సోమవారం, డిసెంబర్ 16, 2019
పల్లెకు వెళ్లని బస్సు
ఆర్టీసీ అధికారుల కాకి లెక్కలు
ఒకే బస్సు రావడంతో ఫుట్‌బోర్డుపై ప్రమాదకర ప్రయాణం
‘‘విద్యార్థి కళాశాలకు వెళ్లలేకపోయాడు.. తల్లి బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయింది.. వ్యాపారి రావాణా ఛార్జీలతో నష్టపోయాడు.. మహిళా రైతు ఐదు కి.మీ. నడవాల్సి వచ్చింది.. దంపతులు ఒక పూటంతా వేచి చూసినా ఫలితం లేక ప్రయాణం వాయిదా వేసుకున్నారు.’’
- శుక్రవారం జిల్లాలోని వివిధ బస్టాండ్లలో కనిపించిన దృశ్యాలు ఇవి.
ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతోంది. సరిపడా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పేదలను ప్రైవేటు వాహనదారులు దండుకుంటున్నారు. కొన్ని సర్వీసులునడుస్తున్నా గంటల కొద్దీ ఆలస్యంగా వస్తున్నాయి. ఉద్యోగులు సమయానికి వెళ్లలేక అల్లాడుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలని అధికారులను కోరుతున్నారు.
‘వాస్తవంగా ఎన్ని బస్సులు నడుపుతున్నారో స్పష్టంగా చెప్పాలని ఇటీవల హైకోర్టు కోరడం అధికారుల లెక్కలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.’
ఆటోల వద్ద వేచిచూస్తున్న మహిళా ఉద్యోగి
సమ్మె ప్రారంభమైన తర్వాత సుమారు వారం రోజులు కొన్ని గ్రామాలకే బస్సులు పంపించారు. ప్రస్తుతం కొన్ని రూట్లలో 12 బస్సులు వెళ్లాల్సి ఉంటే ఆరే నడుపుతున్నారు. కండక్టర్లకు టిమ్స్ యంత్రాలు ఇస్తుండగా వాటిని వినియోగించడం రాని కొందరు బస్సులను మధ్యలో నుంచే డిపోలకు తీసుకొచ్చి వదిలేస్తున్నారు. అధికారులు హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన రూట్లపై దృష్టి సారించారే తప్ప పల్లె వెలుగు బస్సులను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది.
ద్విచక్రవాహనంపై కూరగాయల బుట్టలతోనల్లవెల్లి రైతు గంగారెడ్డి
తిరుగు ‘ప్రయాణం’
నిరీక్షించి.. నీరసించి
మద్నూర్‌కు చెందిన గంగామణి బాన్సువాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు బస్సు కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ప్రయాణంలోనే ఇంత అలిసిపోతే ఇక పనెలా చేయలగమని వాపోయారు.
హాజరు 50 శాతమే...
బస్సు లేకపోవడంతో కాలినడకన వెళ్తున్న విద్యార్థులు
ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇందల్వాయి, సిరికొండ మండలాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు తరగతులు జరుగుతాయి. విద్యార్థుల సంఖ్య 460 ఉండగా సమ్మె కారణంగా హాజరు 50 శాతం కూడా ఉండట్లేదు.వస్తున్న వారు కూడా ఆటోలకు అధిక ఛార్జీలు చెల్లించి వస్తున్నారు. పరీక్ష ఫీజు గడువు దగ్గర పడటంతో శుక్రవారం ఒక్కరోజు 200పైగా వచ్చినట్లు ప్రిన్సిపల్ రజియొద్దిన్ తెలిపారు.
పాఠ్యాంశాలు కోల్పోతున్నాం
బస్సులు సమయానికి రాకపోవడంతో కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నాం.పాఠ్యాంశాలు కోల్పోతున్నాం. ఆటోలో రానుపోను రూ.50 చెల్లించాల్సి వస్తోంది.
- భారతి, బైపీసీ ద్వితీయ సంవత్సరం, రేకులపల్లి
విద్యార్థులకు ‘పరీక్షా’ సమయం
న్యూస్‌టుడే, మోపాల్
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్య ప్రజలతోపాటు విద్యార్థులూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వారికి పరీక్షలు నడుస్తున్నాయి. నగర శివారులోని బోర్గాం(పి) పాఠశాలకు మోపాల్తోపాటు కంజర్, కులాస్పూర్, ముల్లంగి గ్రామాల నుంచి 180 మంది పిల్లలు రోజూ వెళ్తారు. నగరంలోని కళాశాలలకు మరో 150 మంది నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తారు. గతంలో కులాస్పూర్, కంజర్, మోపాల్ మీదుగా ఉదయం 8, 8:30, 9 గంటలకు బస్సులు నడిచేవి. సమ్మె కారణంగా ఒక ట్రిప్పు మాత్రమే నడుస్తోంది. అది కూడా సమయానికి రావట్లేదు. శుక్రవారం ఒకేఒక్క బస్సు 9 గంటల తర్వాత రావడంతో కిక్కిరిసిపోయింది. చాలామంది విద్యార్థులు అధిక ఛార్జీలు చెల్లించి ఆటోల్లో వెళ్లారు.
మూడు గంటలైనా ఒక్కటీ రాలె
కుటుంబసభ్యులతో కలిసి కొండూర్ నుంచి సిరిసిల్ల వెళ్లడానికి సిరికొండ బస్టాండుకు ఉదయం 10 గంటలకు వచ్చాను. మధ్యాహ్నం 1.30 అవుతున్నా ఒక్కటీరాలేదు. బస్సు ఛార్జీ రూ.40 ఉండగా.. ప్రైవేటు వాహనాల వారు ఒకరికి రూ.150 చొప్పున అడుగుతున్నారు. బస్సులు యథావిధిగా నడిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- న్యూస్‌టుడే, సిరికొండ
సమయపాలన లేక ఇబ్బందులు
మా గ్రామంలో నాతో పాటు మరో 30 మంది కూరగాయలు సాగు చేస్తారు. వారంలో ఐదు రోజులు చుట్టు పక్కల సంతకు బస్సుల్లో తీసుకెళ్లి విక్రయిస్తాం. ప్రస్తుతం బస్సులు నడుస్తున్నా సమయానికిరావడం లేదు. నాలుగు కూరగాయల గంపలతో ద్విచక్రవాహనంపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నాం.
- న్యూస్‌టుడే, ఇందల్వాయి
పాస్ ఉన్నా కాలినడకనే..
మేము బోర్గాం(పి)లోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాం. కంజర్ నుంచి బోర్గాం వెళ్లడానికి బస్‌పాస్ తీసుకున్నాం. బస్సులు రాకపోవడంతో రోజూ నడుచుకుంటూ వెళ్తున్నాం. - ప్రశాంత్, నితిన్, తొమ్మిదో తరగతి, కంజర్
ఆస్పత్రికి వెళ్లాలంటే ఆపసోపాలు
మద్నూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు వారి పిల్లలను నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఉదయం బస్టాండుకు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురుచూసినా బస్సు రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించారు.
- న్యూస్‌టుడే, మద్నూర్
వృద్ధుల ఇబ్బందులు
సోనాల గ్రామానికి చెందిన ఈ ఇద్దరు వృద్ధులు అతి కష్టం మీద మద్నూరు వచ్చారు. సిర్పూర్ బస్సు రాకపోవడంతో మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు