సోమవారం, డిసెంబర్ 16, 2019
సమీక్షలో పుర పరిపాలన అధికారిణి శ్రీదేవి
సమావేశంలో మాట్లాడుతున్న పురపాలక శాఖ పరిపాలన అధికారిణి శ్రీదేవి,
పక్కన నిజామాబాద్ పాలనాధికారి ఎంఆర్ఎం రావు
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: వచ్చే ఏడాది మే 1 నాటికి చెత్త రహిత నగరం, పట్టణాలుగా తీర్చిదిద్దాలని పురపాలక శాఖ పరిపాలన అధికారిణి శ్రీదేవి అన్నారు. నిజామాబాద్లో శుక్రవారం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పుర అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు.
కమిషనర్లదే బాధ్యత
ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ అనేది పక్కాగా జరగాలని ఆదేశించారు. చెత్త సేకరణకు కావల్సిన కార్మికులు, వాహనాలు ఉంటే సరిపోదని..ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు. రహదారులపై చెత్త పారవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చెత్త సేకరించేందుకు అవసరమైన నిధులు కావాలంటే 14వ ఆర్థిక సంఘం, ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన నిధులు వినియోగించుకోవాలన్నారు.
డిసెంబర్ 31 నాటికి పాలిథిన్ నిషేధం
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్లాస్టిక్ రహిత నగరం, పట్టణాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఒకసారి వాడి పారేసిన పాలిథిన్ను పూర్తిగా నిషేధించాలన్నారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో ఛైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజలు, వ్యాపారులు పాలిథిన్కు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనేలా కావల్సిన చర్యలు చేపట్టాలన్నారు.
కుక్కలను నియంత్రించాలి
కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దీని విషయంలో మున్సిపల్ అధికారులు పశు సంవర్ధక శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు.
పందులను రానివ్వొద్దు
పందులను పట్టణాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎరుకుల వారికి పందులు జీవనాధారం. మున్సిపల్ స్థలంలో ప్రత్యేకంగా పందులు పెంచుకొనే విధంగా చూడాలన్నారు. అవసరమైతే వారికి వేరే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
* పాలనాధికారి ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ..పట్టణాల్లో గ్రీన్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భీమ్గల్ మున్సిపాల్టీకి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ జాన్ సాంసన్, మెప్మా పీడీ రాములు, ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలక సంఘాల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు