close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

అధికారుల్లో అలజడి

ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ కరవు

తాజా ఘటనతో అధికారుల్లో చర్చ

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌పై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఉద్యోగుల కొవ్వొత్తుల ప్రదర్శన
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తహసీల్దారు కార్యాలయంలోనే నిందితుడు ఆమెను సజీవదహనం చేశాడు. తాజా ఘటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకింత భయాందోళనలు మొదలయ్యాయి.

జిల్లాలోనూ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతంలో అటవీ శాఖ అధికారిని హత్య చేసిన ఘటన ఇంకా మరిచిపోలేదు. ఉద్యోగులపై దాడులకు తెగించడం, విధులకు ఆటంకం కలిగించడం షరామామూలైంది.

నాలుగేళ్లలో 46 కేసులు

ప్రభుత్వ అధికారులపై దాడులకు సంబంధించి జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. ఇందులో విధులకు ఆటంకం  కలిగించినవి 26 ఉండగా మరో 8 దాడికి పాల్పడినవి ఉండగా.. 12 దాడికి యత్నించినవి ఉన్నాయి.

‘అడ్డు’గోడలు లేక

ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షణ వ్యవస్థ ఏమీ ఉండట్లేదు. అధికారుల వద్దకు వెళ్లాలంటే ‘అడ్డు’గోడలు లేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో నిఘా వ్యవస్థ కొరవడింది. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు మచ్చుకైనా కనిపించడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. కనీసం ప్రజావాణి నిర్వహించే సోమవారం రోజైనా పోలీసులు భద్రతా చర్యలు కల్పించడం లేదు. భూముల విలువ పెరగడం.. ఇటీవల ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ‘భూ’సమస్యలు ఎక్కువయ్యాయి. సమస్యల పరిష్కారానికి తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చే వారు పెరిగారు.

ప్రధానంగా ఈ శాఖలే..

* రెవెన్యూ శాఖతో ప్రజలకు ఎక్కువ సంబంధాలుంటాయి. ఆయా కార్యాలయాలకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో రోజుకి సుమారు 150 మంది వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు.

* నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లోనూ విధులు నిర్వర్తించే సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. ఆక్రమణలు అడ్డుకొన్నా, ప్రజారోగ్యంపై తనిఖీ చేసినా దాడులకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి.నిజామాబాద్‌లో ఆక్రమణలను కూల్చివేసేందుకు వెళ్లిన సిబ్బందిపై గతంలో దాడికి పాల్పడిన ఘటన జరిగింది.

* అటవీ భూమిని ఆక్రమిస్తున్నారనే సమాచారంతో వెళ్లిన ఎఫ్‌ఆర్వోను ఆక్రమణదారులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన తర్వాత కూడా అటవీ అధికారులపై భౌతిక దాడులకు అడ్డుకట్ట పడట్లేదు.

* టెండర్ల వ్యవహారంలో ఓ జిల్లాస్థాయి అధికారిణిని తాజాగా కార్యాలయంలో బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారిణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భీమ్‌గల్‌ మండలంలో తనిఖీకి వెళ్లిన అటవీశాఖ అధికారిపై గ్రామస్థులు దాడికి పాల్పడడంతో ఆ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు

పోలీసులకు తప్పట్లేదు

* ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమల్లోకి వచ్చాక వీరికి సైతం ఎదురు తిరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాహనాల తనిఖీ సమయంలో గతంలో కొందరు వ్యక్తులు పోలీసుల పైనే చేయి చేసుకున్నారు.

* అర్ధరాత్రి వేళ పోకిరీలను ఆపిన ఓ అధికారిపైకి వారు తిరగబడ్డారు. దుర్భాషలాడి బెదిరింపులకు పాల్పడి అక్కడి నుంచి పరారైన ఘటన జరిగింది.

రెవెన్యూలో అధికం

* నిజామాబాద్‌లో ఓ ఆర్డీవోకు కొందరు వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతు చూస్తామని దౌర్జన్యానికి పాల్పడ్డారు. అప్పట్లో అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

* నిజామాబాద్‌ నార్త్‌ తహసీల్దారు కార్యాలయంలోనే బెదిరింపులకు దిగి దాడి వరకు వెళ్లారు. సిబ్బంది అడ్డుకోవడంతో అధికారిణికి ఏమీ కాలేదు. అప్పట్లో ఈ ఘటనపై సిబ్బంది నిరసనలు కూడా తెలిపారు.

* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎఫ్‌ఆర్వో గంగయ్య హత్య జిల్లాలోనే జరిగింది. 2013లో జరిగిన ఈ ఘటనలో 14 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది.

* అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు భీమ్‌గల్‌లో తనిఖీలు జరిపారు. పట్టుబడిన వారు తమను వదిలివేయాలంటూ అధికారులని చితకబాదారు.

* నిజామాబాద్‌లోని బోధన్‌ రోడ్డులో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్‌ సిబ్బందిపై కొందరు దాడికి యత్నించారు. సమయానికి పోలీసులు చేరుకోవడంతో అధికారులు, సిబ్బందికి ఏమీ కాలేదు. ఈ ఘటనపై అప్పట్లో నలుగురిపై కేసులు నమోదు చేశారు.

* డిచ్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై విధుల్లో ఉన్న మార్కెట్‌ కమిటీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వాహనాన్ని నిలిపినందుకు అతనిపై నుంచి వాహనాన్ని ఎక్కించి హత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన చర్చకు తావిచ్చింది.

* వసతిగృహాల టెండర్‌ విషయమై ఓ గుత్తేదారుడు జిల్లా స్థాయి అధికారిణిని బెదిరించాడు. కార్యాలయంలోనే దౌర్జన్యం చేయడంతో అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో గుత్తేదారుడిపై కేసు కూడా నమోదైంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.