close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

పంచాయతీకో ట్రాక్టర్‌..

చెత్త సేకరణకు ట్రాలీ.. హరితహారానికి ట్యాంకర్‌

కొనుగోలుకు జిల్లా అధికారుల కసరత్తు

ఖమ్మం జిల్లాలో పంచాయతీలు: 584

భద్రాద్రి కొత్తగూడెంలో 479

కొణిజర్ల, న్యూస్‌టుడే

పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలుకు సిద్ధమైంది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుతోపాటు మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యత. సీజనల్‌ వ్యాధులను అరికట్టి ప్రజా శ్రేయస్సుకు దోహదం చేసేలా చర్యలు తీసుకోవడం ప్రధాన విధి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో బహుళ ప్రయోజనాలుండే ట్రాక్టర్లను సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయా జిల్లాలు, మండలాలకు అందజేసింది. మండల స్థాయిలో అధికారులు, సర్పంచులతో సమీక్షలను నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 25లోపు వాటి కొనుగోళ్లకు సంబంధించి అన్ని చర్యలు పూర్తవాలని సూచనలు చేసింది.

పంచాయతీలో ట్రాక్టర్‌ అత్యవసరంగా మారింది. ప్రతి పనికీ అద్దెకు తీసుకోవడం వల్ల ఎక్కువ నిధులు దానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం బహుళ ప్రయోజనాలు చేకూరేలా ట్రాక్టర్‌తో పాటు గ్రామాల్లో వ్యాధులకు కారణమవుతున్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు ట్రాలీ, హరితహారం మొక్కల నీటి సరఫరాకు ట్యాంకర్‌ సమకూర్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు పంచాయతీల్లో ఎక్కడా ట్రాక్టర్‌తో చెత్తాచెదారాన్ని తొలగించే పరిస్థితి లేదు. గతంలో చెత్త సేకరణకు రిక్షాలు ఇచ్చినా అవి నిరుపయోగంగానే మారాయి. ఈసారి అలాకాకుండా అన్ని ప్రయోజనాలుండేలా 15 హెచ్‌పీ నుంచి 25హెచ్‌పీ ఉన్న ట్రాక్టర్‌, 5 టన్నుల లోడ్‌ సామర్థ్యం ఉన్న ట్రాలీ, 5వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పంచాయతీల జనాభా, అక్కడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ల సామర్థ్యాన్ని నిర్ణయించారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ రకం తమకు ఉపయోగమో, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలు సిద్ధంచేసి ఉన్నతాధికారులకు సమర్పించాలి.

జిల్లా స్థాయి కమిటీ

వాహన కొనుగోలుకు జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ అధ్యక్షుడిగా, డీపీవో మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. డీఆర్‌డీవో, డీఏవో, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి, జిల్లా పరిశ్రమల అధికారి సభ్యులుగా ఉంటారు.

కొనుగోలు ఇలా..

ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగోలు బ్యాంకుల ఆర్థిక సాయంతో కొనుగోలు చేయనున్నారు. వాయిదాల పద్ధతిలో పంచాయతీలు నగదు చెల్లించాలి. ఆయా పంచాయతీ ఆదాయం బట్టి ఈఎంఐ నిర్ణయిస్తారు. ఇదిలా ఉంటే పంచాయతీ నిధులతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా లేక ఈఏంఐల పద్ధతిలో పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత రావాలి. ఈఎంఐ పద్ధతికే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏ పద్ధతిన కొనుగోలు చేయాలనే విషయంపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుటుంది. పంచాయతీల జనాభాను బట్టి ఎన్ని ట్రాక్టర్లు అవసరమో గణాంకాలు తయారీ పనిలో నిమగ్నమయ్యారు.

బహుళ నైపుణ్య కార్మికులకే..

పంచాయతీ పరిధిలో గతంలో రూ.1600 నుంచి రూ.5వేల వరకు వేతనం తీసుకుంటూ పనిచేసే కార్మికులు ఉన్నారు. ఇప్పుడు వారందరికి ప్రభుత్వం రూ.8500 వేతనం అందించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతి 500 జనాభాకు ఒక మల్టీపర్పస్‌ వర్కర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అందులో ఒకరు తప్పనిసరిగా ట్రాక్టర్‌ నడిపే వ్యక్తి ఉండాలని లేకుంటే శిక్షణ ఇచ్చి పనిచేయించాల్సి ఉంటుంది. ప్రతి వర్కర్‌ పంచాయతీలో పారిశుద్ధ్యం, వీధిదీపాలు, ఇతరత్రా అన్ని పనులు చేసేలా ఉండాలి. ఈ వర్కర్లు అదే పంచాయతీకి చెందినవారే ఉండాలి. 500 జనాభా కంటే తక్కువ ఉంటే ఇద్దరు వర్కర్లు ఉండేలా చూడాలి. మండల పంచాయతీ అధికారి వర్కర్ల ప్రతిపాదనలను డీపీవోకు ద్వారా కలెక్టర్‌కు అందజేయాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.