ఆదివారం, డిసెంబర్ 08, 2019
కాళోజీ ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్, రిజిస్ట్రార్ బలరాములు
తెవివి క్యాంపస్(డిచ్పల్లి), న్యూస్‌టుడే: విద్యార్థులకు తెలుగు భాష పరిజ్ఞానంతో పాటు సాహిత్య మూలాలు తెలిసేలా విద్యాబోధన చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిల్‌కుమార్ తెలిపారు. వర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో బుధవారం జరిగిన తెలుగు అధ్యయనశాఖ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సహాయ ఆచార్యురాలు లావణ్య సంపాదకత్వం వహించిన ‘కాళోజీ ప్రస్థానం-సాహిత్య పరిమళం’ పుస్తకాన్ని రిజిస్ట్రార్ బలరాములుతో కలిసి ఆవిష్కరించారు. సహాయ ఆచార్యుడు బాల శ్రీనివాసమూర్తి తన సంపాదకత్వంలో వెలువరించిన తెలంగాణ సాహిత్య చరిత్ర సంపుటాలను వీసీకి బహుకరించారు. డీన్ కనకయ్య, విభాగం అధ్యాపకులు లక్ష్మణ చక్రవర్తి, త్రివేణి పాల్గొన్నారు.
వాలంటీర్లకు అభినందన
తెవివి క్యాంపస్(డిచ్పల్లి): గుజరాత్లో నవంబర్ 4 నుంచి 15 వరకు జరిగే ప్రీ-పరేడ్‌కు ఎంపికైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అర్జున్‌కుమార్(కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ), వీణాశ్రీ(వశిష్ఠ డిగ్రీ కామారెడ్డి)లను ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్ బుధవారం అభినందించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రవీణాబాయి ఉన్నారు.
ప్రత్యక్ష ప్రవేశాల ద్వారా సీట్లు భర్తీ చేయాలి
భిక్కనూరు, న్యూస్‌టుడే: తెవివి దక్షిణ ప్రాంగణంలోని వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ప్రత్యక్ష ప్రవేశాల (స్పాట్ అడ్మిషన్ల) ద్వారా భర్తీ చేయాలని విద్యార్థి ఐకాస అధ్యక్షుడు స్వర్గం సందీప్ డిమాండ్ చేశారు. ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ ప్రాంగణంలోని ఏడు కోర్సుల్లో 60 సీట్లు ఖాళీగా ఉన్నాయని, తెలంగాణ వర్సిటీ మొత్తంలో 150 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఎంఏ రాజనీతిశాస్త్రంలో 12, చరిత్రలో 6, తెలుగులో 18 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఐకాస నాయకులు సుధాకర్, వినోద్, ప్రకాశ్, అంజయ్య, మధు, విజయ్ పాల్గొన్నారు.
విచారణ జరిపించాలి
తెవివి క్యాంపస్(డిచ్పల్లి): తెవివిలో మహిళా ఉద్యోగుల్ని కించపరిచేలా ఆకాశ రామన్న పేరుతో కరపత్రాలు, బుక్లెట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌కు విద్యార్థి సంఘం నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు