నాయి.

మతసామరస్యానికి ప్రతీక అయ్యప్ప దీక్ష

-వడ్లమూడి నరసింహారావు, గురుస్వామి

అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ధార్మికభావాలు అలవడతాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.