close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

రెండు రోజులు.. ఏడు చోరీలు

ఆలయాలే లక్ష్యంగా రెచ్చిపోతున్న దుండగులు

భయాందోళనలో ప్రజలు

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

గ్రామస్థులు మేల్కొవడంతో సుద్దులం పెద్దమ్మ ఆలయంలో దొంగలు వదిలేసిన నగదు (పాతచిత్రం)

ఈ నెల 22న ఇందల్‌వాయి మండలం లోలం పెద్దమ్మ ఆలయంలోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి రూ.10 వేల విలువైన సొత్తు దోచుకెళ్లారు. అదే రోజు ధర్పల్లి మద్దుల్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మీ నర్సింహస్వామి గుడితో పాటు గోవింద్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు.

సోమవారం రాత్రి ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంతో పాటు రామడుగు రేణుక ఎల్లమ్మ, డిచ్‌పల్లి మండలంలోని సుద్దులం పెద్దమ్మ, కోరట్‌పల్లి సాయిబాబా ఆలయాల్లోకి దుండగులు ప్రవేశించి హుండీలు ధ్వంసం చేశారు. వీరి అలికిడికి సమీపంలోని హమాలీలు నిద్రలేవడంతో నగదు వదిలేసి పారిపోయారు.

ఈ రెండు ఘటనలు జరిగిన తీరు పరిశీలిస్తే ఒకే గ్రూపునకు చెందిన వ్యక్తులే ఈ చోరీలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఒక మార్గంలోని ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయాల్లోని దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. భక్తులు హుండీల్లో వేసిన కానుకలను ఎత్తుకెళ్తున్నారు. ఆలయాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన భద్రత లేకపోవడంతో పాటు గ్రామాలకు దూరంగా ఉండటంతో దోపిడీకి పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నచోట ముఖాలు కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

ధర్పల్లి పెద్దమ్మ ఆలయం

సమ్మె ప్రభావంతో తగ్గిన గస్తీ

ఆర్టీసీ కార్మికులు 25 రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఆ బందోబస్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. తక్కువ మొత్తంలో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది బస్సుల రక్షణకు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ చేయడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగులు అందినకాడికి దోచుకెళ్తున్నారు.

● సీసీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యం

గ్రామాభివృద్ధి కమిటీలతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంలో పోలీసులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇతరత్రా పనుల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే కమిటీలు సీసీ కెమెరాల ఏర్పాటులో ముందుకు రావాల్సిన అవసరముంది.

భద్రతా చర్యలు అవసరం..

మధ్యాహ్నం రెక్కి నిర్వహించి వారికి అనుకూలమైన మార్గాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీటిని అరికట్టడానికి ఆలయాల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలి. రాత్రి వేళల్లో ఒకరిని కాపలా ఉంచాలి.

పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం

- ప్రసాద్‌, సీఐ, ధర్పల్లి

గతంలో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశాం. వారి సహకారం తీసుకోవడంతో పాటు పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. ఘటనా స్థలాల్లో లభించిన ఆధారాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. గ్రామాభివృద్ధి కమిటీలతో మాట్లాడి వాటికి మరమ్మతులు చేయిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.