close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలి

అధికారుల సమావొేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,

చిత్రంలో కలెక్టర్‌ కర్ణన్‌, ఎమ్మెల్సీ బాలసాని, జేసీ అనురాగ్‌ జయంతి

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి బుధవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెల రోజులు నిర్వహించిన పల్లె ప్రగతిలో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో సిటీ పారిశుద్ధ్య ప్రణాళిక చేపట్టేందుకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, ఖమ్మం నగరపాలక సంస్థలో ప్రణాళిక అమలు చేయాలన్నారు. వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు, ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో అవసరమైన ట్రాక్టర్లు, ట్రాలీలు, వాటర్‌ ట్యాంకులు సమకూర్చుకోవాలన్నారు. సిమెంటు రోడ్లు నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌, డ్రైనేజిల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

మిషన్‌ భగీరథ పథకంలో పాలేరు సెగ్మెంట్‌లో 370 ఆవాసాలు, వైరా సెగ్మెంట్‌లో 435 ఆవాసాలకు తాగునీరు బల్క్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి నల్లా బిగించి తాగునీరు సరఫరా చేసే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణం, 35 కి.మీ. పొడవైన ఇంట్రా పైపులైన్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

నెల రోజుల గ్రామ ప్రణాళిక పనుల్లో భాగంగా 584 గ్రామ పంచాయతీల్లో 543 పంచాయతీల్లో శ్మశానవాటికలకు, 549 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులకు స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. జనవరి 1 తేదీ నాటికి గ్రామ పంచాయతీలకు సొంత ట్రాక్టర్లు ఉండాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు తెరవాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తి చేయాలని చెప్పారు.

కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు 86 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా 110 కేంద్రాలకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పీఏసీఎస్‌ల ద్వారా 85, ఐకేపీ మహిళా గ్రూపుల ద్వారా 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 20 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో మొదటి కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలిపారు. డీసీసీబీ ద్వారా గ్రామ పంచాయతీల్లో వాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, జేసీ అనురాగ్‌ జయంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హన్మంత్‌ కొడింబ, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్వో శిరీష, డీఆర్డీవో ఇందుమతి, డీఏవో ఝాన్సీలక్ష్మీకుమారి, సీపీవో కొండపల్లి శ్రీరామ్‌, డీఎంహెచ్‌వో కళావతిబాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నాటకీయ పరిణామాలు: ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి పువ్వాడ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం ఉంటుందని, హాజరవ్వాలని ఆయా శాఖల జిల్లా అధికారులకు సమాచారం అందించారు. మంత్రి పువ్వాడ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి పరుగులు తీశారు. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వారిని పోలీసులు ఆవరణలోకి అనుమతించి ఆంధ్రాబ్యాంకు వెలుపల వేచి ఉండాలని సూచించారు. మంత్రి వెళ్లిపోతున్న సమయంలో లోనికి అనుమతించారు. మంత్రి పువ్వాడ సూచన మేరకు అఖిల పక్ష నేతల నుంచి వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు స్వీకరించారు. లోపల మంత్రి అజయ్‌కుమార్‌ ఉన్నంత వరకు కలెక్టరేట్‌ ప్రధాన గేట్లు మూసేశారు. మంత్రి పువ్వాడ కలెక్టరేట్‌ నుంచి వెళ్లిపోయే వరకు అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.