close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

చెరకు విస్తీర్ణం పెరచాలి.. తీపి పంచాలి

అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ వెంకటరవి

శాస్త్రవేత్తల, కర్మాగార అధికారుల సమీక్ష

వర్ని, న్యూస్‌టుడే

  హాజరైన శాస్త్రవేత్తలు, కర్మాగార అధికారులు, ప్రతినిధులు

చక్కెర కర్మాగారాల అధికారులు, శాస్త్రవేత్తలు కలిసికట్టుగా కృషి చేస్తేనే చెరకు విస్తీర్ణం పెరుగుతుందని, ఈ దిశగా ప్రయత్నం చేస్తే నూతన వంగడాలు వెలుగులోకి వస్తాయని అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ వెంకటరవి పేర్కొన్నారు. రుద్రూర్‌ వరి, చెరకు పరిశోధన స్థానం ఆధ్వర్యంలో చెరకు విస్తరణ పెంచే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో చక్కెర కర్మాగారాల అధికారులు, శాస్త్రవేత్తలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక కారణాలతో విస్తీర్ణం తగ్గుతూ వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కర్మాగారాలకు 25 లక్షల టన్నుల చెరకు అవసరముండగా కేవలం 13 నుంచి 15 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత చెరకు మండలిలో పరిశోధన స్థానం నుంచి పరీక్షలకు ఎంపికైన ఆరు నూతన చెరకు వంగడాలను ప్రదర్శించారు. ఇందులో వివిధ జిల్లాల చక్కెర కర్మాగారాల అధికారులు, ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

సమస్యలపై చర్చ

సదస్సులో వివిధ అధికారులు, ప్రతినిధులు చెరకు సాగులో సమస్యలు, కొత్త రకాల ఆవశ్యకత, చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక, అధిక చక్కెర శాతం కలిగే రకాలు, నీటి ఎద్దడిని తట్టుకొనే రకాల గురించి శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ రకాలు రైతులకు అందుబాటులో ఉంచితే విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. సంగారెడ్డి, కామారెడ్డి కర్మాగారాల పరిధిలో నీటి ఎద్దడితో విస్తీర్ణం తగ్గుతుందని చెప్పారు. కాటుక తెగులు, పీక పురుగును తట్టుకొనే రకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధికారులు అడిగిన సమస్యలకు ప్రధాన శాస్త్రవేత్త విజయ్‌కుమార్‌, శాస్త్రవేత్త ఈశ్వర్‌రెడ్డి ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు.

కాలానుగుణంగా రకాలు ఎంచుకోవాలి

- డా.వెంకటయ్య, పరిశోధనస్థానం అధిపతి

కాలానుగుణంగా వివిధ రకాలను రైతులు ఎంచుకోవాలి. నీటి ఎద్దడి, కూలీల కొరత, యంత్రీకరణ అవలంబించకపోవడం మూలంగా విస్తీర్ణం తగ్గుతుంది. నీటి యాజమాన్యం, సస్యరక్షణపై పరిశోధనలు జరిపి మేలైన రకాలను అందించడానికి శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. పరిశోధన స్థానం నుంచి రెండు సంవత్సరాల్లో అధిక దిగుబడులనిచ్చే రెండు నూతన రకాలు అందుబాటులోకి వస్తాయి. తరచుగా ఇలాంటి సదస్సులు నిర్వహించి రైతుల్లో చైతన్యం కలిగిస్తున్నాం.

విస్తీర్ణం పెంచే దిశగా..

- డా.విజయ్‌కుమార్‌, ప్రధాన చెరకు శాస్త్రవేత్త

రాష్ట్ర వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే సదస్సు నిర్వహించాం. జాతీయ స్థాయిలో రూపొందించబడిన చెరకు రకాల్లో ఈ ప్రాంతానికి అనువైన చక్కెర శాతం కలిగిన రకాల్లో అధిక దిగుబడి సాధించాల్సిన అవసరం ఉంది. విశ్వ విద్యాలయం నుంచి త్వరలోనే చెరకు రకాలు ప్రాథమికస్థాయి పరీక్షలు పూర్తి చేసుకొని రైతు స్థాయిలో పరీక్షించడానికి పరిశోధనలు ముందుకు వెళ్తున్నాయి.

రైతులను సంతృప్తి పరిచినప్పుడే..

- సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు, మాగి కర్మాగారం

రైతులను సంతృప్తి పరిచినప్పుడే సాగు పెరుగుతుంది. ఫలితంగా అటు కర్మాగారాలు, ఇటు రైతులు అభివృద్ధి చెందుతారు. మాగి కర్మాగారంలో 12 కోత యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి కూలీల సమస్యను అధిగమించాం. కర్మాగారం పరిధిలో పలువురు రైతులకు రాయితీ బిందుసేద్యం యంత్రాలను అందించాం.

రాయితీపై బిందుసేద్యం యంత్రాలు..

- వేణుగోపాల్‌, ఉపాధ్యక్షుడు, గాయత్రి కర్మాగారం

బిందుసేద్యం యంత్రాలను రాయితీపై ప్రభుత్వం అందించాలి. నీటి ఎద్దడితో కర్మాగారం పరిధిలో చాలామంది రైతులు సాగు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడిని తట్టుకొనే స్వల్పకాలిక రకాలను శాస్త్రవేత్తలు అందించాలి. చక్కెర కర్మాగారంలో ప్రతి సంవత్సరం కోటికి పైగా చెరకు మొలకలను పెంచి రైతులకు అందిస్తున్నాం.

చౌడు సమస్యలపై అవగాహన కల్పించాలి

- దయాకర్‌రెడ్డి, మేనేజర్‌, గణపతి షుగర్స్‌, సంగారెడ్డి

ప్రధానంగా సంగారెడ్డి గణపతి షుగర్స్‌ పరిధిలో చౌడు సాగు భూములతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చౌడు సమస్యపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటి ఎద్దడి, అడవి పందులను తట్టుకొనే రకాలు అవసరం. వేరు పురుగు తీవ్రత సంగారెడ్డిలో అధికంగా ఉంది. యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు జరపాలి.

భూసార పరీక్షల ఆధారంగా..

- డా.ప్రభాకర్‌రెడ్డి, మృత్తిక శాస్త్రవేత్త

సాగు చేసే భూముల్లో భూసార పరీక్షల ఆధారంగా యాజమాన్య పద్ధతులు, రసాయన ఎరువులను వినియోగించుకోవాలి. నేలలో ఉదజని సూచికతో పరీక్షించాలి. దాని ఆధారంగా జిప్సంను వాడుకోవాలి. చెరకు సాగులో బిందుసేద్య విధానం ద్వారా రసాయన ఎరువులను వినియోగించుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్ఛు అత్యాధునిక భూసార పరీక్షా కేంద్రం పరిశోధన స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.